సైబర్ ముఠా గుట్టు రట్టు | cyber thieves are robberys very intelligent | Sakshi
Sakshi News home page

సైబర్ ముఠా గుట్టు రట్టు

Published Fri, Aug 30 2013 5:52 AM | Last Updated on Mon, May 28 2018 1:08 PM

cyber thieves are robberys very intelligent

తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఏటీఎం సెంటర్లలో వెనకాలే నిల్చొని ఇతరుల ఏటీఎం కార్డుపై గల సీవీవీ- పిన్ నంబర్లు రహస్యంగా తెలుసుకుని, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకునే ముఠాలోని ఇద్దరు సభ్యులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై  పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సీఐ లక్ష్మినారాయణ వెల్లడించారు. నిందితుల్లో వైఎస్సార్ జిల్లా తొండూరుకు చెందిన శివకంచిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. వీరు రాయలసీమలోని వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడ్డారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా వీరిని గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. నలుగురికి పైగా సభ్యులు గల ఈ ముఠా వైఎస్సార్ జిల్లా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతోంది. కొంత కాలంగా తాడిపత్రిలోని వాణిజ్య బ్యాంకుల ఖాతాదారుల్లో కొందరు ఇటీవల తమ ప్రమేయం లేకుండానే డబ్బు డ్రా అయిందని బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ప్రవీణ్‌కుమార్ ఖాతాలో రూ.9,100, గంగాధర్ ఖాతాలో రూ.9656, వెంకటేశ్వర్లు ఖాతాలో రూ.6 వేలు నగదు గల్లంతు కావడంతో బాధితులు లిఖితపూర్వకంగా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
 బ్యాంకు అధికారులు తీవ్రంగా పరిగణించి.. సైబర్ నేరాలకు పాల్పడే ముఠాపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుల్లో కొందరిని పిలిపించి ఏటీఎం కార్డు ఎక్కడ ఉపయోగించిందీ, సమయం, తేదీలు తెలుసుకుని.. దాని ఆధారంగా ఏటీఎం సెంటర్లలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఖాతాదారుడు నగదు డ్రా చేస్తుండగా.. వెనకాలే ఇద్దరు అపరిచిత వ్యక్తులు తదేకంగా గమనిస్తుండటాన్ని గుర్తించారు. పట్టణంలోని చాలా ఏటీఎం సెంటర్లలో ఈ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఫిర్యాదుదారులకు ఆ వ్యక్తులను చూపించగా.. వారెవరో తమకు తెలియదని చెప్పారు.
 
 పవీణ్, గంగాధర్ గురువారం కెనరా బ్యాంకు ఏటీఎం వద్ద డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. అక్కడ అపరిచిత వ్యక్తులను గుర్తించి అధికారులకు సమాచారమందించారు. వెంటనే బ్యాంకు అధికారులు అప్రమత్తమై ఏటీఎం కేంద్రం తలుపులు మూసివేసి.. బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు పారిపోగా.. శివకంచిరెడ్డి, మధుసూదనరెడ్డి పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారివద్ద గల ఏటీఎం కార్డులు, ఇంటర్‌నెట్ కేబుల్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.సైబర్ నేరం కావడంతో నిందితులను అనంతపురం సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు తాను విలేకరినని చెప్పుకోవడం గమనార్హం. అయితే గుర్తింపు కార్డును చూపలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement