బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. మరోపక్క, వార్షిక ఆదాయ అంచనాలకు భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో(2017–18, క్యూ2) కంపెనీ రూ.3,726 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,606 కోట్లతో పోలిస్తే 3.3% వృద్ధి నమోదైంది.
మొత్తం ఆదాయం స్వల్పంగా 1.5 శాతం మాత్రమే పెరిగింది. గతేడాది క్యూ2లో రూ.17,310 కోట్ల నుంచి ఈ క్యూ2లో రూ.17,567 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే లాభం 7.3% వృద్ధితో 578 మిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయం 5.4% ఎగబాకి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రమోటర్లతో పొసగక సీఈఓ పదవికి విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేసిన తర్వాత ఇవి తొలి ఫలితాలు కావడం గమనార్హం.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో ఇన్ఫోసిస్ నికర లాభం 6.9 శాతం పెరిగింది. ఇక ఆదాయం 2.8 శాతం వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ. 3,496 కోట్ల లాభాన్ని, రూ.17,630 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
గైడెన్స్ డౌన్...: ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ల రూపంలో కంపెనీ ఆదాయ అంచనా(గైడెన్స్)లను 5.5–6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతక్రితం 6.5–8.5 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. ఆపరేటింగ్ మార్జిన్ 23–25 శాతంగా, రూపాయి ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 3–4 శాతం మేర ఉంటుందని కంపెనీ తాజాగా అంచనా వేసింది.
కొనసాగుతున్న సీఈఓ వేట...: కంపెనీకి పూర్తిస్థాయిలో కొత్త సీఈఓను నియమించేందుకు అన్వేషణ ప్రక్రియ చురుగ్గానే కొనసాగుతోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపింది. సిక్కా ఆకస్మిక రాజీనామా తర్వాత నీలేకనిని చైర్మన్‌గా, యూబీ ప్రవీణ్ రావును తాత్కాలిక సీఈఓ, ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుత తాత్కాలిక సీఈఓ ప్రవీణ్‌రావుతో పాటు, సీఎఫ్‌ఓ రంగనాథ్, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం హెడ్ మోహిత్ జోషిలను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వి.బాలకృష్ణన్, మోహన్‌దాస్ పాయ్, అశోక్ వేమూరి, బీజీ శ్రీనివాస్‌లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
♦ ఒక్కో షేరుపై రూ.13 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
♦ క్యూ2లో కంపెనీ 72 క్లయింట్లను దక్కించుకుంది.
♦ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో స్థూలంగా ఇన్ఫోసిస్ 10,514 మందిని నియమించుకుంది. అయితే, 10,627 మంది కంపెనీని వీడిపోవడంతో నికరంగా 113 ఉద్యోగాలు తగ్గాయి. సెప్టెంబర్ ఆఖరికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,98,440గా నమోదైంది. జూన్ చివరికి 1,98,553 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
క్యూ1లో కూడా నికరంగా 1,800 ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం. కాగా, కన్సాలిడేటెడ్‌గా(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు సెప్టెంబర్ క్వార్టర్‌లో 21.4 శాతంగా నమోదైంది. క్రితం క్వార్టర్(క్యూ1)లో ఇది 21 శాతంగా ఉంది.
మంగళవారం బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు 1.37% నష్టపోయి రూ.927 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.
‘కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చోటుచేసుకున్న మార్పుల నుంచి (సిక్కా ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో) కంపెనీ వెంటనే కుదుటపడింది. ఇన్వెస్టర్లతోపాటు ఇతరత్రా అన్ని పక్షాలతో తగిన సంప్రదింపులు నిర్వహించడం ద్వారా వ్యాపారంపై దీని ప్రతికూల ప్రభావం పెద్దగా పడకుండా చూడగలిగాం. తద్వారా అన్ని వ్యాపార విభాగాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాం’
– యూబీ ప్రవీణ్ రావు, ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈఓ, ఎండీ
‘పనయా’ డీల్‌కు క్లీన్‌చిట్...
సిక్కా వైదొలగిన తర్వాత కంపెనీ కొత్త చైర్మన్, ప్రమోటర్లలో ఒకరైన నందన్ నీలేకని నేతృత్వంలో జరిగిన తొలి బోర్డు సమావేశంలో వివాదాస్పద పనయా కొనుగోలు ఒప్పందానికి క్లీన్‌చిట్ లభించింది. దీని కొనుగోలుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదన్న దర్యాప్తు నివేదికలను బోర్డు సమర్ధించిందని ఇన్ఫీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదేవిధంగా పూర్తి నివేదికను బహిర్గత పరచకూడదని మాజీ సీఈఓ విశాల్ సిక్కా తీసుకున్న నిర్ణయానికి కూడా బోర్డు మద్దతివ్వడం గమనార్హం. ‘పనయా డీల్ వ్యవహారాల్లో స్వతంత్ర దర్యాప్తులన్నీ సజావుగానే జరిగాయని బోర్డు మొత్తం అంగీకరించింది. ఇక కంపెనీ మేలు కోసం అహర్నిశలూ పాకులాడే నారాయణ మూర్తి వంటివారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని నీలేకని వ్యాఖ్యానించారు.
మరోపక్క, మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన వీడ్కోలు ప్యాకేజీలో తప్పులేవీ చోటుచేసుకోలేదని బోర్డు అభిప్రాయపడినట్లు ఇన్ఫీ పేర్కొంది. 2015లో ఇజ్రాయిల్‌కు కంపెనీ పనయాను దాదాపు రూ.1,250 కోట్లు వెచ్చించి ఇన్ఫీ కొనుగోలు చేసింది. అయితే, ఈ డీల్‌లో అవకతవకలు జరిగాయంటూ కంపెనీలోని అంతర్గత వేగు (విజిల్‌బ్లోయర్) సెబీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. ప్రమోటర్లు ప్రధానంగా నారాయణమూర్తి దీనిపై కన్నెర్ర చేయడంతో లుకలుకలు తీవ్రతరమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment