ఆంధ్రా బ్యాంక్ క్యూ2 ఫలితాలు మొండి బకాయిల దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్‌పై ఎన్‌పీఏల ఒత్తిడి మరింత పెరిగింది. నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నికరలాభం ఏకంగా 78 శాతం క్షీణించింది. గతేడాది ఇదే కాలానికి రూ.325 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.71 కోట్లకు పడిపోయింది. పెరిగిన నిరర్థక ఆస్తులకు అనుగుణంగా రూ.140 కోట్లు ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా బుధవారం బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం ప్రొవిజనింగ్ కింద రూ.200 కోట్లు కేటాయించింది.
సమీక్షా కాలంలో ఆదాయం 12% వృద్ధి చెంది రూ.3,415 కోట్ల నుంచి రూ.3,818 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యాపారం 18 శాతం వృద్ధి చెంది రూ.2.30 లక్షల కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో డిపాజిట్లలో 19 శాతం, రుణాల్లో 16.5% వృద్ధి నమోదైనట్లు బ్యాంకు పేర్కొంది. గడచిన ఏడాది 3.48 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఇప్పుడు 5.15%కి చేరగా, నికర నిరర్థక ఆస్తులు 2.16% నుంచి 3.54%కి చేరాయి. అదే విలువ పరంగా చూస్తే నికర నిరర్థక ఆస్తులు రూ.1,831 కోట్ల నుంచి రూ.3,477 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ లాభదాయకత 3.16%గా నమోదైంది.
రూ. 200 కోట్ల సమీకరణ: మూలధన అవసరాల కోసం ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ కింద షేర్లను కేటాయించి రూ.200 కోట్లను సమీకరించడానికి బోర్డు ఆమోదించింది. డిసెంబర్ 19న జరగబోయే అత్యవసర సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.