న్యూఢిల్లీ: సుమారు 50 ఖాతాల నుంచి రావాల్సిన మొండిబాకీలను రికవర్ చేసుకోవడంపై ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ దృష్టి సారించింది. దాదాపు రూ. 1,553 కోట్ల మేర మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. నవంబర్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు(ఈవోఐ) సమర్పించాల్సిందని టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. డిసెంబర్ 3న ఈ–బిడ్డింగ్ జరుగుతుందని, డిసెంబర్ 10లోగా ఒప్పందాలను కుదుర్చుకోవడం, నగదు బదిలీ తదితర లావాదేవీలు పూర్తవుతాయని బ్యాంక్ పేర్కొంది.
53 ఖాతాల్లో రూ. 1,552.96 కోట్ల మొత్తానికి సంబంధించిన ఎన్‌పీఏల ప్రతిపాదిత వేలంలో పాల్గొనేందుకు ఏఆర్‌సీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. పూర్తిగా నగదు ప్రాతిపదికన ఈ ఎన్‌పీఏల వేలం ఉంటుందని తెలిపింది. వేలానికి వస్తున్న పెద్ద మొండిపద్దుల్లో ట్రాన్స్‌ట్రాయ్ దిండిగల్–తెని–కుమ్లి టోల్‌వేస్ (మొత్తం బాకీ రూ. 147 కోట్లు), ట్రాన్స్‌ట్రాయ్ కృష్ణగిరి దిండివనం హైవేస్ (రూ. 103 కోట్లు), కార్పొరేట్ పవర్ (రూ. 306.65 కోట్లు), వీసా స్టీల్ (రూ. 211.76 కోట్లు), తుల్సియాన్ ఎన్‌ఈసీ (మొత్తం బాకీ రూ. 154 కోట్లు), కార్పొరేట్ ఇస్పాత్ అలాయ్స్ (రూ. 148 కోట్లు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment