హైదరాబాద్‌లోని రాయపాటి ఇంటిని వేలం వేస్తున్నట్టు ఆంధ్రబ్యాంక్ ఇచ్చిన పత్రిక ప్రకటన
సాక్షి, అమరావతి: తీసుకున్న రుణాలను తిరిగి తీర్చని నేపథ్యంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఆంధ్రా బ్యాంక్ తాజాగా వేలం ప్రకటన జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–7లో ఉన్న జీ+3 వాణిజ్య భవనాన్ని 25/04/2019న వేలం వేస్తున్నట్లు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. 631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ కనీస ధరను రూ.7,36,14,000గా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ధరావత్తు కింద రూ.73,61,400 జమ చేయాల్సి ఉంటుంది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ మార్చి 20 నాటికి రూ.748.77 కోట్లు రుణాలు బకాయి ఉండటంతో కంపెనీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ఆ ప్రకటనలో పేర్కొంది. చదవండి....(ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా)
ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారులు రాయపాటి రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతోపాటు మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లకుపైగా రుణాలను తీసుకుని ఎగ్గొట్టింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా సీఎం చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడటమేగాక మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో భారీగా నిధులను అందజేశారు.
అయితే ఎన్నికల ముందు ట్రాన్స్‌ట్రాయ్‌కు సత్తా లేదని, అందుకే పనులను నవయుగకు అప్పచెప్పినట్లు చెప్పి హడావుడి చేయడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావు మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు విజయ్‌మాల్యా లాంటి వాళ్లు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారంటూ విమర్శలు గుప్పించే సీఎం చంద్రబాబు ఇలా వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన రాయపాటికి మరోసారి ఎంపీ టికెట్ ఎలా ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment