భారీగా పెరిగిన ఆంధ్రా బ్యాంక్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తొలి త్రైమాసిక నికర లాభంలో 89 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది జూన్ త్రైమాసికంలో రూ. 107 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 202 కోట్లకు చేరింది. డిపాజిట్ల సేకరణ వ్యయం 40 బేసిస్ పాయింట్లు తగ్గడం, ఫారెక్స్ లాభాలు, నికర వడ్డీ లాభదాయకత(నిమ్) పెరగడం వంటివి లాభాలు వృద్ధి చెందడానికి ప్రధాన కారణంగా ఆంధ్రా బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా తెలిపారు. సమీక్షా కాలంలో నిమ్ 2.14 శాతం నుంచి 2.87 శాతానికి పెరిగింది.
ఈ ఏడాది మొత్తం మీద వ్యాపారంలో 20 శాతం వృద్ధితో పాటు నిమ్ 3 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ త్రైమాసికంలో వ్యాపారం 7 శాతం వృద్ధితో 2.61 లక్షల కోట్ల నుంచి రూ. 2.79 లక్షల కోట్లకు చేరింది. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఈ త్రైమాసికంలో 404 కోట్లు రికవరీ చేయడంతో ఎన్‌పీఏలు బాగా తగ్గినట్లు తెలిపారు. సమీక్షా కాలంలో స్థూల ఎన్‌పీఏలు 5.98 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 3.89 శాతం నుంచి 2.99 శాతానికి తగ్గాయి. ప్రొవిజనింగ్ రేషియో 48 శాతం నుంచి 61 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 500 శాఖలను ఏర్పాటు చేయనున్నామన్నారు.