ఆంధ్రాబ్యాంక్ ఫలితాలపై రుణమాఫీ దెబ్బ
53% క్షీణించిన నికరలాభం
- క్యూ1లో లాభం రూ. 107 కోట్లు
- వ్యవసాయ రుణాల్లో 8 శాతానికి చేరిన ఎన్‌పీఏలు
- ఈ ఏడాది రూ. 500 కోట్ల లాభం లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రాబ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలపై రుణమాఫీ ప్రభావం బాగానే కనిపించింది. లాభం సగానికి సగం తగ్గడంతో పాటు ఎన్‌పీఏలు కొండలా పెరిగిపోయాయి. ముఖ్యంగా రుణ మాఫీ ప్రకటన తర్వాత రైతులు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాలెన్స్ షీట్‌పై సుమారుగా రూ.1,500 కోట్ల ప్రతికూల ప్రభావం పడిందని దీంతో నికరలాభం 53 శాతం క్షీణించినట్లు ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో రూ.1,078 కోట్ల వ్యవసాయ రుణాలు ఎన్‌పీఏగా మారడమే కాకుండా వీటికి సంబంధించిన రెండేళ్ల వడ్డీ రూ. 304 కోట్లు వెనక్కి తీసుకోవడం, ఎన్‌పీఏ ప్రొవిజనింగ్‌కు రూ. 106 కోట్లు కేటాయించడంతో ఆ మేరకు లాభాలు తగ్గినట్లు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్.రాజేంద్రన్ తెలిపారు.
దీంతో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంకు నికరలాభం రూ. 231 కోట్ల నుంచి రూ. 107 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో వ్యవసాయ రుణాల్లో ఎన్‌పీఏలు 2.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగాయి. శనివారం ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ వాస్తవానికి ఈ మూడు నెలల కాలంలో ఆంధ్రాబ్యాంక్ పనితీరు బాగున్నప్పటికీ కేవలం రుణ మాఫీనే దెబ్బతీసిందన్నారు.
ఈ త్రైమాసికంలో రూ.1,000 కోట్లు చివరికి ఫలితాలను బోర్డు సమావేశంలో ఆమోదించడానికి కూడా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఎన్‌పీఏలుగా మారిన రూ.1,078 కోట్ల వ్యవసాయ రుణాల్లో రూ.600 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తున్న రుణమాఫీ పరిధిలోకి వస్తాయని, ఒకసారి ఈ పథకం అమలైతే ఈ మొత్తాన్ని స్టాండర్డ్ అసెట్స్‌గా పరిగణిస్తామన్నారు. మొత్తం రుణాల్లో మొండి బకాయిల విషయానికి వస్తే స్థూల మొండి బకాయిలు 5.98 శాతానికి, నికర మొండి బకాయిలు 3.89 శాతానికి చేరాయి. నికర వడ్డీ లాభదాయకత 2.14 శాతానికి పడిపోయిందని, ఈ విలువను మార్చినాటికి 3 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
డిమాండ్ కనిపిస్తోంది
రుణాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ కనిపిస్తోందని, విద్యుత్ రంగంలో జరుగుతున్న టేకోవర్లు కూడా సానుకూల సంకేతాలను ఇస్తున్నాయన్నారు. ఈ ఏడాది వ్యాపారంలో 16 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే 20 శాతం వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ మూడు నెలల కాలంలో వ్యాపారం 15.7 శాతం వృద్ధితో రూ.2.61 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది మొత్తం మీద రూ. 500 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ. 21,000 కోట్ల వ్యవసాయ రుణాల్లో 90 శాతం ఆంధ్ర, తెలంగాణల్లోనే ఉన్నాయని, దీన్ని రానున్న కాలంలో తగ్గించుకోవడానికి మిగిలిన రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు.