భారీగా ఢమాలన్న అమెజాన్
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీగా కుదేలైంది. అంతర్జాతీయ కార్యకలాపాల్లో తీవ్రమైన నష్టాలు ఎదుర్కొనడంతో జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 77 శాతం కోల్పోయి, రూ.1264 కోట్లగా నమోదయ్యాయి. అయినప్పటికీ భారత్ ఈ-కామర్స్ మార్కెట్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు భారీగా పెట్టుబడి పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. 2017 జూన్ క్వార్టర్‌లో అంతర్జాతీయ వ్యాపారాల్లో అమెజాన్ నిర్వహణ నష్టాలు రూ.4,646 కోట్లకు పెరిగినట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నిర్వహణ నష్టాలు రూ.866 కోట్లగా ఉన్నాయి. అయితే కంపెనీ రెవెన్యూలు 25 శాతం, అమెజాన్ వెబ్ సర్వీసులు 27శాతం పైకి జంప్ చేశాయి. నార్త్ అమెరికా బిజినెస్‌ల్లో కూడా ఆపరేటింగ్ ఇన్‌కమ్ 38 శాతం క్షీణించింది. ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ, అమెజాన్ భారత్‌లో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ బ్రియాన్ టి ఒల్సావ్స్కీ చెప్పారు.
భారత్‌లో తాము పెట్టుబడులను కొనసాగిస్తామని, తాము అక్కడ గొప్ప విజయాన్ని చూస్తామని చెప్పారు. భారత్‌లో అమెజాన్‌కు, ఫ్లిప్‌కార్ట్ నుంచి తీవ్ర పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులను అమెజాన్ ఉధృతం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అమెజాన్ రూ.3,800 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. 5 బిలియన్ డాలర్లను భారత్ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని గతేడాదే ఈ కంపెనీ ప్రకటించింది. విజయవంతంగా అమెజాన్ ఇండియాలో నాలుగేళ్ల ఆపరేషన్స్‌ను పూర్తిచేసుకుంది. వేర్‌హౌజ్‌లను అభివృద్ధి చేయడానికి, లాజిస్టిక్స్‌ను బలోపేతం చేయడానికి, ప్రొడక్ట్ అసోర్ట్‌మెంట్లను పెంచడానికి ఈ పెట్టుబడులను పెడుతోంది.
మరోవైపు గురువారం మార్కెట్‌లో దూసుకెళ్లిన అమెజాన్ స్టాక్స్, శుక్రవారం మార్కెట్‌లో ఒత్తిడిని ఎదుర్కోబోతున్నాయి. కంపెనీ లాభాల్లో భారీగా పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో షేర్లపై దీని ప్రభావం పడనుందని విశ్లేషకులు చెప్పారు. గురువారం స్టాక్స్ దూసుకెళ్లడంతో ఆ కంపెనీ ఫౌండర్ జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్‌ను మించిపోయి, ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు.