ముంబై: టాటా కెమికల్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం మేర తగ్గి రూ.267 కోట్లకు పరిమితమైంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.190 కోట్లతో పోల్చితే పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.495 కోట్లుగా ఉండడం గమనార్హం.
ఆదాయంలో పెద్దగా మార్పు లేకుండా రూ.3,999 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,998 కోట్లుగా ఉంది. ‘‘భారత్‌లో సోడాయాష్‌కు డిమాండ్ స్థిరంగా ఉంది. అమెరికా, యూరప్‌లో కంటెయినర్ గ్లాస్ తదితర విభాగాల్లో డిమాండ్ స్తబ్దుగా ఉంది. జూలై, ఆగస్ట్‌లో అసాధారణ వర్షాలతో మిథాపూర్ ప్లాంట్‌లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉత్పత్తి తగ్గడంతో మార్జిన్లపై ప్రభావం పడింది’’అని టాటా కెమికల్స్ ఎండీ, సీఈవో ఆర్ ముకందన్ తెలిపారు.
మార్చి త్రైమాసికంతో పోల్చితే పనితీరు మొత్తం మీద మెరుగపడినట్టు చెప్పారు. కస్టమర్లను అట్టిపెట్టుకోవడంతోపాటు స్థిరమైన కార్యకలాపాలపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా కెమికల్స్ షేరు 2.41 శాతం క్షీణించి రూ.1,074 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment