
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) మొత్తం 53 చోట్ల కొత్తగా అన్వేషణ సాగించనుంది. ఇందుకోసం రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తోంది.
పర్యావరణ అనుమతుల కోసం ఓఎన్‌జీసీ చేసిన రెండు వేర్వేరు ప్రతిపాదనలను గత నెలలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) ఆమోదించింది. బావుల నిర్వహణ కారణంగా నష్టపోయిన సందర్భంలో రైతులు, ఆస్తి హక్కుదారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఓఎన్‌జీసీకి ఉంటుందని అథారిటీ స్పష్టం చేస్తూ షరతు విధించింది.
కేజీ బేసిన్‌లో 2028 నాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 ప్రాంతాల్లో, అలాగే 2024 కల్లా కడప బేసిన్‌లో కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో మూడుచోట్ల నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలను చేపట్టనుంది. వాణిజ్యపరంగా లాభదాయకమని రుజువైతే ఈ బావులను అభివృద్ధి చేసి, సమీపంలోని ప్రారంభ ఉత్పత్తి వ్యవస్థ/గ్యాస్ సేకరణ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఓఎన్‌జీసీ ప్రస్తుతం కేజీ బేసిన్‌లో రోజుకు 4.4 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్, 700 టన్నులకుపైగా చమురు ఉత్పత్తి చేస్తోంది.