Oil and Natural Gas Corporation
-
కేజీ బ్లాక్ నుంచి ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ జాప్యం తర్వాత కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీప్ సీ బ్లాక్ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయం తెలిపారు. అయితే, ఉత్పత్తి చేస్తున్న పరిమాణాన్ని మాత్రం వెల్లడించలేదు. కేజీ–డీడబ్ల్యూఎన్–98/2 (కేజీ–డీ5) ప్రాజెక్టుతో తమ చమురు ఉత్పత్తి సామర్ధ్యం 11 శాతం, గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 15 శాతం పెరుగుతుందని ఓఎన్జీసీ తెలిపింది. 2022–23లో ఓఎన్జీసీ 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్, రోజుకు 20 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. తాజాగా అందుబాటులోకి వచి్చన బ్లాక్‌లో చమురు ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 45,000 బ్యారెళ్లు, గ్యాస్ ఉత్పత్తి 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి చేరగలదని మంత్రి తెలిపారు. అయితే, ఎప్పటికి ఆ స్థాయిని చేరవచ్చనేది వెల్లడించలేదు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–6 బ్లాక్ పక్కనే కేజీ–డీ5 బ్లాక్ ఉంది. దీన్ని మూడు క్లస్టర్లుగా విడగొట్టి ముందుగా రెండో క్లస్టర్‌పై పనులు ప్రారంభించారు. వాస్తవ ప్రణాళికల ప్రకారం 2021 నవంబర్లోనే ఇందులో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ పరిణామాలతో 2023 మే నెలకు, అటుపైన ఆగస్టుకు, తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడుతూ వచి్చంది. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
ఏపీలో ఓఎన్జీసీ కొత్తగా అన్వేషణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మొత్తం 53 చోట్ల కొత్తగా అన్వేషణ సాగించనుంది. ఇందుకోసం రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం ఓఎన్జీసీ చేసిన రెండు వేర్వేరు ప్రతిపాదనలను గత నెలలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) ఆమోదించింది. బావుల నిర్వహణ కారణంగా నష్టపోయిన సందర్భంలో రైతులు, ఆస్తి హక్కుదారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఓఎన్జీసీకి ఉంటుందని అథారిటీ స్పష్టం చేస్తూ షరతు విధించింది. కేజీ బేసిన్లో 2028 నాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 ప్రాంతాల్లో, అలాగే 2024 కల్లా కడప బేసిన్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మూడుచోట్ల నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలను చేపట్టనుంది. వాణిజ్యపరంగా లాభదాయకమని రుజువైతే ఈ బావులను అభివృద్ధి చేసి, సమీపంలోని ప్రారంభ ఉత్పత్తి వ్యవస్థ/గ్యాస్ సేకరణ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఓఎన్జీసీ ప్రస్తుతం కేజీ బేసిన్లో రోజుకు 4.4 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్, 700 టన్నులకుపైగా చమురు ఉత్పత్తి చేస్తోంది. -
మీరే మాకు గర్వ కారణం!... ఆ సమయంలో కూడా సేవలందించారు!!
Hardeep Singh Puri Praises Working On Oil Rigs: దేశంలోని చమురు, గ్యాస్ ఇన్స్టాలేషన్లలో పనిచేసే మహిళల సహకారాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఆరెంజ్ కలర్ యూనిఫామ్ ధరించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు సుమారు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండి సేవలందించారని పూరి చెప్పారు. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...) అంతేకాదు వారి తమ కార్పోరేషన్లో కఠినమైన నిబద్ధత, దృఢత్వంతో పనిచేసే సూపర్ ఉమెన్ మాత్రమే కాదు దేశ ప్రగతిలో "సమాన భాగస్వామ్యులు"గా అభివర్ణించారు. పైగా మీరే మాకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. అంతేకాదు లడఖ్‌లోని ఫే గ్రామంలో 11,800 అడుగుల ఎత్తైన ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్‌ను ఇండియన్ ఆయిల్‌కు చెందిన మహిళా ఉద్యోగుల బృందమే నిర్వహించారన్న సంగతి తెలిసిందే. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) View this post on Instagram A post shared by Hardeep Singh Puri (@hardeepspuri) -
‘మీతోని కాదు.. విదేశీ సంస్థలకే అప్పగించండి’! ఓన్జీసీకి పెట్రోలియం శాఖ సలహా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ చేతిలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో 60 శాతం పైగా వాటాలను (పీఐ), నిర్వహణ అధికారాలను విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ కంపెనీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సూచించింది. లేఖలో సంచనల విషయాలు ఓన్జీసీ ఆధ్వర్యంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించాలంటూ ఓఎన్జీసీ సీఎండీ సుభాష్ కుమార్‌కు పెట్రోలియం శాఖ (ఎక్స్‌ప్లోరేషన్ విభాగం) అదనపు కార్యదర్శి అమర్ నాథ్ లేఖ రాశారు. వచ్చే ఏడాది సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్న నాథ్ అధికారికంగా ఇటువంటి లేఖ రాయడం ఏప్రిల్ తర్వాత ఇది రెండోసారి. ‘ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారం ఉంది. కానీ పాతబడిన మౌలిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని ప్రక్రియాపరమైన సమస్యల కారణంగా ఉత్పత్తిని పెంచడంలో ఓఎన్జీసీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశీ గ్యాస్, చమురు క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపించడం ద్వారా ఇటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ఓఎన్జీసీ ప్రణాళికలు వేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అసెట్స్ భారం తగ్గించుకోండి దేశీయంగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో చమురు, గ్యాస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద ఏవో చిన్నా, చితకా క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్ భారాన్ని తగ్గించుకోవాలని కూడా నాథ్ సూచించారు. ఏప్రిల్ 1న రాసిన లేఖలో కూడా రత్న ఆర్–సిరీస్ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు. చదవండి: ఓఎన్జీసీ లాభం హైజంప్ -
తూర్పు గోదావరిలో గ్యాస్ లీక్
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం దగ్గర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా గ్యాస్ వెలువడుతోంది. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఓఎన్జీసీ సిబ్బంది లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్
న్యూఢిల్లీ: గతేడాది(2013-14) క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా నికర లాభం 26% క్షీణించి రూ. 566 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 765 కోట్లను ఆర్జించింది. ఉత్పత్తి మందగించడం, సబ్సిడీ చెల్లింపులు పెరగడం లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలిపింది. సబ్సిడీ చెల్లింపులు రూ. 1,850 కోట్ల నుంచి రూ. 2,348 కోట్లకు ఎగశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలవల్ల వాటిల్లే ఆదా య నష్టాలకుగాను ఆయి ల్ ఉత్పత్తి సంస్థలు 48% వరకూ సబ్సిడీలు చెల్లిస్తాయి. ముడిచమురు ఉత్పత్తికిగాను బ్యారల్‌కు 106.55 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినప్పటికీ, 69.19 డాలర్లమేర సబ్సిడీ ఇవ్వడంతో నికరంగా 37.36 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ వివరించింది. గతంలో బ్యారల్‌కు 56 డాలర్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ నికరంగా 55.44 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. -
మా గ్యాస్ రిలయన్స్ తీసుకుంటోందా? తేల్చండి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాల్లోని గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటున్నదా అనే అంశాన్ని నిర్ధారించడానికి అంతర్జాతీయ నిపుణుడిని నియమించాలని కోరుతూ చమురు శాఖకు లేఖ రాసినట్లు ఓఎన్జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎస్కే వర్మ తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజీ-డీ6 బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తవ్వకాలు జరుపుతున్న నాలుగు బావులు ఓఎన్జీసీ క్షేత్రానికి కొన్ని వందల మీటర్ల సమీపంలోనే ఉన్నాయన్నారు. ఈ కారణంగానే ఒకే రిజర్వాయర్ నుంచి రెండు సంస్థలూ గ్యాస్‌ను తీసుకుంటున్నాయా అనే ఆందోళన నెలకొందని చెప్పారు. అయితే ఒఎన్జీసీ తన క్షేత్రంలో ఇంకా ఉత్పత్తి ప్రారంభించాల్సివుంది. దాంతో తన గ్యాస్‌లో కొంత రిలయన్స్ వెలికితీసివుండవచ్చన్న భయాలు ఓఎన్జీసీకి ఏర్పడ్డాయి. గ్యాస్ ధర పెంపుతో భారీ లబ్ధి గ్యాస్ ధర వచ్చే నెల నుంచి దాదాపు రెట్టింపు కానుండటంతో ఓఎన్జీసీకి రూ. 16 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. గ్యాస్ ధర ఒక డాలరు పెరిగితే సంస్థకు ఏటా రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఓఎన్జీసీ కొత్త సీఎండీ దినేశ్ కే షరాఫ్ మంగళవారం న్యూఢిల్లీలో తెలిపారు. ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచడం వల్ల తమ సంస్థ నికర లాభం రూ.9,600 కోట్ల మేరకు వృద్ధిచెందుతుందని చెప్పారు.