మా గ్యాస్ రిలయన్స్ తీసుకుంటోందా? తేల్చండి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన క్షేత్రాల్లోని గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటున్నదా అనే అంశాన్ని నిర్ధారించడానికి అంతర్జాతీయ నిపుణుడిని నియమించాలని కోరుతూ చమురు శాఖకు లేఖ రాసినట్లు ఓఎన్‌జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎస్‌కే వర్మ తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజీ-డీ6 బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తవ్వకాలు జరుపుతున్న నాలుగు బావులు ఓఎన్‌జీసీ క్షేత్రానికి కొన్ని వందల మీటర్ల సమీపంలోనే ఉన్నాయన్నారు.
ఈ కారణంగానే ఒకే రిజర్వాయర్ నుంచి రెండు సంస్థలూ గ్యాస్‌ను తీసుకుంటున్నాయా అనే ఆందోళన నెలకొందని చెప్పారు. అయితే ఒఎన్‌జీసీ తన క్షేత్రంలో ఇంకా ఉత్పత్తి ప్రారంభించాల్సివుంది. దాంతో తన గ్యాస్‌లో కొంత రిలయన్స్ వెలికితీసివుండవచ్చన్న భయాలు ఓఎన్‌జీసీకి ఏర్పడ్డాయి.
గ్యాస్ ధర పెంపుతో భారీ లబ్ధి
గ్యాస్ ధర వచ్చే నెల నుంచి దాదాపు రెట్టింపు కానుండటంతో ఓఎన్‌జీసీకి రూ. 16 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. గ్యాస్ ధర ఒక డాలరు పెరిగితే సంస్థకు ఏటా రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఓఎన్‌జీసీ కొత్త సీఎండీ దినేశ్ కే షరాఫ్ మంగళవారం న్యూఢిల్లీలో తెలిపారు. ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచడం వల్ల తమ సంస్థ నికర లాభం రూ.9,600 కోట్ల మేరకు వృద్ధిచెందుతుందని చెప్పారు.