న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ చేతిలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో 60 శాతం పైగా వాటాలను (పీఐ), నిర్వహణ అధికారాలను విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ కంపెనీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సూచించింది.
లేఖలో సంచనల విషయాలు
ఓన్‌జీసీ ఆధ్వర్యంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించాలంటూ ఓఎన్‌జీసీ సీఎండీ సుభాష్ కుమార్‌కు పెట్రోలియం శాఖ (ఎక్స్‌ప్లోరేషన్ విభాగం) అదనపు కార్యదర్శి అమర్ నాథ్ లేఖ రాశారు. వచ్చే ఏడాది సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్న నాథ్ అధికారికంగా ఇటువంటి లేఖ రాయడం ఏప్రిల్ తర్వాత ఇది రెండోసారి. ‘ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారం ఉంది. కానీ పాతబడిన మౌలిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని ప్రక్రియాపరమైన సమస్యల కారణంగా ఉత్పత్తిని పెంచడంలో ఓఎన్‌జీసీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశీ గ్యాస్, చమురు క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపించడం ద్వారా ఇటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ఓఎన్‌జీసీ ప్రణాళికలు వేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.
అసెట్స్ భారం తగ్గించుకోండి
దేశీయంగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో చమురు, గ్యాస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్‌జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద ఏవో చిన్నా, చితకా క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్‌జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్ భారాన్ని తగ్గించుకోవాలని కూడా నాథ్ సూచించారు. ఏప్రిల్ 1న రాసిన లేఖలో కూడా రత్న ఆర్–సిరీస్ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment