oil rig
-
తగ్గేదేలే అంటున్న మేఘా.. ఆ సెక్టార్లో సక్సెస్ బాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓఎన్జీసీకి రిగ్స్ సరఫరాను వేగవంతం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న ఓఎన్జీసీ చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్‌ను అందించింది. ఇది 3,000 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేసే సంప్రదాయ రిగ్ కన్నా అధిక పనితీరును కనబరుస్తుందని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ తెలిపారు. ‘6,000 మీటర్ల లోతు వరకు ఇది తవ్వగలదు. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్స్‌ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ రిగ్స్ మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. పోటీ బిడ్డింగ్‌లో 47 రిగ్స్ సరఫరాకై ఓఎన్జీసీ నుంచి ఆర్డర్‌ను ఎంఈఐఎల్ దక్కించుకుంది’ అని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ వివరించారు. -
ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆయిల్ రిగ్‌లు ఏపీ ఓఎన్జీసీకి సరఫరా..!
నిర్మాణరంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్‌లను తయారు చేసి రికార్డ్ సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్‌లను విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) నుంచి రూ.6000 కోట్ల విలువైన 47 ఆయిల్ రిగ్ ఆర్డర్ పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని ఓఎన్జీసీకి మరో రిగ్‌ను అందజేసింది. ఇది అత్యాధునిక స్వదేశీ ఆయిల్ రిగ్. 2,000 హెచ్‌పీ సామర్ధ్యం గల రిగ్ 3,000 హెచ్‌పీ సామర్ధ్యం గల సంప్రదాయ రిగ్లకు సమానమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 6,000 మీటర్ల(6 కి.మీ) లోతు వరకు భూమిలోకి డ్రిల్ చేయగలదు. "మేక్ ఇన్ ఇండియా" & "ఆత్మనీర్ భర్ భారత్" కార్యక్రమాల కింద స్వదేశీ టెక్నాలజీతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేస్తున్న తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ ఎంఈఐఎల్. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ రిగ్‌లు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్మెక్ ఛైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వివరించారు. అస్సాం (సిబ్సాగర్, జోరహత్), ఆంధ్రప్రదేశ్ (రాజమండ్రి), గుజరాత్ (అహ్మదాబాద్, అంకాలేశ్వర్, మెహసనా మరియు క్యాంబే), త్రిపుర (అగర్తలా), తమిళనాడు (కరైకల్) లోని ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ క్షేత్రాలకు ఎంఈఐఎల్ అన్ని రిగ్‌లను తయారు చేసి సరఫరా చేస్తుంది. మేఘా గ్రూప్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్‌లలోని కేంద్రాల్లో రిగ్‌లను డ్రిల్మెక్ ఉత్పత్తి చేస్తోంది. చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో వీటి అవసరం ఎంతగానే ఉంటుంది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!) -
‘ది రిగ్’ థీమ్ పార్క్.. 2030 వరకు వేచి చూడాల్సిందే!!
Saudi Arabia's The Rig Theme Park: విద్యార్థులకు బోరింగ్‌గా అనిపించే విజ్ఞాన యాత్రను వినోదభరితంగా మార్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇకపై పరిశ్రమలోని చాంబర్లను, పెద్ద మెషిన్లను చూడటానికి నడుచుకుంటూ కాదు, రోలర్ కోస్టర్ రైడ్ చేస్తూ చూడొచ్చు. ఆశ్చర్యపోతున్నారా! ఫొటోలో కనిపిస్తున్నట్లు చమురు పరిశ్రమను తలపించే ఈ నిర్మాణం, నిజానికి ఓ థీమ్ పార్క్.. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే ప్రతిష్ఠాత్మక ప్రయత్నాలలో భాగంగా, ఈ థీమ్ పార్కును నిర్మించనుంది. పేరు ‘ది రిగ్’.. సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో వినోదాన్ని అందించే ఎన్నో రైడ్లు ఉన్నాయి. పార్క్ చుట్టూ నీరు ఉండటంతో వాటర్ రైడ్స్‌కు కొరత లేదు. అండర్ వాటర్ రైడ్స్, బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటి వినోదాలు కూడా ఉన్నాయి. ఇక బస చేయడానికి వీలుగా మూడు హోటళ్లు, 11 రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. పార్క్‌లోనే కాదు.. థీమ్ పార్క్‌కు వెళ్లే మార్గం కూడా ఉత్సాహాన్ని నింపేలా నిర్మించారు. హెలికాప్టర్ రైడ్, బోట్ రైడ్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. బాగుంది కదూ! మీరు కూడా అక్కడికి వెళ్లాలనుకుంటే కాస్త వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ థీమ్ పార్కును 2030లో ప్రారంభించనున్నట్లు సమాచారం. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
‘మీతోని కాదు.. విదేశీ సంస్థలకే అప్పగించండి’! ఓన్జీసీకి పెట్రోలియం శాఖ సలహా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ చేతిలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో 60 శాతం పైగా వాటాలను (పీఐ), నిర్వహణ అధికారాలను విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ కంపెనీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సూచించింది. లేఖలో సంచనల విషయాలు ఓన్జీసీ ఆధ్వర్యంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించాలంటూ ఓఎన్జీసీ సీఎండీ సుభాష్ కుమార్‌కు పెట్రోలియం శాఖ (ఎక్స్‌ప్లోరేషన్ విభాగం) అదనపు కార్యదర్శి అమర్ నాథ్ లేఖ రాశారు. వచ్చే ఏడాది సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్న నాథ్ అధికారికంగా ఇటువంటి లేఖ రాయడం ఏప్రిల్ తర్వాత ఇది రెండోసారి. ‘ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారం ఉంది. కానీ పాతబడిన మౌలిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని ప్రక్రియాపరమైన సమస్యల కారణంగా ఉత్పత్తిని పెంచడంలో ఓఎన్జీసీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశీ గ్యాస్, చమురు క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపించడం ద్వారా ఇటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ఓఎన్జీసీ ప్రణాళికలు వేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అసెట్స్ భారం తగ్గించుకోండి దేశీయంగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో చమురు, గ్యాస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద ఏవో చిన్నా, చితకా క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్ భారాన్ని తగ్గించుకోవాలని కూడా నాథ్ సూచించారు. ఏప్రిల్ 1న రాసిన లేఖలో కూడా రత్న ఆర్–సిరీస్ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు. చదవండి: ఓఎన్జీసీ లాభం హైజంప్ -
కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం!
కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ సమీపంలో చమురు బావి నుంచి ముడి చమురు శనివారం ఉదయం పైకి ప్రవాహంలా తన్నుకు వచ్చింది. దీంతో అక్కడి ఇసుక తిన్నెల్లో మృతి చెందిన పక్షులు, చేపలతో పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. అక్కడి చిత్తడి నేలలు కూడా చమురు పొరతో నిండిపోయాయి. బీచ్‌లన్నీ నిర్మాణుష్యమైపోయాయి. వార్షిక ఎయిర్ షోలు కూడా రద్దయ్యాయి. దాదాపుగా లక్ష 23 వేల గ్యాలన్లు లేదా 3 వేల బ్యారెల్స్ ముడి చమురు పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిపడింది. బీచ్ సమీపంలోని దక్షిణ లాస్ ఏంజెల్స్ సిటీలో 40 మైళ్ల వరకు దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. వాతావరణమంతా పెట్రోల్ దుర్గంధంతో నిండిపోయింది. హంటింగ్టన్ బీచ్ సమీపంలో గల చమురు బావిలో అయిల్ లీకవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కాగా హంటింగ్టన్ బీచ్ మేయర్ కిమ్ కార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సముద్రం పై భాగంలో దాదాపుగా 13 చదరపు మైళ్ళ మేర చమురు పొర వ్యాపించి ఉండవచ్చని మేయర్ తెలిపారు. ఈ ఉపద్రవం వల్ల పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది. పర్యావరణం పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని పర్యావరణ వేత్తలు పేర్కోన్నారు. దీనిని పెద్ద పర్యావరణ విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ లీక్ ఎక్కడ ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! -
‘మేఘా’ మరో రికార్డు.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు క్షేత్రంలో ఈ రోజు 07.04.2021 న డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది. 6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుండి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి. 20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు. 2000 హెచ్ పి సామర్థ్యం గల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీటర్ల (6 కిలో మీటర్లు) వరకు తవ్వగలవు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గులలో గుజరాత్లో ఒకటి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది. అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి రిగ్గు ద్వారా ప్రస్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ మరియు ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామర్థ్యంతో 4 వేల మీటర్ల వరకు సులువుగా తవ్వగలదు. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది. దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీ కి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాతన టెక్నాలజీగల రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుంది. చమురు బావులను డ్రిల్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మేకిన్ ఇండియా నినాదాన్ని తన విధానంగా మేఘా మార్చుకున్నదన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివరకు విదేశాలపైనే ఆధారపడ్డ భారత్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిరణంగా మారిందని రాజేశ్ రెడ్డి తెలిపారు. రిగ్గుల తయారీలో విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గులను తయారు చేసిన ఘనత మేఘా సొంతం చేసుకుంది. ఇది మేఘాకే కాదు దేశం మొత్తం గర్వపడాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు. చదవండి: టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్‌డీపీపీలోకి విలీనం -
బాంబే హైలో గ్యాస్ లీక్
ముంబై: బాంబే హైలో శనివారం రాత్రి గ్యాస్ లీకయింది. ఓఎన్జీసీ వెంటనే డ్రిల్లింగ్‌ను నిలిపివేసి సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. లీకేజీ సమయంలో 80 మంది సిబ్బంది ఉండగా, 40 మందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని అదుపు చేసేందుకు నిపుణులను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలీకాప్టర్లను వినియోగిస్తున్నారు. గ్యాస్ లీకయిన రిగ్ బాంబే తీరానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కిలో మీటర్ లోతున డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇంత లోతున గ్యాస్ లీకవడం అసాధారణమని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.