‘మేఘా’ మరో రికార్డు.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు | MEIL Making International Oil Rigs With Indigenous Technology | Sakshi
Sakshi News home page

‘మేఘా’ మరో రికార్డు.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు

Published Wed, Apr 7 2021 10:29 AM | Last Updated on Wed, Apr 7 2021 12:07 PM

MEIL Making International Oil Rigs With Indigenous Technology - Sakshi

చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు క్షేత్రంలో ఈ రోజు 07.04.2021 న డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని  మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది.  

6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుండి టెండర్లో దక్కించుకుంది.  అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు.

మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి.  సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి.

20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు.

2000 హెచ్ పి సామ‌ర్థ్యం గ‌ల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీట‌ర్ల (6 కిలో మీటర్లు) వ‌ర‌కు త‌వ్వ‌గ‌ల‌వు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గుల‌లో గుజ‌రాత్‌లో ఒక‌టి పూర్తిస్థాయిలో ఉప‌యోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్లోని రాజ‌మండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ ద‌శ‌లో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది. 

అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన మొద‌టి రిగ్గు ద్వారా ప్ర‌స్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ మ‌రియు ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామ‌ర్థ్యంతో 4 వేల మీట‌ర్ల వ‌ర‌కు సులువుగా త‌వ్వ‌గ‌ల‌దు. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది. 

దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీ కి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్ప‌త్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాత‌న టెక్నాల‌జీగ‌ల రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుంది. 

చమురు బావులను డ్రిల్‌ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు.  మేకిన్ ఇండియా నినాదాన్ని త‌న విధానంగా మేఘా మార్చుకున్నదన్నారు. చ‌మురు, ఇంధ‌నం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల‌పైనే ఆధార‌ప‌డ్డ భార‌త్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిర‌ణంగా మారిందని రాజేశ్ రెడ్డి తెలిపారు. రిగ్గుల త‌యారీలో విదేశీ సంస్థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రిగ్గుల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త మేఘా సొంతం చేసుకుంది. ఇది మేఘాకే కాదు దేశం మొత్తం గ‌ర్వ‌పడాల్సిన విష‌యమని అభిప్రాయపడ్డారు.
చదవండి: టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్‌డీపీపీలోకి విలీనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement