Indigenous knowledge
-
ఎలక్ట్రికల్ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం
న్యూఢిల్లీ: నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు. ఇంధన ట్యాంకు పరిమాణం తగ్గిపోతే.. దానికి అనుగుణంగా అన్నీ తగ్గుతాయని, ఉపగ్రహం రెండు టన్నుల్లోపే ఉంటుందని చెప్పారు. అయితే నాలుగు టన్నుల రాకెట్‌కు సరిపడా శక్తి ఉంటుందని వివరించారు. సాధారణంగా కెమికల్ థ్రస్టర్ల ద్వారా రాకెట్ మండించి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. వారం రోజుల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంటుందని, అయితే ఎలక్ట్రికల్ ప్రొపెల్షన్‌ను వాడితే మూడునెలల సమయం పడుతుందని తెలిపారు. -
చైనా స్వదేశీ విమానం సక్సెస్
బీజింగ్: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. -
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
2047 నాటికి నేవీకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం 2047 నాటికల్లా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటుందని నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్‌తో నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానం ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో రూ.2,230 కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు డైవింగ్ సపోర్టు వెసల్స్(డీఎస్వీల) జల ప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత సముద్ర జలాల్లో దేశ రక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 45 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 43 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టు తెలిపారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ డీఎస్‌వీలను తొలిసారిగా నేవీ కోసం విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డు నిర్మించిందని, వీటికి అవసరమైన పరికరాలను దేశంలోని 120 ఎంఎస్ఎంఈలు సమకూర్చినట్టు చెప్పారు. జలాంతర్గాముల్లో సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సిబ్బందిని రక్షించేందుకు కొత్త డీఎస్వీ వెసల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకొచ్చాక డీప్ సీ డైవింగ్ ఆపరేషన్లలో కొత్త శకం ఆరంభమవుతుందన్నారు. హెచ్ఎస్ఎల్ సీఎండీ హేమంత్ ఖాత్రి మాట్లాడుతూ తమ నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 200 నౌకలను నిర్మించిందని, 2000 నౌకలకు మరమ్మతులు చేసిందని వెల్లడించారు. 2021–22 ఆరి్థక సంవత్సరంలో రూ.755 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.51 కోట్ల లాభాలనార్జించిందని వివరించారు. నిస్తార్, నిపుణ్‌లుగా నామకరణం కొత్తగా నిర్మించిన డీఎస్‌వీలకు నిస్తార్, నిపుణ్‌లుగా భారత నావికా దళాధిపతి సతీమణి కళాహరికుమార్ నామకరణం చేశారు. తొలుత ఆమె రెండు వెసల్స్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేవీ చీఫ్ హరికుమార్‌తో కలిసి ఆమె రిమోట్ కంట్రోల్ ద్వారా నిస్తార్, నిపుణ్‌లపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ వెంటనే వాటిని హర్షధ్వానాల మధ్య జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా, నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, హెచ్ఎస్ఎల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
Lakshmi Venkatesh: చిన్నప్పట్నుంచీ ఉంది
నలభై మూడేళ్లు లక్ష్మీ వెంకటేశ్‌కి ఇప్పుడు. కర్ణాటకలోని దావణగెరె ఆమెది. బెంగళూరులోని ‘ఇండిజీన్’ కంపెనీ డేటా అండ్ ఎనలిటిక్స్ విభాగంలో సీనియర్ మేనేజర్. విషయం ఏంటంటే.. ఆరేళ్ల వయసులో ఆమె ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు లక్ష్మి! అవును. అలా లేకుంటే ఇప్పటికీ ఆమె డెంటిస్టుగానే ఉండిపోయేవారు. ఆమెను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపించవచ్చు. అందుకు కారణం.. ఆమె నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కనిపించడమే! నేర్చుకోవడంలో కిక్ ఉంది అంటారు లక్ష్మి. ఆరేళ్ల వయసులో తొలిసారి తల్లితో కలిసి యోగా సాధనకు వెళ్లింది లక్ష్మి. ఆసనాలన్నీ నేర్చుకున్న దశకు వచ్చాక ఇక ఆ అమ్మాయికి కొత్త ఆసనాలపైకి ధ్యాస మళ్లింది. అవీ నేర్చుకున్నాక ఇంకా ఏవైనా కొత్తవి ఉన్నాయా అన్నట్లు పచ్చికలో చాపను పరుచుకుని కూర్చొని యోగా గురువు కోసం ఎదురు చూస్తుండేది. నేర్చుకోవడమే జీవితం అన్నట్లుగా ఆనాటి నుంచి ఈనాటికి ఇండిజీన్ వరకు వచ్చేశారు లక్ష్మి. ఇండిజీన్ హెల్త్‌కేర్ సంస్థ. డెంటిస్టుగా జీవితం బాగా అలవాటైపోయి, డేటా ఎనలిస్టుగా ఇటువైపు వచ్చేశారు లక్ష్మి. 2000లో ఆమె దావణగెరెలోని బాపూజీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి డెంటల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత బెంగళూరులో డెంటల్ క్లినిక్ పెట్టి ఎనిమిదేళ్లు నడిపారు. రూట్ కెనాల్స్ చెయ్యడం, పళ్లు పీకడం, ఇతర దంత సమస్యల చికిత్స.. ఇదంతా బాగా బోర్ కొట్టేసింది డాక్టర్ లక్ష్మికి. ప్రాక్టీస్ బాగానే ఉంది. డబ్బు సమృద్ధిగానే వస్తుంది. కానీ అవి ఆమెను డెంటిస్టుగా కొనసాగేలా చేయలేకపోయాయి. ప్రొఫెషన్ వదిలేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేసి, తర్వాత రెండేళ్లపాటు క్లినికల్ రిసెర్చ్ చేశారు. ‘‘కొత్త కెరీర్లోకి వెళ్లడం కోసం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం’’ అంటారు లక్ష్మి. నేర్చుకోవడం ఆమెకు సంతృప్తిని ఇస్తుందట. క్లినికల్ రిసెర్చ్‌లో ఉండగా 2009 లో ఆమె ఇండిజీన్లో ఎనలిస్టుగా సెలక్ట్ అయ్యారు. ఆమెకు పడిన మొదటి అసైన్మెంట్.. ‘ట్రైయల్ పీడియా’ను అభివృద్ధి పరచడం. అన్ని క్లినికల్ డేటాలకు అది ఊపిరితిత్తుల వంటిది. ఆ టాస్క్‌ని లక్ష్మి, ఆమె బృందం విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల ఆ ప్రాజెక్టు మీద ఉన్నాక ఆమె డేటా ఎనలిటిక్స్ వైపు వెళ్లారు. తమ సంస్థ తరఫున అనేక ఫార్మా కంపెనీలకు ప్రాజెక్టులు చేసి పెట్టారు. వాటి కచ్చితత్వం కోసం లక్ష్మి, ఆమె టీమ్ కొత్త విషయాలను నేర్చుకోవలసి వచ్చింది. అది ఆమెకు ఇష్టమైన విద్యే కదా. ఇప్పుడు తను సీనియర్ మేనేజర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేస్తున్నారు. ఆ రంగంలోని కొత్త ఆవకాశాల కోసం కాదు కానీ, కొత్తగా నేర్చుకోవలసిన వాటి కోసం చూస్తున్నారు! -
‘మేఘా’ మరో రికార్డు.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు క్షేత్రంలో ఈ రోజు 07.04.2021 న డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది. 6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుండి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి. 20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు. 2000 హెచ్ పి సామర్థ్యం గల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీటర్ల (6 కిలో మీటర్లు) వరకు తవ్వగలవు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గులలో గుజరాత్లో ఒకటి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది. అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి రిగ్గు ద్వారా ప్రస్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ మరియు ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామర్థ్యంతో 4 వేల మీటర్ల వరకు సులువుగా తవ్వగలదు. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది. దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీ కి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాతన టెక్నాలజీగల రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుంది. చమురు బావులను డ్రిల్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మేకిన్ ఇండియా నినాదాన్ని తన విధానంగా మేఘా మార్చుకున్నదన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివరకు విదేశాలపైనే ఆధారపడ్డ భారత్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిరణంగా మారిందని రాజేశ్ రెడ్డి తెలిపారు. రిగ్గుల తయారీలో విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గులను తయారు చేసిన ఘనత మేఘా సొంతం చేసుకుంది. ఇది మేఘాకే కాదు దేశం మొత్తం గర్వపడాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు. చదవండి: టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్‌డీపీపీలోకి విలీనం -
2022 కల్లా తూర్పు నావిక దళంలోకి ‘విక్రాంత్’
సాక్షి, విశాఖపట్నం: స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణమని తూర్పు నావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలకేనని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, ఎం.ఎస్.ఎం ఈ రక్షణ రంగ అవసరాలకు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ సాధనలో సముద్ర రవాణా కీలకమని, అందుకు తగ్గట్టుగా రక్షణ పర్యవేక్షక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. (చదవండి: విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక) ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, లాంగ్ రేంజ్ షిప్‌లు, న్యూ క్లియర్ సబ్ మెరైన్లను సమకూర్చుకోవాలని తెలిపారు. మేరీటైమ్ డొమైన్ ఎవేర్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. నిర్మాణంలో వున్న విక్రాంత్ ఎయర్ క్రాఫ్ట్ కెరియర్ కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని వెల్లడించారు. 2021లో విక్రాంత్‌కు ట్రైల్ రన్ పూర్తయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2022 కల్లా తూర్పు నావికదళంలోకి చేరవచ్చని తెలిపారు. హానీట్రాప్‌లో ఎంతటి వారున్న ఉపేక్షించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఫేక్ ఫేస్బుక్ ఎకౌంట్లతో హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. ఆన్‌బోర్డ్ షిప్‌ల్లో మొబైల్ ఫోన్లు నిషేధించామని తెలిపారు. హానీట్రాప్‌కు గురైన వారిలో యువసైలర్లే వున్నారని, నేవీ అధికారులు ఉన్నారనేది నిరాధారమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!) -
టిక్‌టాక్ అవుట్; స్వదేశీ పరిజ్ఞానంతో ‘పాప్-ఇన్’ యాప్
సాక్షి, హైదరాబాద్ : చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత భారత ఇంటర్నెట్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యువతకు వ్యసనంలా మారిన టిక్‌టాక్ రద్దవడంతో నెటిజన్లు అయోమయంలో పడ్డారు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే వేరే యాప్‌ల కోసం జల్లెడ వేసి వెతుకున్నారు. ఈ క్రమంలో స్వదేశి యాప్‌ల వైపు మొగ్గు చూపుతూ.. తమ ప్రతిభను ప్రపంచానికి చూపే పనిలో పడ్డారు. మనదేశం- మన యాప్‌లనే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో దేశంలో స్వదేశీ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. (టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి తగ్గిన అమెజాన్!) ఇందులో భాగంగా అచ్చం టిక్‌టాక్‌ను మాదిరిగానే సంతోషాలను, ఆనందాలను, వీడియోలను ప్రపంచానికి చూపేందుకు ఐ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ పూర్తి స్వదేశీ యాప్ ‘పాప్-ఇన్’ను రూపొందిస్తోంది. ఆధునాతన స్వదేశీ పరిజ్ఞానంతో, వినూత్నమైన ఎన్నో ఫీచర్స్‌తో తయారవుతోంది. అత్యంత సులభతరంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేలా పాప్-ఇన్ను రూపొందిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు ఎన్ ఫణి రాఘవ, కె వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాధవర్మ, బంగార్రాజు తెలియజేశారు. (చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్) పాప్-ఇన్ పూర్తి స్వదేశీ యాప్ అని, ఇది ప్రపంచానికి మనదేశ సత్తాచాటుందని ధీమా వ్యక్తం చేశారు. అరచేతిలో ఆనందాలను పంచే విధంగా పాప్‌ఇన్ యాప్ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. దేశ భవిష్యత్తు స్వదేశీ యాప్‌లపైనే ఆధారపడివుందని,యావత్ ప్రపంచం మన దేశ యాప్‌లను వినియోగించుకునేందుకు ఇష్టపడతారని ఫణి రాఘవ తెలిపారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాప్-ఇన్ యాప్ ఉంటుందని, దీనిని మించి మరే ఇతర దేశం యాప్‌ను రూపొందించలేదని అన్నారు. హై టెక్ వెర్షన్‌తో పాప్-ఇన్ మరి కొద్దిరోజుల్లోనే ప్రజల ముందుకు రానుందని వెల్లడించారు. (టిక్‌టాక్ 2.0: టిక్‌టాక్ కాపీగా ‘ టకా టక్’) -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
మిగ్ దోవలో సుఖోయ్!
దేశ రక్షణలో మన వైమానిక దళం పాత్ర కీలకమైనది. మన గగనతలంతోపాటు దక్షిణాసియా, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో అది నెరవేర్చలసిన బాధ్యతలు ఎన్నెన్నో! శక్తిసామర్థ్యాలరీత్యా చూస్తే మన వైమానిక దళానిది ప్రపంచంలోనే నాలుగో స్థానం. అయితే, దాని అమ్ములపొది ఉండాల్సిన స్థాయిలో లేదని పదే పదే వెల్లడవుతున్న వాస్తవం. గత వారం మహారాష్ట్రలోని పూణె సమీపంలో కుప్ప కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం ఉదంతం ఈ విషయంలో ఉన్న ఆందోళనను మరింతగా పెంచింది. 1971లో పాకిస్థాన్‌తో వచ్చిన యుద్ధంలో మన వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన మిగ్-21 విమానాలు తరచు కుప్పకూలుతూ ఇప్పటికే ‘ఎగిరే శవపేటికలు’గా పేరుతెచ్చుకున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా సుఖోయ్-30పైనా ఆదినుంచీ నిపుణుల్లో అనేక సందేహాలున్నాయి. గత నాలుగేళ్లలో సుఖోయ్ విమానాలు కూలిన ఘటనలు అయిదు చోటుచేసుకున్నాయి. రెండు ఇంజన్లుండే ఈ విమానాల్లో ఇటీవలి కాలంలో సాంకేతికంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గగనతలంలో ఉండగా హఠాత్తుగా ఒక ఇంజన్ మొరాయించడం, వెనువెంటనే అత్యవసరంగా విమానాన్ని దించాల్సిరావడంవంటి ఉదంతాలు పెరిగాయి. వాస్తవానికి వెయ్యి గంటలు ప్రయాణించాక సుఖోయ్‌లను సర్వీసింగ్‌కి పంపాలని వాటిని రూపొందించిన నిపుణులు సూచించినా తాజా ఉదంతాల నేపథ్యంలో 700 గంటలకే ఆ పనిచేస్తున్నారు. అంతేకాదు, పూణె ఘటన తర్వాత మనకున్న 200 సుఖోయ్ విమానాలనూ నిలిపేశారు. సుఖోయ్ ఒప్పందం కుదిరినప్పుడే పలువురు నిపుణులు పెదవి విరిచారు. ఈ విమానాల కొనుగోలుకు మొదట రూ. 22,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా అది మూడేళ్ల వ్యవధిలోనే రూ. 45,000 కోట్లకు ఎగబాకిందని 2006లో కాగ్ నివేదిక విమర్శించింది. సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన స్థాయిలో మన వైమానిక దళం లేదన్న అసంతృప్తి నిపుణుల్లో ఉన్నది. 2,000కు పైగా యుద్ధ విమానాలు, 34 స్క్వాడ్రన్లు ఉన్నా ఎన్నో సమస్యలు చుట్టిముట్టి ఉన్నాయి. స్క్వాడ్రన్లను 42కు విస్తరించాలని, విమాన పాటవాన్ని మరింతగా పెంచుకోవాలని సంకల్పించినా అందుకు తగిన చురుకుదనం కొరవడుతున్నది. ముఖ్యంగా అటు మిగ్-21లనూ, ఇటు సుఖోయ్-30లనూ మనకు సమకూర్చిన రష్యన్లవైపునుంచి సకాలంలో సహకారం అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం. యుద్ధ విమానాల్లో సుఖోయ్‌లు అత్యంతాధునాతనమైనవి. విమానం ప్రయాణంలో ఉండగా ఏ వ్యవస్థ అయినా వైఫల్యానికి గురైతే ఇతర వ్యవస్థలన్నీ చెక్కుచెదరకుండా చూడటం, ప్రత్యామ్నాయ వ్యవస్థల పర్యవేక్షణను లోపరహితంగా నిర్వహించడం ఇందులోని సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత. పెలైట్ స్వీయ అంచనాలతో విమాన గమనాన్ని, దిశను, వేగాన్ని నిర్దేశించే విధానానికి భిన్నంగా ఒక కమాండ్‌తోనే బహుళవిధ లక్ష్యాలను పరిపూర్తిచేయగల సంక్లిష్ట సాంకేతికతను సంతరించుకున్న ఈ విమానాలు యుద్ధరంగంలో ఎంతగానో ఉపకరిస్తాయన్న అంచనాలున్నాయి. అయితే, ఈ సాంకేతికతలో చోటుచేసుకున్న లోపమేదో సుఖోయ్‌కు సమస్యగా మారింది. పూణె ఘటన విషయమే తీసుకుంటే సుఖోయ్ సరిగ్గా నేలను తాకే సమయంలో పెలైట్లు కూర్చున్న సీట్లు వాటంతటవే విమానం నుంచి వేరుపడి బయటికొచ్చాయి. విమానం కూలిపోతున్న సందర్భాల్లో పెలైట్ కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా వేరుపడాల్సి ఉండగా ఇది ఎలా జరిగిందన్నది నిపుణులకు అర్ధంకాని విషయంగా మారింది. ఇంజన్ల వైఫల్యాలను తీర్చేందుకు వాటి డిజైన్‌కు అవసరమైన మార్పులు చేయడానికి ఇంజనీరింగ్ నిపుణులు కృషిచేస్తుండగా తాజా లోపం సుఖోయ్‌ల నాణ్యతపై, వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తున్నది. అందువల్లనే ఈ విమానాలను పూర్తిగా నిలిపివేయాలని వైమానిక దళం అధికారులు నిర్ణయించారు. యుద్ధరంగంలో విధులు నిర్వర్తించే విమానాలు వాటి సామర్థ్యాన్ని నూటికి నూరు శాతమూ ప్రదర్శించగలగాలి. అందులో ఏ కొంచెం తేడావచ్చినా ఆ వైఫల్యం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కనుక సుఖోయ్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలన్న నిర్ణయం సరైందే. 2013తో మొదలుబెట్టి 2017లోగా మిగ్-21 విమానాలను దశలవారీగా తొలగిస్తామని కేంద్రం ప్రకటించి చాన్నాళ్లయింది. అప్పటికల్లా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవాల్సిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రెడీ అవుతుందని ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. అయితే అదింకా పరీక్షల దశలోనే ఉన్నది. అవన్నీ పూర్తయి, దాని శ్రేష్టతపై తుది నిర్ణయానికి వచ్చాక తప్ప ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యంకాదు. ఈలోగానే అటు మిగ్-21 యుద్ధ విమానాలూ, ఇటు సుఖోయ్లూ ఇలా మొరాయించడం ఆందోళన కలిగించే అంశం. మిగ్-21లకు స్పేర్పార్ట్ల సమస్య ఉన్నది. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత అమెరికా విధించిన ఆంక్షలవల్ల తేజస్ ఆలస్యమైంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇప్పుడున్న 26 శాతంనుంచి 49 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందువల్ల రక్షణ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడానికి మార్గం సుగమం కాగలదన్న ఆశలూ ఉన్నాయి. అయితే, కీలకమైన రక్షణ సాంకేతికతలను అందజేయడంపై పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆంక్షలు వాటిని ఎంతవరకూ సాకారం చేస్తాయో, మన అవసరాలను ఎంతవరకూ తీరుస్తాయో చెప్పలేము. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు లేకపోయినా నిత్యం సర్వసన్నద్ధతలో ఉండటం ముఖ్యం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చే అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ప్రధానం. సుఖోయ్ విషయంలో ఎదురైన సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యపడాలని కోరుకుందాం. -
అంబులపొదిలో ఐఎన్ఎస్ కమోర్తా
* యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ * స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన జలాంతర్గాముల విధ్వంసక యుద్ధనౌక * పొరుగుదేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం: మంత్రి * విదేశాలకు దీటుగా భారత నౌకా నిర్మాణం విశాఖపట్నం: భారత నావికాదళ అంబుల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. శత్రు దేశాల జలాంతర్గాముల సింహస్వప్నంగా నిలిచే అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కమోర్తా’ భారత నావికాదళంలో భాగస్వామి అయింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక యుద్ధనౌకను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం నేవల్‌బేస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశ సముద్రజలాల్లోకి చొరబడే శత్రుదేశాల జలాంతర్గాములను గుర్తించి విధ్వసం చేయగల సత్తా కమోర్తా సొంతమన్నారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ (ఏఎస్‌డబ్ల్యూ) కొర్వెట్టే తరహాలో నిర్మించ తలపెట్టిన నాలుగు అత్యాధునిక కొర్వెట్టే యుద్ధనౌకల్లో ఇది మొదటిదని తెలిపారు. ఈ జలాంతర్గాముల విధ్వంసక నౌక డిజైన్ భారత నౌకాదళమే చేసిందని జైట్లీ వెల్లడించారు. ఐఎన్ఎస్ కమోర్తా 2013లో సీ ట్రయిల్స్ నిర్వహించారని, 2014 జూలై 12న భారత నావికా దళానికి నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) అప్పగించిదన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 190 యుద్ధనౌకలు, జలాంతర్గాముల్ని నిర్మిం చేందుకు రక్షణ శాఖ ప్రణాళిక రూపొందించగా అందులో 42 నిర్మాణదశలో ఉన్నాయని ఆయన తెలిపారు. అతిపెద్ద తీరప్రాంతం కలిగిన భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కాంక్షిస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీ పరిశ్రమలకు దీటుగా భారత్‌లో నౌకా నిర్మాణ పరిశ్రమ ఎదుగుతోందన్నారు. దేశంలోని ప్రైవేటు నిర్మాణ సంస్థలు సైతం రక్షణ శాఖ పీఎస్‌యూలతో పోటీపడుతున్నాయన్నారు. నౌకా నిర్మాణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ, జీఆర్ఎస్ఇ ఎండీ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎ.కె. వర్మ, కమోర్తా కమాండింగ్ అధికారి కమాండర్ మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. కమోర్తా విశిష్టతలు ఇవీ.. - 110 మీటర్ల పొడవుతో 3,500 టన్నుల బరువుంటుంది. - 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతూ ఏకధాటిగా 3,450 నాటికల్ మైళ్ల వరకు వెళ్లగలదు. - నౌక ఉపరితలం మీదనుంచి గాలిలో లక్ష్యాల్ని చేధించడానికి వీలుగా క్షిపణులు మోహరించి ఉంటాయి. - యుద్ధనౌక ముందుభాగంలోని మెయిన్ గన్ 16 నాటికన్‌మైళ్ల లక్ష్యాల్ని చేధించగలదు. - ముందుభాగంలోనే ఉండే సోనార్ లక్ష్యాల్ని సులభంగా గుర్తించగలగుతుంది. - 13 మంది అధికారులు, 173 నావికులు కమోడోర్ మనోజ్ ఝా నేతృత్వంలో నిరంతరం సేవలందిస్తారు. - 1971లో ఐఎన్ఎస్ విక్రాంత్‌కు మార్గనిర్దేశం చేసిన విమాన వాహన నౌక కమోర్తా పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. - అండమాన్,నికోబార్ ద్వీప సముదాయంలోని ఓ ద్వీపం పేరే కమోర్తా. - ఈ యుద్ధనౌక డిజైన్‌ను డైరక్టరేట్ నావల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. - ఐఎన్ఎస్ కమోర్తా తరహా నౌక తొలుత 1965లో యూఎస్ఎస్ఆర్ నుంచి సబ్‌మెరైన్ చేజర్స్ నౌకగా భారత నావికా దళంలోకి చేరింది. - అది 1971 పాక్ యుద్ధంలోనూ, 1987 అమన్ ఆపరేషన్స్, 1989 పవన్ ఆపరేషన్స్, 1991 తషా ఆపరేషన్స్ తదితరాల్లో పాల్గొని 1991 అక్టోబర్ 31న సేవలు విరమించింది. -
దేశీయ పరిజ్ఞానంతో ప్రగతి: డాక్టర్ సారస్వత్
సాక్షి, సిటీ బ్యూరో: సుస్థిర అభివృద్ధికి దేశీయు సాంకేతిక పరిజ్ఞానం అవసరవుని, దానిని సవుకూర్చుకోవటానికి యువత కార్యోన్ముఖులు కావాలని రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ వూజీ డెరైక్టర్ డాక్టర్ వీకే సారస్వత్ పిలుపునిచ్చారు. దేశంలో పర్యావరణ అనుకూల అభివృద్ధి దిశగా పరిశోధనలు సాగాలని అభిలషించారు. పర్యావరణ సవుతుల్యం లోపించినప్పుడు సవుస్యలు ఉత్పన్నవువుతాయున్నారు. ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త వ హించాలన్నారు. నగరంలోని గీతం విశ్వవిద్యాలయు ప్రాంగణంలో శనివారం విజ్ఞాన భారతి విద్యార్థి విభాగాన్ని ఆయున ప్రారంభించారు. ప్రదేశాలు, పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి సెక్రెటరీ జనరల్ జయుకువూర్, విద్యాలయు గవర్నింగ్ బాడీ సభ్యుడు ఎం.శ్రీ భరత్, ప్రో వైస్ చాన్స్‌లర్, రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్ శివకువూర్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ, ఏరోనాటికల్ విభాగాధిపతి ఎన్వీ స్వామినాయుడు, సుబ్బారావులు పాల్గొన్నారు. -
తర్వలో జిల్లాలోకి అరిహంత్
భారత నేవీ చీఫ్ ఆర్కే ధొవన్ విశాఖపట్నం, న్యూస్‌లైన్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి అరిహంత్ సముద్ర జలాల్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్కె ధొవన్ తెలిపారు. అది తుది దశ హార్బర్ ట్రయల్స్‌లో ఉందని తెలిపారు. నేవీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రోజుల పర్యటన కోసం తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన తొలిరోజు ఐఎన్ఎస్ సర్కార్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో తూర్పు నావికాదళ ప్లాటూన్స్ ఉత్సవ ఊరేగింపును బుధవారం సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత నేవీలో తూర్పు నావికా దళం (ఈఎన్సీ) ప్రత్యేకత సంతరించుకుందన్నారు. శాంతి పరిరక్షణలోనేకాక ఎదురుదాడుల్లోనూ ఈఎన్సీ గొప్ప బాధ్యతలు నిర్వర్తిస్తోందని కొనియాడారు. గడిచిన రెండేళ్లలో శివాలిక్ తరహా యుద్ధనౌకలు, పి-81 లాంగ్ రేంజ్ సముద్రజల పరిరక్షణ, జలాంతర్గాముల విధ్వంసక ఎయిర్‌క్రాఫ్ట్, జెట్ ట్రైనర్స్ హాక్, అణు విధ్వంసక జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర వంటి వాటిని సమకూర్చుకుందని వివరించారు. ఇటీవల సంభవించిన ప్రమాదాలు నావికా దళానికి మచ్చ తెచ్చాయని, అన్ని విభాగాల సమన్వయంతో నేవీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని అన్నారు. ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా నేవీ చీఫ్‌కు కమాండ్ కార్యకలాపాలను వివరించారు. గతంలో ఈస్ట్రన్ ఫ్లీట్ కు, తూర్పు నావికాదళానికి చీఫ్‌గా సేవలందించిన ధొవన్.. ఈఎన్సీకి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఇతర యూనిట్ల ను పర్యవేక్షించారు. ధొవన్ సతీమణి మినూ ధొవన్ డాల్ఫిన్‌నోస్‌పై నేవీ చిల్డ్రన్ స్కూల్ కిండర్‌గార్డెన్ పాఠశాలలు, నౌసేనా బాగ్‌లోని సిబ్బంది సౌకర్యాలు, నేవీ వైవ్స్ వెల్ఫేర్ సంఘం సేవల్ని పరిశీలించారు. పరేడ్‌లో నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీలో ఎన్ఐఎన్ కిట్ల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఆహారం, నీళ్లలో జరిగే కల్తీని అరికట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తమ సంస్థ రూపొందించిన కిట్లను గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆవిష్కరిస్తున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఒక ప్రకటనలో తెలిపింది. బయో సర్వ్ బయో టెక్నాలజీ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని కిట్లను రూపొందించామని, ఆహారం, నీళ్లలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియాను ఈ కిట్ల ద్వారా తెలుసుకోవచ్చునని, తక్కువ ధరకే ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. అంతేకాకుండా రక్త సేకరణ, నిల్వ, రవాణా సంబంధిత ఖర్చులను భారీగా తగ్గించే మరొక రక్త పరీక్షా కిట్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు ఎన్ఐఎన్ తెలిపింది. దీనిద్వారా రక్తంలో విటమిన్ ‘ఎ’ స్థితి సులభంగా తెలుసుకోవచ్చు. డెంగీ జ్వర నిర్ధరణకు చేసే ఎలీసా రక్త పరీక్షా విధానంలోని సీరమ్‌లోని ఇనుము శాతాన్ని కనుగొనే విధానాన్ని కూడా అభివృద్ధి చేశామని, ఈ కిట్ల వల్ల తక్కువ ఖర్చుతో ఫలితాలను తెలుసుకోవచ్చునని వివరించింది. -
‘అగ్ని-1’ పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9:33 గంటలకు నిర్వహించిన ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతమైందని ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. మధ్యశ్రేణి రకానికి చెందిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి అణ్వస్త్రాలతో సహా వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. సుమారు 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. పన్నెండు టన్నుల బరువు, 15 మీటర్ల పొడవైన అగ్ని-1లో అత్యాధునిక నావిగేషన్(దిశానిర్దేశ) వ్యవస్థను అమర్చారు. దీనిని హైదరాబాద్‌లోని ‘రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల, పరిశోధక కేంద్రం ఇమారత్’, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లతో కలిసి డీఆర్డీవో ప్రధాన ప్రయోగశాల అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ రూపొందించింది. -
పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యంగల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 350 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 9:15 గంటలకు ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైనట్లు తెలిపాయి. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థగల పృథ్వీ-2 ఈ ప్రయోగంలో భాగంగా బంగాళాఖాతంలోని ఓ ప్రాంతంలో నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిందని వివరించాయి. 500 కేజీల నుంచి 1,000 కేజీల వరకూ వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యంగల ఈ క్షిపణి గతి మార్గాన్ని డీఆర్డీవో రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు ఆసాంతం పరిశీలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పృథ్వీ-2 క్షిపణి ప్రోగ్రామ్ డెరైక్టర్లు ఎ.డి. అదాలత్ అలీ, ఎన్. శివసుబ్రమణ్యం, ఇతర అధికారులు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అభినందించారు. -
పినాక రాకెట్ల పరీక్ష విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను బుధవారం ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. బాలసోర్‌కు సమీపంలోని చాందీపూర్ తీరం వద్దనున్న స్థావరం నుంచి మల్టీబ్యారెల్ రాకెట్ లాంఛర్ ద్వారా రెండు రౌండ్ల పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఈ ప్రయోగాలు జరిపినట్లు పేర్కొన్నాయి. 1995 నుంచి వివిధ క్లిష్ట పరీక్షలను అధిగమించిన పినాకా రాకెట్లను ఇప్పటికే సైన్యం వాడుతోంది. ఈ ఏడాది జూలైలో అధునాతన పినాకా మార్క్-2 మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పరీక్షలను పశ్చిమ రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఆధునిక రాకెట్లను సైన్యంలోకి చేరుస్తామన్నారు. శతఘు్నలకు సహాయకంగా 40 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని అభివృద్ధి చేశారు.