Lakshmi Venkatesh: చిన్నప్పట్నుంచీ ఉంది | Laxmi as a data scientist after completing her dentist course | Sakshi
Sakshi News home page

Lakshmi Venkatesh: చిన్నప్పట్నుంచీ ఉంది

Published Thu, Jun 3 2021 5:48 AM | Last Updated on Thu, Jun 3 2021 1:32 PM

Laxmi as a data scientist after completing her dentist course - Sakshi

నలభై మూడేళ్లు లక్ష్మీ వెంకటేశ్‌కి ఇప్పుడు. కర్ణాటకలోని దావణగెరె ఆమెది. బెంగళూరులోని ‘ఇండిజీన్‌’ కంపెనీ డేటా అండ్‌ ఎనలిటిక్స్‌ విభాగంలో సీనియర్‌ మేనేజర్‌. విషయం ఏంటంటే.. ఆరేళ్ల వయసులో ఆమె ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు లక్ష్మి! అవును. అలా లేకుంటే ఇప్పటికీ ఆమె డెంటిస్టుగానే ఉండిపోయేవారు. ఆమెను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపించవచ్చు. అందుకు కారణం.. ఆమె నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కనిపించడమే! నేర్చుకోవడంలో కిక్‌ ఉంది అంటారు లక్ష్మి.

ఆరేళ్ల వయసులో తొలిసారి తల్లితో కలిసి యోగా సాధనకు వెళ్లింది లక్ష్మి. ఆసనాలన్నీ నేర్చుకున్న దశకు వచ్చాక ఇక ఆ అమ్మాయికి కొత్త ఆసనాలపైకి ధ్యాస మళ్లింది. అవీ నేర్చుకున్నాక ఇంకా ఏవైనా కొత్తవి ఉన్నాయా అన్నట్లు పచ్చికలో చాపను పరుచుకుని కూర్చొని యోగా గురువు కోసం ఎదురు చూస్తుండేది. నేర్చుకోవడమే జీవితం అన్నట్లుగా ఆనాటి నుంచి ఈనాటికి ఇండిజీన్‌ వరకు వచ్చేశారు లక్ష్మి. ఇండిజీన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ. డెంటిస్టుగా జీవితం బాగా అలవాటైపోయి, డేటా ఎనలిస్టుగా ఇటువైపు వచ్చేశారు లక్ష్మి.

2000లో ఆమె దావణగెరెలోని బాపూజీ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ నుంచి డెంటల్‌ సైన్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత బెంగళూరులో డెంటల్‌ క్లినిక్‌ పెట్టి ఎనిమిదేళ్లు నడిపారు. రూట్‌ కెనాల్స్‌ చెయ్యడం, పళ్లు పీకడం, ఇతర దంత సమస్యల చికిత్స.. ఇదంతా బాగా బోర్‌ కొట్టేసింది డాక్టర్‌ లక్ష్మికి. ప్రాక్టీస్‌ బాగానే ఉంది. డబ్బు సమృద్ధిగానే వస్తుంది. కానీ అవి ఆమెను డెంటిస్టుగా కొనసాగేలా చేయలేకపోయాయి. ప్రొఫెషన్‌ వదిలేశారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో కోర్సు చేసి, తర్వాత రెండేళ్లపాటు క్లినికల్‌ రిసెర్చ్‌ చేశారు.

‘‘కొత్త కెరీర్‌లోకి వెళ్లడం కోసం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం’’ అంటారు లక్ష్మి. నేర్చుకోవడం ఆమెకు సంతృప్తిని ఇస్తుందట. క్లినికల్‌ రిసెర్చ్‌లో ఉండగా 2009 లో ఆమె ఇండిజీన్‌లో ఎనలిస్టుగా సెలక్ట్‌ అయ్యారు. ఆమెకు పడిన మొదటి అసైన్‌మెంట్‌.. ‘ట్రైయల్‌ పీడియా’ను అభివృద్ధి పరచడం. అన్ని క్లినికల్‌ డేటాలకు అది ఊపిరితిత్తుల వంటిది. ఆ టాస్క్‌ని లక్ష్మి, ఆమె బృందం విజయవంతంగా పూర్తి చేశారు.

మూడేళ్ల ఆ ప్రాజెక్టు మీద ఉన్నాక ఆమె డేటా ఎనలిటిక్స్‌ వైపు వెళ్లారు. తమ సంస్థ తరఫున అనేక ఫార్మా కంపెనీలకు ప్రాజెక్టులు చేసి పెట్టారు. వాటి కచ్చితత్వం కోసం లక్ష్మి, ఆమె టీమ్‌ కొత్త విషయాలను నేర్చుకోవలసి వచ్చింది. అది ఆమెకు ఇష్టమైన విద్యే కదా. ఇప్పుడు తను సీనియర్‌ మేనేజర్‌గా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ డేటాను ప్రాసెస్‌ చేస్తున్నారు. ఆ రంగంలోని కొత్త ఆవకాశాల కోసం కాదు కానీ, కొత్తగా నేర్చుకోవలసిన వాటి కోసం చూస్తున్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement