
బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment