కాంగ్రెస్‌ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత! | DK Shivakumar Angry on Congress MLA HR Gaviyappa | Sakshi
Sakshi News home page

వీడియో: కాంగ్రెస్‌ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!

Published Tue, Nov 26 2024 3:55 PM | Last Updated on Tue, Nov 26 2024 5:14 PM

DK Shivakumar Angry on Congress MLA HR Gaviyappa

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రకటించారు.

విజయనగర ఎమ్మెల్యే హెచ​ఆర్‌ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.

ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.

అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్‌ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి  వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్‌ పేర్కొన్నారు.

గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిరాజ్‌ షేక్‌ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement