పలువురు మంత్రులకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు
డిప్యూటీ సీఎం డీకేశి ఫిర్యాదే కారణం!
హోంమంత్రి పరమేశ్వర్ డిన్నర్ రద్దు
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు పెరిగిపోగా, ఢిల్లీలో హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. మంత్రులు, సీనియర్లు విందు భేటీలు జరుపుతూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు రావడంతో పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. డిన్నర్లు, రహస్య భేటీల్లో నిమగ్నమైన నాయకులను ఢిల్లీకి పిలిపించి మందలించనుంది. ఎలాంటి విందు రాజకీయ సమావేశాలను, పార్టీ అనుమతి లేకుండా జరపరాదని హెచ్చరికలు చేయడంతో రాష్ట్ర నాయకుల్లో కలవరం నెలకొంది. వచ్చే వారం కొందరు మంత్రులకు ఢిల్లీకి రావాలని రాహుల్‌గాంధీ ఆప్తుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమాచారం పంపారు.
డీకే ఫిర్యాదు ఏమిటి?
రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు ముమ్మరం కాగా, ప్రతిపక్షాలు దీనిని హేళన చేస్తున్నాయి. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా డిన్నర్లు చేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ గౌరవానికి భంగం వాటిల్లుతోంది. దీనంతటికీ చెక్ పెట్టాలని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్(DKShivakumar) హైకమాండ్‌కు విన్నవించారని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ డిన్నర్లు ఆయన వ్యతిరేక వర్గీయులు జరుపుతున్నవే. డీకేశి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ (CongressHighCommand) మరో రెండు వారాల్లో ప్రక్షాళన చేపడతామని సంకేతాలిచ్చింది. కొందరు మంత్రులు విందు భేటీలు ఏర్పాటు చేయడం సరికాదు, నేను కూడా విందు ఇవ్వవచ్చు, కానీ అలాంటివి సబబుకాదు అని డీకే పేర్కొన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కష్టపడి అధికారంలోకి వస్తే నేతలు, మంత్రులు ఇలా చేస్తున్నారేమిటా అని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ పలువురు సీనియర్ మంత్రులను పిలిపించి గట్టిగా మాట్లాడనుంది.
సీఎం వర్గం గుర్రు
మరోవైపు డీ.కే.శివకుమార్‌పై సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) వర్గానికి చెందిన కొందరు మంత్రులు అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. వీరంతా వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అంతఃకలహాలు కాంగ్రెస్‌లో ఏ పరిణామాలకు దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. డీకే అడ్డుగోడల్ని సీఎం వర్గీయులు ఎలా ఛేదిస్తారనేది చర్చకు కారణమైంది.
13న సీఎల్పీ భేటీ
శివాజీనగర: తాజా పరిణామాల నేపథ్యంలో జనవరి 13న బెంగళూరులోని ఓ హోటల్‌లో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభ మొదలవుతుంది. పారీ్టలో గ్రూపు కొట్లాటలు, హైకమాండ్ ఆగ్రహం నేపథ్యంలో ఈ భేటీ కుతూహలం కలిగిస్తోంది.
నా విందు వాయిదా: హోంమంత్రి పరమేశ్వర్
బుధవారం సాయంత్రం దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు నేను ఏర్పాటు చేసిన విందు రద్దు కాలేదు, వాయిదా పడింది అంతేనని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, హైకమాండ్ సూచన మేరకు విందు భోజనాన్ని వాయిదా వేశాను. విందు తేదీని త్వరలో వెల్లడినన్నారు. డీకే శివకుమార్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియదన్నారు. తాను విందు ఇవ్వరాదని ఎవరైనా అంటే సమాధానం చెప్పే శక్తి తమకు ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment