ఢిల్లీలో తిష్టవేసిన పీసీసీ, మంత్రి పదవుల ఆశావహులు
సీఎం రేవంత్‌ను, హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు
మంత్రి పదవుల వేటలో మల్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బల్మూరి
పీసీసీ కోసం మహేశ్ గౌడ్, సంపత్, బలరాం, షెట్కార్
నామినేటెడ్ పదవుల కోసం మరికొందరు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్య మైన పీసీసీ అధ్యక్ష పదవి సహా మంత్రి పదవుల భర్తీ, ఇతర నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో నేతలంతా ఆయనను, పార్టీ ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులతోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్టవేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
పీసీసీ పదవికి తీవ్ర పోటీ
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ స్థానంలో కొత్తవారిని నియమించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతంతా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు రెండ్రోజులుగా హస్తిన లోనే ఉన్నారు. మధుయాష్కీ ఢిల్లీలో తనకున్న పరిచయాలను వాడుకుంటూ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తుండగా, ఇతర నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వంపై వినతులు ఇచ్చారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ వీరు భేటీ అయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న జాబితాలో ఉన్న ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్‌లు సైతం రోజంతా సీఎం చుట్టూతే ఉన్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం కలిసిన సమయంలోనూ ఈ ఇద్దరు ఆయనతో పాటు నేతలను కలిశారు. ఇక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోనూ పీసీసీ ఆశావహులు భేటీ అయ్యి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి పదవుల కోసం మరికొందరు
మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పలవురు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్న మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం కేసీ వేణుగోపాల్ సహాæ ఇతర నేతలను కలిశారు.
ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర నాయకులు అగ్రనేతలైన సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక సోమవారం ఖర్గే, రాహుల్‌లను కలిసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిలు రేవంత్‌తో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యి, ఇతర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక వీరితోపాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలకు తమ వినతులు అందజేశారు.
ఢిల్లీలో గూడెం మహిపాల్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం ఢిల్లీలో కనిపించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరిగినా, సుప్రీంకోర్టులో ఓ కేసు విషయమై వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక పటాన్‌చెరుకే చెందిన కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు సైతం ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలవడం గమనార్హం.
నేడు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్ అధిష్టానం పిలుపుతోనే ఇద్దరు నేతల హస్తిన పయనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్పష్టమైన కదలికలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండగా, అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఈ ఇద్దరు నేతలు హస్తినకు పయనమవుతున్నారు.
పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నామినేటెడ్ పదవుల కసరత్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, అందుకే రేవంత్‌కు తోడు ఆ ఇద్దరికీ ఢిల్లీ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరతారని తెలుస్తోంది. ఈలోపే ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment