ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్న అధిష్టానం
సోనియాను వేర్వేరుగా కలసిన మహేశ్‌గౌడ్, మధుయాష్కీ
అధిష్టానం పెద్దలకు అభిప్రాయాలు చెప్పిన సీఎం, మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
ఢిల్లీలో విస్తృతంగా చర్చలు..
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతోపాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్, సంపత్‌కుమార్ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్‌తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాం«దీని మహేశ్‌గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ చర్చించారు. తెలంగాణ భవన్‌లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు.
కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా..
పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.
తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment