ఒక వేళ అలాంటి సందర్భమే వస్తే అగ్రనేతలతో చర్చిస్తా
కార్యకర్తలు, పార్టీ నేతల ప్రోద్బలం, స్వశక్తితో రాణించాను
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి
సాక్షి,బళ్లారి: బీజేపీ తనకు తల్లిలాంటిదని, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటును అందించిందని, ప్రస్తుతం పార్టీని వీడే ఆలోచన లేదని, ఒక వేళ పార్టీని వీడే సందర్భమే ఏర్పడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను కారణమని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. తాను నిజాయితీగా పార్టీ అభ్యర్థి గెలుపునకు శ్రమించానన్నారు. తల్లిలాంటి పార్టీకి తాను ఎన్నటికీ ద్రోహం చేయబోనన్నారు. తనను రాజకీయంగా ముగించేందుకు కొందరు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కరి శక్తి, సహకారంతో రాజకీయాల్లో రాణించలేదన్నారు.
ఉద్ధండులతో పోరాడి పైకెదిగా
కష్టపడి, ఎందరో ఉద్ధండులకు వ్యతిరేకంగా పోరాడి ముందుకు వచ్చానన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించానని గాలి జనార్దనరెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ, ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు తన వెంట ఉండటం వల్లనే గెలిచానని, రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెబుతూ రాజకీయ కోటను నిర్మించుకోవాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్కరి ఆశీర్వచనంతో తాను రాజకీయాల్లో రాణించలేదన్నారు. 40 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు పడుతూ రాజకీయాల్లో పైకెదిగానన్నారు. తనకు ఏకకాలంలో మొళకాల్మూరు, బాదామి రెండు అసెంబ్లీ సీట్లు బీజేపీ కేటాయించిందన్నారు. తన శక్తి ఏమిటో పార్టీ అగ్రనేతలకు తెలుసన్నారు. తన సమాజానికి చెందిన వారు, ఇతర కులాలకు చెందిన వారి సహకారం తనకు ఎంతో ఉందన్నారు. ఆయన అబద్ధాలు చెబితే వినడానికి నేనేమి చిన్న పిల్లవాడిని కాదన్నారు.
ప్రజలు చాలా మేధావులు
ప్రజలు కూడా చాలా బుద్ధివంతులని, ఆయన మాటలను వినే పరిస్థితిలో లేరన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జి తనపై తీవ్ర ఆరోపణ చేశారన్నారు. సండూరులో పార్టీ ఓటమికి తానే కారణమని పేర్కొనడంతో తాను సంజాయిషీ ఇచ్చానన్నారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తన గురించి ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు. సదానంద గౌడ మినహా తనకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు.› ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వారి స్వశక్తి ఉంటుందన్నారు. తన వల్ల అంతా రాజకీయంగా ముందుకు వెళుతున్నారనే భ్రమను ఆయన వీడాలన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అప్పట్లో పార్టీ అగ్రనాయకురాలు దివంగత సుష్మాస్వరాజ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. అప్పటి నుంచి తాను బీజేపీలో తనదైన ముద్ర వేసుకుని కష్టపడి పని చేసి ముందుకు వచ్చానన్నారు. పలువురు శ్రీరాములు అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment