
బెంగళూరు: అక్క, చెల్లి దారుణ హత్యకు గురైన ఘటన దావణగెరెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి సమీపంలోని అంజనేయ కాటన్ మిల్ లేఔట్‌లో ఈ ఘటన జరిగింది. హతులను బళ్లారి జిల్లా కూడ్లగి తాలూకా బెనకనహళ్లి గ్రామానికి చెందిన గౌరమ్మ (34), రాధిక (32)లుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కూలిపనులు చేసే వీరు మూడు రోజులుగా కనిపించలేదు. వీరి సమీప బంధువు చంద్రమ్మ పలుమార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో అనుమానంతో శుక్రవారం ఉదయం ఇంటికి వద్దకు రాగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. ఇటీవల గౌరమ్మ భర్త మంజునాథ్ ఇంటికి వచ్చి గొడవ పడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment