భారత నేవీ చీఫ్ ఆర్‌కే ధొవన్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి అరిహంత్ సముద్ర జలాల్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధొవన్ తెలిపారు. అది తుది దశ హార్బర్ ట్రయల్స్‌లో ఉందని తెలిపారు. నేవీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రోజుల పర్యటన కోసం తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన తొలిరోజు ఐఎన్‌ఎస్ సర్కార్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో తూర్పు నావికాదళ ప్లాటూన్స్ ఉత్సవ ఊరేగింపును బుధవారం సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత నేవీలో తూర్పు నావికా దళం (ఈఎన్‌సీ) ప్రత్యేకత సంతరించుకుందన్నారు. శాంతి పరిరక్షణలోనేకాక ఎదురుదాడుల్లోనూ ఈఎన్‌సీ గొప్ప బాధ్యతలు నిర్వర్తిస్తోందని కొనియాడారు. గడిచిన రెండేళ్లలో శివాలిక్ తరహా యుద్ధనౌకలు, పి-81 లాంగ్ రేంజ్ సముద్రజల పరిరక్షణ, జలాంతర్గాముల విధ్వంసక ఎయిర్‌క్రాఫ్ట్, జెట్ ట్రైనర్స్ హాక్, అణు విధ్వంసక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్ర వంటి వాటిని సమకూర్చుకుందని వివరించారు.
ఇటీవల సంభవించిన ప్రమాదాలు నావికా దళానికి మచ్చ తెచ్చాయని, అన్ని విభాగాల సమన్వయంతో నేవీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని అన్నారు. ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయంలో వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా నేవీ చీఫ్‌కు కమాండ్ కార్యకలాపాలను వివరించారు. గతంలో ఈస్ట్రన్ ఫ్లీట్ కు, తూర్పు నావికాదళానికి చీఫ్‌గా సేవలందించిన ధొవన్.. ఈఎన్‌సీకి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఇతర యూనిట్ల ను పర్యవేక్షించారు. ధొవన్ సతీమణి మినూ ధొవన్ డాల్ఫిన్‌నోస్‌పై నేవీ చిల్డ్రన్ స్కూల్ కిండర్‌గార్డెన్ పాఠశాలలు, నౌసేనా బాగ్‌లోని సిబ్బంది సౌకర్యాలు, నేవీ వైవ్స్ వెల్ఫేర్ సంఘం సేవల్ని పరిశీలించారు. పరేడ్‌లో నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తర్వలో జిల్లాలోకి అరిహంత్
Published Thu, May 1 2014 12:13 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement