మీడియా సమావేశంలో డ్రిల్ మెక్ టెక్నికల్ హెడ్ ఉంబెర్టో లవెజ్జి, కృష్ణ కుమార్, శ్రీనివాస్, రాజేశ్ రెడ్డి (ఎడమ నుంచి కుడికి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్‌జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు.
ఓఎన్‌జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment