దేశ రక్షణలో మన వైమానిక దళం పాత్ర కీలకమైనది. మన గగనతలంతోపాటు దక్షిణాసియా, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో అది నెరవేర్చలసిన బాధ్యతలు ఎన్నెన్నో! శక్తిసామర్థ్యాలరీత్యా చూస్తే మన వైమానిక దళానిది ప్రపంచంలోనే నాలుగో స్థానం. అయితే, దాని అమ్ములపొది ఉండాల్సిన స్థాయిలో లేదని పదే పదే వెల్లడవుతున్న వాస్తవం. గత వారం మహారాష్ట్రలోని పూణె సమీపంలో కుప్ప కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం ఉదంతం ఈ విషయంలో ఉన్న ఆందోళనను మరింతగా పెంచింది. 1971లో పాకిస్థాన్‌తో వచ్చిన యుద్ధంలో మన వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన మిగ్-21 విమానాలు తరచు కుప్పకూలుతూ ఇప్పటికే ‘ఎగిరే శవపేటికలు’గా పేరుతెచ్చుకున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా సుఖోయ్-30పైనా ఆదినుంచీ నిపుణుల్లో అనేక సందేహాలున్నాయి. గత నాలుగేళ్లలో సుఖోయ్ విమానాలు కూలిన ఘటనలు అయిదు చోటుచేసుకున్నాయి.
రెండు ఇంజన్లుండే ఈ విమానాల్లో ఇటీవలి కాలంలో సాంకేతికంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గగనతలంలో ఉండగా హఠాత్తుగా ఒక ఇంజన్ మొరాయించడం, వెనువెంటనే అత్యవసరంగా విమానాన్ని దించాల్సిరావడంవంటి ఉదంతాలు పెరిగాయి. వాస్తవానికి వెయ్యి గంటలు ప్రయాణించాక సుఖోయ్‌లను సర్వీసింగ్‌కి పంపాలని వాటిని రూపొందించిన నిపుణులు సూచించినా తాజా ఉదంతాల నేపథ్యంలో 700 గంటలకే ఆ పనిచేస్తున్నారు. అంతేకాదు, పూణె ఘటన తర్వాత మనకున్న 200 సుఖోయ్ విమానాలనూ నిలిపేశారు. సుఖోయ్ ఒప్పందం కుదిరినప్పుడే పలువురు నిపుణులు పెదవి విరిచారు. ఈ విమానాల కొనుగోలుకు మొదట రూ. 22,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా అది మూడేళ్ల వ్యవధిలోనే రూ. 45,000 కోట్లకు ఎగబాకిందని 2006లో కాగ్ నివేదిక విమర్శించింది.
సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన స్థాయిలో మన వైమానిక దళం లేదన్న అసంతృప్తి నిపుణుల్లో ఉన్నది. 2,000కు పైగా యుద్ధ విమానాలు, 34 స్క్వాడ్రన్‌లు ఉన్నా ఎన్నో సమస్యలు చుట్టిముట్టి ఉన్నాయి. స్క్వాడ్రన్‌లను 42కు విస్తరించాలని, విమాన పాటవాన్ని మరింతగా పెంచుకోవాలని సంకల్పించినా అందుకు తగిన చురుకుదనం కొరవడుతున్నది. ముఖ్యంగా అటు మిగ్-21లనూ, ఇటు సుఖోయ్-30లనూ మనకు సమకూర్చిన రష్యన్లవైపునుంచి సకాలంలో సహకారం అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం. యుద్ధ విమానాల్లో సుఖోయ్‌లు అత్యంతాధునాతనమైనవి. విమానం ప్రయాణంలో ఉండగా ఏ వ్యవస్థ అయినా వైఫల్యానికి గురైతే ఇతర వ్యవస్థలన్నీ చెక్కుచెదరకుండా చూడటం, ప్రత్యామ్నాయ వ్యవస్థల పర్యవేక్షణను లోపరహితంగా నిర్వహించడం ఇందులోని సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత. పెలైట్ స్వీయ అంచనాలతో విమాన గమనాన్ని, దిశను, వేగాన్ని నిర్దేశించే విధానానికి భిన్నంగా ఒక కమాండ్‌తోనే బహుళవిధ లక్ష్యాలను పరిపూర్తిచేయగల సంక్లిష్ట సాంకేతికతను సంతరించుకున్న ఈ విమానాలు యుద్ధరంగంలో ఎంతగానో ఉపకరిస్తాయన్న అంచనాలున్నాయి. అయితే, ఈ సాంకేతికతలో చోటుచేసుకున్న లోపమేదో సుఖోయ్‌కు సమస్యగా మారింది. పూణె ఘటన విషయమే తీసుకుంటే సుఖోయ్ సరిగ్గా నేలను తాకే సమయంలో పెలైట్లు కూర్చున్న సీట్లు వాటంతటవే విమానం నుంచి వేరుపడి బయటికొచ్చాయి. విమానం కూలిపోతున్న సందర్భాల్లో పెలైట్ కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా వేరుపడాల్సి ఉండగా ఇది ఎలా జరిగిందన్నది నిపుణులకు అర్ధంకాని విషయంగా మారింది. ఇంజన్ల వైఫల్యాలను తీర్చేందుకు వాటి డిజైన్‌కు అవసరమైన మార్పులు చేయడానికి ఇంజనీరింగ్ నిపుణులు కృషిచేస్తుండగా తాజా లోపం సుఖోయ్‌ల నాణ్యతపై, వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తున్నది. అందువల్లనే ఈ విమానాలను పూర్తిగా నిలిపివేయాలని వైమానిక దళం అధికారులు నిర్ణయించారు.
యుద్ధరంగంలో విధులు నిర్వర్తించే విమానాలు వాటి సామర్థ్యాన్ని నూటికి నూరు శాతమూ ప్రదర్శించగలగాలి. అందులో ఏ కొంచెం తేడావచ్చినా ఆ వైఫల్యం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కనుక సుఖోయ్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలన్న నిర్ణయం సరైందే. 2013తో మొదలుబెట్టి 2017లోగా మిగ్-21 విమానాలను దశలవారీగా తొలగిస్తామని కేంద్రం ప్రకటించి చాన్నాళ్లయింది.
అప్పటికల్లా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవాల్సిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రెడీ అవుతుందని ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. అయితే అదింకా పరీక్షల దశలోనే ఉన్నది. అవన్నీ పూర్తయి, దాని శ్రేష్టతపై తుది నిర్ణయానికి వచ్చాక తప్ప ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యంకాదు. ఈలోగానే అటు మిగ్-21 యుద్ధ విమానాలూ, ఇటు సుఖోయ్‌లూ ఇలా మొరాయించడం ఆందోళన కలిగించే అంశం. మిగ్-21లకు స్పేర్‌పార్ట్‌ల సమస్య ఉన్నది. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత అమెరికా విధించిన ఆంక్షలవల్ల తేజస్ ఆలస్యమైంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇప్పుడున్న 26 శాతంనుంచి 49 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందువల్ల రక్షణ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడానికి మార్గం సుగమం కాగలదన్న ఆశలూ ఉన్నాయి. అయితే, కీలకమైన రక్షణ సాంకేతికతలను అందజేయడంపై పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆంక్షలు వాటిని ఎంతవరకూ సాకారం చేస్తాయో, మన అవసరాలను ఎంతవరకూ తీరుస్తాయో చెప్పలేము. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు లేకపోయినా నిత్యం సర్వసన్నద్ధతలో ఉండటం ముఖ్యం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చే అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ప్రధానం. సుఖోయ్ విషయంలో ఎదురైన సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యపడాలని కోరుకుందాం.
మిగ్ దోవలో సుఖోయ్!
Published Fri, Oct 24 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement
Advertisement