సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్‌సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్‌లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు.
పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్‌లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు.
ఇంకొన్ని ప్రత్యేకతలు
ఈ హెలికాప్టర్‌లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్‌లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment