న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు.
తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు
తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment