Hindustan Aeronautics Limited
-
హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీగా డాక్టర్ డీకే సునీల్
ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ డీకే సునీల్ నియమితులయ్యారు. ఆయన నియామకం సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వస్తుందని హెచ్ఏఎల్ పేర్కొంది.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 2022 సెప్టెంబర్ 29 నుండి డైరెక్టర్ (ఇంజనీరింగ్, ఆర్&డీ)గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్, ఎండీగా ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్ 30 వరకు లేదా రక్షణ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అది కొనసాగుతుంది.ఉస్మానియా పూర్వ విద్యార్థిడాక్టర్ సునీల్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. మద్రాస్ ఐఐటీ నుండి ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. 2019లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ సైన్స్‌లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ సునీల్ 1987లో సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. తర్వాత ఇప్పటి వరకు వివిధ పాత్రలలో పనిచేశారు. డిజైన్, ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో సేవలు అందించారు. సునీల్ నాయకత్వంలో హై పవర్ రాడార్ విద్యుత్ సరఫరా, వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్ సిస్టమ్, కంబైన్డ్ ఇంటరాగేటర్ ట్రాన్స్‌పాండర్ వంటి కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేశారు. ఇవి కంపెనీకి కొత్త వృద్ధి ప్రాంతాలుగా మారాయి. -
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
తేజస్‌లో మోదీ
సాక్షి బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు చెందిన తయారీయూనిట్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. పైలట్ యూనిఫామ్ ధరించి తేజస్ యుద్ధ విమానంలో సుమారు 10 నిమిషాల పాటు ప్రయాణించారు. తన యుద్దవిమాన ప్రయాణం తాలూకు ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తేజస్‌లో ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణ అనుభవం భారతదేశ దేశీయ సామర్థ్యాలపై నా నమ్మకాన్ని మరింతగా పెంచింది. దేశీయ టెక్నాలజీ, వైమానిక సత్తా, కృషి, అంకితభావం చూస్తే గర్వంగా ఉంది. స్వావలంబనలో ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్ తీసిపోదు. భారతీయులుగా మనందరం ఈ విషయంలో భారత వాయుసేన, డీఆర్డీవో, హాల్‌ను అభినందించాల్సిందే’’ అని మోదీ ట్వీట్‌చేశారు. విమాన ప్రయాణం తర్వాత హాల్లోని తయారీ కేంద్రం పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. -
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
హెచ్ఏఎల్ ఓఎఫ్‌ఎస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) షేర్ల విక్రయానికి తొలి రోజు 4.5 రెట్లు అధిక స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ కనిపించింది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్ చేసేందుకు వీలున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్‌ను వినియోగించుకోనుంది. షేరుకీ రూ. 2,450 ధరలో ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం తొలుత 1.75% ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచింది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75% వాటాను సైతం అమ్మివేయనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు లభించనున్నాయి. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7% (రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 2,497 ఎగువన నిలిచింది. -
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..
బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. PM Shri @narendramodi dedicates HAL helicopter factory to the nation in Tumakuru, Karnataka. pic.twitter.com/dqAZMsJXnI — BJP (@BJP4India) February 6, 2023 మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్‌ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్‌గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
ఆర్మీ ఆధునీకరణకు రూ.13,165 కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ. 13,165 కోట్ల కేటాయింపులకు రక్షణశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్ మార్క్–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సంస్థ హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేసినట్టుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.7,523 కోట్లతో అర్జున్ ట్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే హెలికాప్టర్ల కొనుగోలుకి రక్షణ శాఖ భారీగా కేటాయింపులు జరిపింది. డబుల్ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తమ్మీద భారత్ ఆర్మీ ఆధునీకరణ కోసం రూ.13,165 కోట్లు కేటాయింపులు జరిపితే, అందులో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని ఆ ప్రకటన వివరించింది. -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
వచ్చే ఏడాదిలో తేజస్ మార్క్–2
న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ వెల్లడించారు. తేజస్ మార్క్–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటాయని వివరించారు. తేజస్ మార్క్–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్ ట్రయల్స్ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్ జెట్ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ మార్క్–1ఏ రకం 73 జెట్ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు. వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్–2 జెట్ల తయారీ 2025 మొదలై 6 నుంచి 8 ఏళ్ల నడుస్తుందన్నారు. దీంతోపాటు, 5 బిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యే 5వ తరం మీడియం ఫైటర్ జెట్ విమానం తయారీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీని నమూనా 2026 వరకు సిద్ధమవుతుందనీ, ఉత్పత్తి 2030 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెచ్ఏఎల్, డీఆర్డీవోతోపాటు మరో రెండు ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయని మాధవన్ తెలిపారు. ఇందులో రూ.2,500 కోట్ల పెట్టుబడి ప్రైవేట్ సంస్థలది కాగా, మిగతాది తాము భరిస్తామన్నారు. చైనా జేఎఫ్–17 యుద్ధ విమానం కంటే తేజస్ మార్క్–1ఏ జెట్ ఎంతో మెరుగైందని ఆయన వివరించారు. ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతోపాటు సాంకేతికత పరంగా కూడా చైనా జెట్ కంటే మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. -
సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై
ముంబై: భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్‌కు(ఐఎస్ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్ శిర్సాత్(41)నాసిక్‌లోని హెచ్ఏఎల్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడ్డాడు. (చదవండి: రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు) ఈ నేపథ్యంలో ఐఎస్ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నాసిక్ యూనిట్ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. యుద్ధ విమానాల రహస్య సమాచారాలను పాకిస్తాన్‌కు దీపక్ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి పదిరోజుల ఏటీఎస్ కస్టడీకి అనుమతించింది. -
గాడ్ఫ్రే ఫిలిప్స్ భళా- హెచ్ఏఎల్ బోర్లా
సానుకూల ప్రపంచ సంకేతాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలలో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన టొబాకొ ప్రొడక్టుల దిగ్గజం గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయానికి తాజాగా ఫ్లోర్ ధరను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ నష్టాలతో కళ తప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా దేశీయంగా మాల్బోరో బ్రాండ్ సిగరెట్ల తయారీ, విక్రయాలకు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోనున్నట్లు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న మార్కెట్లలో సొంత బ్రాండ్లను పెంచుకునేందుకు చూస్తున్నట్లు తెలియజేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 1092ను అధిగమించింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీలో 10 శాతం వాటాను ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అధిక స్పందన లభిస్తే అదనంగా 5 శాతం వాటాను సైతం అమ్మివేయనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 1,001కాగా.. ఇది బుధవారం ముగింపు ధర రూ. 1178తో పోలిస్తే 15 శాతం తక్కువ. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 89.97 శాతం వాటా ఉంది. వాటా విక్రయం ద్వారా రూ. 5020 కోట్లవరకూ సమీకరించనుంది. ఫ్లోర్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 5 డిస్కౌంట్ లభించనుంది. ఈ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 14 శాతం పడిపోయి రూ. 1014 వద్ద ట్రేడవుతోంది. -
ఇండిగో- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ .. హైజంప్
ఏటీఆర్ విభాగంలోని 12 ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకివ్వడం, విక్రయించడం వంటి ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కౌంటర్ దూకుడు చూపుతోంది. మరోపక్క దేశీయంగా తయారు చేసిన రూ. 8,722 కోట్ల విలువైన పరికరాల కొనుగోలుకి రక్షణ శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడికావడంతో పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇంటర్‌గ్లోబ్ ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలందించే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 13 ఏటీఆర్ విమానాలను లీజుకివ్వడం, విక్రయించడం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే ఎయిర్‌గో క్యాపిటల్, డీఏఈ తదితర లెస్సర్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో 2 కోట్ల డాలర్ల(రూ. 150 కోట్లు) వరకూ సమకూరే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఇటీవలే అనుమతించింది. మరోవైపు విమానాల లీజు చెల్లింపులపై మారటోరియం ద్వారా లబ్ది పొందే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఏఎల్ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ రూ. 8,722 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసేందుకు తాజాగా అనుమతించింది. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి చేసిన ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్ఏఎల్ డిజైన్ చేసి రూపొందించిన 106 బేసిక్ ట్రయినర్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1098 వద్ద ట్రేడివుతోంది. తొలుత ఒక దశలో రూ. 1127 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్ భార్య
సాక్షి, బెంగుళూరు : మిరాజ్-2000 విమాన ప్రమాదంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్ (33) భార్య గరిమా అబ్రోల్ భారత వైమానిక దళంలో చేరనున్నారు. ఈమేరకు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్విటర్లో పేర్కొన్నారు. గరిమాను అసాధాణ స్త్రీగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో వచ్చే ఏడాది జనవరికల్లా ఆమె చేరనున్నారని తెలిపారు. ‘దేవుడు మహిళలందరినీ ఒకేలా కాకుండా.. కొందరిని సాయుధ జవాన్ల భార్యలుగా సృష్టిస్తాడు’ అని అన్నారు. దాంతోపాటు సమీర్, గరిమా కలిసున్నప్పటి ఫొటో, ఆమె శిక్షణలో ఉన్న ఫొటో ట్వీట్ చేశారు. మిరేజ్–2000 రకం శిక్షణ యుద్ధ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయంలో ఫిబ్రవరి 1న జరిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగి (31) ఈ ప్రమాదంలో అమరులయ్యారు. (చదవండి : శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల మృతి) Mrs Garima Abrol, wife of Sqn ldr Samir Abrol who martyred in Mirage2000 fighter plane crash while test flying it at HAL Airport. To join Air Force Academy. Woman of exceptional substance and will join @IAF_MCC in Jan 2020. Not all woman are made equal some are Armed forces Wives pic.twitter.com/gY7G8pV7f3 — Aviator Anil Chopra (@Chopsyturvey) July 14, 2019 -
పార్లమెంటుకు అబద్ధం చెప్పారు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు నిధుల కొరత ఏర్పడిందన్న అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసింది. హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు సాక్ష్యాలు చూపలేకపోతే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లుగా తానెప్పుడూ చెప్పలేదని నిర్మల స్పష్టం చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ యద్ధ విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఇంజిన్లు తదితరాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందంటూ శనివారం ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వం నుంచి తమకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టులో భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వరంగ, అనుభవం ఉన్న హెచ్ఏఎల్ను కాదనీ, కొత్తదైన ప్రైవేటు సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంపై ఇప్పటికే కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అంబానీకి ప్రయోజ నం చేకూర్చేందుకే ప్రధాని మోదీ రిలయన్స్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంటు ముందు దస్త్రాలు ఉంచండి హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన దానికి సంబంధించిన దస్త్రాలను సోమవారం నిర్మల పార్లమెంటుకు సమర్పించాలనీ, లేని పక్షంలో ఆమె రాజీనామా చేయాలని రాహుల్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘ఒక్క అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరెన్నో అబద్ధాలు చెబుతూ ఉండాలి. మోదీ రఫేల్ ‘అబద్ధం’ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకే అబద్ధం చెప్పారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్‌కు రఫేల్ ప్రాజెక్టు ఇచ్చినందుకు కాంగ్రెస్ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. శనివారం కూడా మోదీ తన సూటు–బూటు స్నేహితుడి (అనిల్ అంబానీ)కి సాయం చేసేందుకు హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎల్ ఏమంటోంది.. హెచ్ఏఎల్ ఈ అంశంపై స్పందిస్తూ.. 83 తేలికపాటి యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ప్రాజెక్టులపై కీలక దశల్లో ఉన్నాయనీ, త్వరలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి వరకు ఖర్చుల కోసం రూ. 962 కోట్లను ప్రస్తుతం అప్పుగా తీసుకున్నామంది. పూర్తిగా చదివి మాట్లాడాలి: నిర్మల వార్తా కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడాలని నిర్మల హితవు చెప్పారు. ఆ కథనంలోనే ఉన్న వివరాలను ఆమె ఉటంకిస్తూ ‘ఈ ఒప్పందాలు పూర్తయినట్లుగా నిర్మల పార్లమెంటుకు చెప్పలేదు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని మాత్రమే ఆమె వెల్లడించినట్లు లోక్‌సభ రికార్డులు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్మల కార్యాలయం ఓ ట్వీట్ చేస్తూ ‘రాహుల్ గాంధీ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తారు. అబద్ధం చెబుతున్నది మీరే రాహుల్. 2014–18 మధ్య హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. 26,570.8 కోట్ల ఒప్పందాలు జరిగాయి. మరో రూ. 73 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మీరు దేశ ప్రజలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించింది. -
రఫేల్.. హెచ్ఏఎల్ హక్కు
సాక్షి, బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మెట్టుకు తీసుకెళ్లారు. దేశానికి వ్యూహాత్మక సంపద అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కంపెనీని ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. రఫేల్ తయారీ ఒప్పందంలో అనిల్ అంబానీ కంపెనీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదని, ఆ హక్కులు హెచ్‌ఏఎల్‌కే చెందుతాయని అన్నారు. రఫేల్ ఒప్పందంలో చోటుచేసుకున్న అవినీతిపై వీధివీధినా పోరాటం చేస్తామని చెప్పారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాహుల్.. ఆ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులతో ముచ్చటించారు. రఫేల్ విమానాల్ని తయారుచేసేందుకు హెచ్ఏఎల్కు తగిన అనుభవం లేదనడం హాస్యాస్పదమన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రక్షణ మంత్రిని హుటాహుటిన ఫ్రాన్స్‌కు పంపారన్నారు. రూ. 30 వేల కోట్ల అవినీతి.. ‘హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సాధారణ కంపెనీ కాదు. అది ఏరోనాటిక్స్ రంగంలో భారత్‌కు వ్యూహాత్మక సంపద. హెచ్‌ఏఎల్‌కే రఫేల్ తయారీ హక్కులు దక్కుతాయి. మీ ప్రయోజనాలను సమాధిచేస్తూ వేరొకరు భవిష్యత్తు నిర్మించుకుంటామంటే ఊరుకోం. 78 ఏళ్ల క్రితం స్థాపించిన కంపెనీకి రఫేల్ విమానాల్ని తయారుచేసే సత్తా లేదనడం హాస్యాస్పదం. హెచ్ఏఎల్ను మరింత పటిష్టపరచడానికి ఏం చేయాలో ఆలోచించండి. మేము అధికారంలోకి వచ్చాక ఆ దిశగా దూకుడుగా సాగుతాం ’ అని రాహుల్ అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫేల్ అవినీతిపై ఉద్యమాన్ని వీధుల్లోకి తీసుకెళ్తామని అన్నారు. హెచ్ఏఎల్కు మద్దతుగా నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ‘ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా చెబుతున్నా. రూ.30 వేల కోట్లు చేతులుమారాయి. అనిల్ అంబానీ కంపెనీకి చేకూర్చిన లాభంతో హెచ్ఏఎల్ ఉద్యోగులు నష్టపోయారు. దేశానికి సేవచేస్తూ తమ జీవితాల్ని అంకితంచేసిన వారిని ప్రభుత్వం అవమానించింది. వారికి ప్రభుత్వం క్షమాపణ చెప్పదు. కానీ ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా’ అని అన్నారు. అనిల్ సంస్థపై విమర్శలు గుప్పిస్తూ..‘హెచ్ఏఎల్కు అనుభవం లేదన్న రక్షణమంత్రి ఇంత వరకూ ఒక్క విమానాన్నీ తయారుచేయని అనిల్ కంపెనీ అనుభవం గురించి మాట్లాడలేదు. హెచ్ఏఎల్కు ఒక్క రూపాయి రుణం లేదు. కానీ అనిల్ అంబానీ వేర్వేరు బ్యాంకులకు రూ.45 వేల కోట్లు రుణపడి ఉన్నారు. హెచ్ఏఎల్ 78 ఏళ్లుగా పనిచేస్తుంటే, ఆయన కంపెనీ 12 రోజుల నుంచే పనిచేస్తోంది’ అని అన్నారు. హెచ్ఏఎల్ విచారం.. తమ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంపై హెచ్ఏఎల్ విచారం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే అలాంటి పరిణామాలు జాతీయ భద్రతకు, సంస్థకు చేటుచేస్తాయని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభిస్తోందని, 2014–18కాలంలో రూ.27,340 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రకటించింది. కేంద్రం అవమానించింది: హెచ్ఏఎల్ ఉద్యోగులు సైకిల్ నుంచి యుద్ధ విమానాల వరకు తయారీ చేశామని, అలాంటి సంస్థకు రఫేల్ తయారీ ఒప్పందం అప్పగించకపోవడం తమని అవమానించడమేనని అన్నారు. తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించిన జెట్ విమానం కూడా తాము తయారు చేసిందేనని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమే తమకు తగిన అనుభవం లేదనడం సరికాదన్నారు. -
ఈ నెల 16 నుంచి హెచ్ఏఎల్ ఐపీఓ
ముంబై: హెలికాప్టర్లు, తేలిక రకం యుద్ధ విమానాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 16(ఈ శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ మహారత్న కంపెనీలో ప్రభుత్వం 10.20 శాతం వరకూ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. ఈ ఐపీఓ ధర శ్రేణిని రూ.1,215–1,240గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.4,230 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఆఫర్ ధరలో రూ. 25 తగ్గింపునిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో రూ.10 ముఖ విలువ గల 3.41 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటిల్లో 6.6 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించారు. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీలో వాటా విక్రయం జరుగుతోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. రూ.68,000 కోట్ల ఆర్డర్ బుక్... ఈ కంపెనీ అమ్మకాల్లో 91 శాతానికి పైగా రక్షణ రంగం నుంచే వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.18,600 కోట్ల ఆదాయంపై రూ.3,580 కోట్ల నికర లాభం సాధించింది. 1940లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం 27 రకాల హెలికాప్టర్లను, తేలిక రకం యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. వైమానిక రంగంలో ప్రపంచంలోనే 39వ అతి పెద్ద కంపెనీ ఇది. కాగా తమ ఆర్డర్ బుక్ రూ.68,000 కోట్లుగా ఉందని, రానున్న మూడేళ్లలో ఈ ఆర్డర్లను తీర్చాలని కంపెనీ తాత్కాలిక చైర్మన్ వీఎమ్ చమోలా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.5,300 కోట్ల ఆదాయం సాధించామని పేర్కొన్నారు. -
ఉద్యోగాలు
ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1 అర్హత: జెనెటిక్స్/ బయోటెక్నాలజీలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్: 1 అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19 వెబ్సైట్: www.osmania.ac.in రైల్‌టెల్ కార్పొరేషన్ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 8 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు, ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి. వయసు: 21 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: http://railtelindia.com/ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ జనరల్ మేనేజర్: 8 వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 45 ఏళ్లకు మించకూడదు. చీఫ్ మేనేజర్: 13 సీనియర్ మేనేజర్ (డిజైన్): 28 వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 48 ఏళ్లకు మించరాదు. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబర్ 3 వెబ్సైట్: www.halindia.com -
విమాన ఇంధన పన్నులు సమీక్షించండి
రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాం కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడి ఏరోనాటికల్ సొసైటీ సదస్సు ప్రారంభం హైదరాబాద్‌ను అగ్రగామిగా చేస్తాం: కేటీఆర్ హైదరాబాద్: విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపట్టామని కేంద్ర పౌర, విమానయాన శాఖల మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇందులో భాగంగా విమాన ఇంధనంపై విధిస్తున్న పన్నులను సమీక్షించాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. విమాన ఇంధనంపై సేల్స్‌ట్యాక్స్ తగ్గించుకోవాలని తమ మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లు మాత్రమే స్పం దించాయని తెలిపారు. ఏపీలోని కుప్పం, కడపలలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించారు. అంతకుముందు అశోక్‌గజపతి రాజు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభా గం ‘స్వదేశీ పరిజ్ఞానంతో పౌర, మిలటరీ విమానాల అభివృద్ధి’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్విం చదగ్గ నగరాల్లో హైదరాబాద్ ఒకటని, వైమానిక రంగంలోనూ ఈ నగరానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా’ను ఆవిష్కరణకు ప్రయత్నాలు చేస్తూండగా, తెలంగాణ అంతకం టే వేగంగా గ్రామాలన్నింటినీ టెక్నాలజీ ఆధారంగా అనుసంధానించేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.తారక రామారావు ఈ దిశగా చొరవ చూపడం హర్షణీయమని ప్రశంసించారు. మరో రెండు ఏరోపార్క్‌లు: కేటీఆర్ ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే దేశంలోనే తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ నగరం వైమానిక రంగంలోనే అగ్రస్థానానికి చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుం దని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న జీఎంఆర్ ఏరోపార్క్‌కు అదనంగా ఇలాంటివాటిని మరో రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినీడు ప్రాంతంలో ఒక ఏరోపార్క్ కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించామని వివరించా రు. నగరానికి ఉత్తరంగా మరో వెయ్యి ఎకరాల్లో ఇంకో ఏరోపార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండి యా ఛైర్మన్ డాక్టర్ వి.కె.సారస్వత్, అధ్యక్షులు, జీఎంఆర్ గ్రూపు సంస్థల ఛైర్మన్ జీ.ఎం.రావు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.కె.త్యాగి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మోడీ జపాన్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ నవ్వుకోవడం కనిపించింది. ప్రధాని పర్యటన దిగ్విజయంగా ముగియడంపై హర్షం వెలిబుచ్చడానికి సుష్మ స్వయంగా ఆయనను స్వాగతించడానికి వెళ్లారని సమాచారం. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధానిని ఒక మంత్రి స్వాగతించడం చాలా ఏళ్లుగా జరగడం లేదు. కాగా, బుధవారం ఉదయం మోడీకి ఆయన బసచేసిన టోక్యోలోని ఇంపీరియల్ హోటల్ సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. హోటల్ చెఫ్‌లతో మోడీ కరచాలనం చేశారు. జపాన్ తనపై ఎంతో ఆదరం చూపి, అద్భుతమైన ఆతిథ్యమిచ్చిందని మోడీ ఆ దేశ ప్రజలకు ఢిల్లీ వచ్చాక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు జపాన్ భాషలోనూ ట్వీట్ చేశారు. జపాన్‌తో అనుబంధాలకు సంబంధించి తన పర్యటన భారత్‌లో సానుకూలత, ఆశావాదాన్ని సృష్టించిందని సుష్మ అన్నారని వెల్లడించారు. మోడీ పర్యటనలో జపాన్ మన దేశానికి మౌలిక వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్ల సాయం ప్రకటించడం, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో ఐదు ఒప్పందాలను కుదుర్చుకోవడం తెలిసిందే. 1998 నాటి భారత్ అణుపరీక్షల నేపథ్యంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌పై విధించిన నిషేధాన్ని జపాన్ ఎత్తేసింది. -
ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) హైదరాబాద్, కాంట్రాక్ట్ పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు:కన్సల్టెంట్(సోషల్ ఆడిట్) అర్హతలు: సోషల్ సెన్సైస్‌లో పీజీ లేదా సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి. వయసు: 60 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 www.nird.org.in బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. www.becil.com డిప్యూటీ జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15 అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు 1.డెరైక్టర్ 2.డిప్యూటీ డెరైక్టర్ జనరల్ 3.అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ 4.జోనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్ 5.జాయింట్ డెరైక్టర్ 6.ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ 7.హెడ్ ఆఫ్ డివిజన్/ఈక్వలెంట్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 18 వెబ్సైట్: http://asrb.org.in/ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు 1.ఇంజనీర్(సివిల్-గ్రేడ్ 2) 2.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: www.hal-india.com