ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్‌ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్‌స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్‌ఎస్ విండో ఓపెన్ కానుంది.
కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్‌లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్‌ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్‌ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment