Shares of Sail
-
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు రూ.53,558 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వారంలో రూ.15,379 కోట్లు గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్ చేశారు. గత ఏడాది జూన్‌లో ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది. షేర్ల బైబ్యాక్‌ల ద్వారా జోరుగా నిధులు... షేర్ల బైబ్యాక్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్ నుంచి రూ.992 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి రూ.137 కోట్లు, ఎన్ఎల్సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్ నుంచి రూ.260 కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇక ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కోల్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్‌యూ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్‌యూల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్ సక్సెస్
ప్రభుత్వ ఖజానాకు రూ. 1,715 కోట్లు న్యూఢిల్లీ: స్టీల్ రంగ దిగ్గజం సెయిల్ వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి రెట్టింపు స్పందన లభించింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం 20.65 కోట్ల షేర్లను(5% వాటా) అమ్మకానికి పెట్టగా, మొత్తం 42.93 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖల య్యాయి. ఆఫర్‌కు నిర్ణయించిన రూ. 83 ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 1,715 కోట్లు లభిం చనున్నాయి. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 75%కు పరిమితం కానుంది. తద్వారా సెబీ లిస్టింగ్ నిబంధనలు అమలు కానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో నిర్వహించిన ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ ధరకు సెయిల్ షేర్లు జారీకానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, ఈ విభాగం నుంచి ఇష్యూకి 2.66 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇక సాధారణ విభాగంలో 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖల య్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు వీలుగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ తదితరాలలో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనుంది. కాగా, బీఎస్ఈలో సెయిల్ షేరు 3 శాతం క్షీణించి రూ.83 వద్ద ముగిసింది.