
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్‌ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు.
ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment