ఈ నెల 16 నుంచి హెచ్‌ఏఎల్‌ ఐపీఓ | HAL IPO from 16th of this month | Sakshi
Sakshi News home page

ఈ నెల 16 నుంచి హెచ్‌ఏఎల్‌ ఐపీఓ

Published Wed, Mar 14 2018 12:41 AM | Last Updated on Wed, Mar 14 2018 12:41 AM

HAL IPO from 16th of this month - Sakshi

ముంబై: హెలికాప్టర్లు, తేలిక రకం యుద్ధ విమానాలు  తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 16(ఈ శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ మహారత్న కంపెనీలో ప్రభుత్వం 10.20 శాతం వరకూ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది.

ఈ ఐపీఓ ధర శ్రేణిని రూ.1,215–1,240గా కంపెనీ నిర్ణయించింది.  ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.4,230 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఆఫర్‌ ధరలో రూ. 25 తగ్గింపునిస్తోంది.  

ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో రూ.10 ముఖ విలువ గల 3.41 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటిల్లో 6.6 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించారు. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీలో వాటా విక్రయం జరుగుతోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎస్‌బీఐ క్యాప్స్, యాక్సిస్‌ క్యాపిటల్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

రూ.68,000 కోట్ల ఆర్డర్‌ బుక్‌...
ఈ కంపెనీ అమ్మకాల్లో  91 శాతానికి పైగా రక్షణ రంగం నుంచే వస్తున్నాయి.  గత ఆర్థిక సంవత్సరంలో ఈ  కంపెనీ రూ.18,600 కోట్ల ఆదాయంపై రూ.3,580 కోట్ల నికర లాభం సాధించింది. 1940లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం 27 రకాల  హెలికాప్టర్లను, తేలిక రకం యుద్ధ విమానాలను తయారు చేస్తోంది.

వైమానిక రంగంలో ప్రపంచంలోనే 39వ అతి పెద్ద కంపెనీ ఇది. కాగా తమ ఆర్డర్‌ బుక్‌ రూ.68,000 కోట్లుగా ఉందని, రానున్న మూడేళ్లలో ఈ ఆర్డర్లను తీర్చాలని కంపెనీ తాత్కాలిక చైర్మన్‌ వీఎమ్‌ చమోలా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.5,300 కోట్ల ఆదాయం సాధించామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement