బెంగళూరులో హెచ్‌ఏఎల్ ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మెట్టుకు తీసుకెళ్లారు. దేశానికి వ్యూహాత్మక సంపద అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) కంపెనీని ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. రఫేల్ తయారీ ఒప్పందంలో అనిల్ అంబానీ కంపెనీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదని, ఆ హక్కులు హెచ్‌ఏఎల్‌కే చెందుతాయని అన్నారు. రఫేల్ ఒప్పందంలో చోటుచేసుకున్న అవినీతిపై వీధివీధినా పోరాటం చేస్తామని చెప్పారు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ప్రధాన కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాహుల్.. ఆ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులతో ముచ్చటించారు. రఫేల్ విమానాల్ని తయారుచేసేందుకు హెచ్‌ఏఎల్‌కు తగిన అనుభవం లేదనడం హాస్యాస్పదమన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రక్షణ మంత్రిని హుటాహుటిన ఫ్రాన్స్‌కు పంపారన్నారు.
రూ. 30 వేల కోట్ల అవినీతి..
‘హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సాధారణ కంపెనీ కాదు. అది ఏరోనాటిక్స్ రంగంలో భారత్‌కు వ్యూహాత్మక సంపద. హెచ్‌ఏఎల్‌కే రఫేల్ తయారీ హక్కులు దక్కుతాయి. మీ ప్రయోజనాలను సమాధిచేస్తూ వేరొకరు భవిష్యత్తు నిర్మించుకుంటామంటే ఊరుకోం. 78 ఏళ్ల క్రితం స్థాపించిన కంపెనీకి రఫేల్ విమానాల్ని తయారుచేసే సత్తా లేదనడం హాస్యాస్పదం. హెచ్‌ఏఎల్‌ను మరింత పటిష్టపరచడానికి ఏం చేయాలో ఆలోచించండి. మేము అధికారంలోకి వచ్చాక ఆ దిశగా దూకుడుగా సాగుతాం ’ అని రాహుల్ అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫేల్ అవినీతిపై ఉద్యమాన్ని వీధుల్లోకి తీసుకెళ్తామని అన్నారు. హెచ్‌ఏఎల్‌కు మద్దతుగా నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
‘ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా చెబుతున్నా. రూ.30 వేల కోట్లు చేతులుమారాయి. అనిల్ అంబానీ కంపెనీకి చేకూర్చిన లాభంతో హెచ్‌ఏఎల్ ఉద్యోగులు నష్టపోయారు. దేశానికి సేవచేస్తూ తమ జీవితాల్ని అంకితంచేసిన వారిని ప్రభుత్వం అవమానించింది. వారికి ప్రభుత్వం క్షమాపణ చెప్పదు. కానీ ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా’ అని అన్నారు. అనిల్ సంస్థపై విమర్శలు గుప్పిస్తూ..‘హెచ్‌ఏఎల్‌కు అనుభవం లేదన్న రక్షణమంత్రి ఇంత వరకూ ఒక్క విమానాన్నీ తయారుచేయని అనిల్ కంపెనీ అనుభవం గురించి మాట్లాడలేదు. హెచ్‌ఏఎల్‌కు ఒక్క రూపాయి రుణం లేదు. కానీ అనిల్ అంబానీ వేర్వేరు బ్యాంకులకు రూ.45 వేల కోట్లు రుణపడి ఉన్నారు. హెచ్‌ఏఎల్ 78 ఏళ్లుగా పనిచేస్తుంటే, ఆయన కంపెనీ 12 రోజుల నుంచే పనిచేస్తోంది’ అని అన్నారు.
హెచ్‌ఏఎల్ విచారం..
తమ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంపై హెచ్‌ఏఎల్ విచారం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే అలాంటి పరిణామాలు జాతీయ భద్రతకు, సంస్థకు చేటుచేస్తాయని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభిస్తోందని, 2014–18కాలంలో రూ.27,340 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రకటించింది.
కేంద్రం అవమానించింది: హెచ్‌ఏఎల్ ఉద్యోగులు
సైకిల్ నుంచి యుద్ధ విమానాల వరకు తయారీ చేశామని, అలాంటి సంస్థకు రఫేల్ తయారీ ఒప్పందం అప్పగించకపోవడం తమని అవమానించడమేనని అన్నారు. తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించిన జెట్ విమానం కూడా తాము తయారు చేసిందేనని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమే తమకు తగిన అనుభవం లేదనడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment