ప్రయాగ్‌రాజ్‌లో గంగా నదికి హారతిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
రాయ్‌బరేలీ / ప్రయాగ్‌రాజ్: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చీట్ లభించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించినందున రఫేల్ కేసును మళ్లీ విచారించాలని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశ భద్రతాబలగాలు పటిష్టం కావడం ఇష్టంలేని శక్తులతో ఆ పార్టీ జతకడుతోందని ఆరోపించారు.
‘కొందరు వ్యక్తులు కేవలం అబద్ధాలనే నమ్ముతారు.. దాన్నే ఇతరులకు వ్యాప్తి చేస్తారు’ అంటూ రామచరితమానస్‌ను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం రాయ్‌బరేలీతో పాటు ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఖత్రోచీ, మిషెల్ మామయ్యలు లేరు..
‘సుప్రీంకోర్టును అబద్ధాల కోరుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వీళ్ల దృష్టిలో రక్షణశాఖ, రక్షణమంత్రి, ఐఏఎఫ్ అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఇలా అందరూ అబద్ధాలు చెప్పేవారే. తాజాగా వీళ్లకు సుప్రీంకోర్టు అబద్ధాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు భారత భద్రతాబలగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం కొన్ని శక్తులు దేశాన్ని ఎలాగైనా బలహీనపర్చేందుకు కంకణం కట్టుకున్నాయి.
కొందరు నేతల వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు లభించడం వెనుక అర్థం ఏమిటి?’ అని మోదీ ప్రశ్నించారు. బోఫోర్స్, అగస్టా కుంభకోణాలను ప్రస్తావిస్తూ..‘కాంగ్రెస్ నేతలు అదేపనిగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల్లో ఖత్రోచీ(బోఫోర్స్ మధ్యవర్తి), మిషెల్(అగస్టా మధ్యవర్తి) వంటి మామయ్యలు లేరనా? ఆ మిషెల్ మామయ్యను కూడా భారత్‌కు పట్టుకొచ్చాం’ అని అన్నారు.
సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరించారు..
‘ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఓ పార్టీ(కాంగ్రెస్) తాము చట్టం, న్యాయానికి అతీతులమనీ, దేశం, ప్రజల కంటే గొప్పవాళ్లమని భావిస్తోంది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని ప్రతీ రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను వాళ్లు నాశనం చేశా రు. ఇందులోభాగంగా భారత న్యాయవ్యవస్థను సైతం బలహీనపర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి’ అని మోదీ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు..
‘జవాన్లు, రైతుల్లో ఎవ్వరినీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆరునెలైనా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీచేస్తున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment