bofors scam
-
సుప్రీంకోర్టుపైనే నిందలు వేస్తున్నారు!
రాయ్‌బరేలీ / ప్రయాగ్‌రాజ్: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చీట్ లభించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించినందున రఫేల్ కేసును మళ్లీ విచారించాలని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశ భద్రతాబలగాలు పటిష్టం కావడం ఇష్టంలేని శక్తులతో ఆ పార్టీ జతకడుతోందని ఆరోపించారు. ‘కొందరు వ్యక్తులు కేవలం అబద్ధాలనే నమ్ముతారు.. దాన్నే ఇతరులకు వ్యాప్తి చేస్తారు’ అంటూ రామచరితమానస్‌ను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం రాయ్‌బరేలీతో పాటు ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఖత్రోచీ, మిషెల్ మామయ్యలు లేరు.. ‘సుప్రీంకోర్టును అబద్ధాల కోరుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వీళ్ల దృష్టిలో రక్షణశాఖ, రక్షణమంత్రి, ఐఏఎఫ్ అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఇలా అందరూ అబద్ధాలు చెప్పేవారే. తాజాగా వీళ్లకు సుప్రీంకోర్టు అబద్ధాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు భారత భద్రతాబలగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం కొన్ని శక్తులు దేశాన్ని ఎలాగైనా బలహీనపర్చేందుకు కంకణం కట్టుకున్నాయి. కొందరు నేతల వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు లభించడం వెనుక అర్థం ఏమిటి?’ అని మోదీ ప్రశ్నించారు. బోఫోర్స్, అగస్టా కుంభకోణాలను ప్రస్తావిస్తూ..‘కాంగ్రెస్ నేతలు అదేపనిగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల్లో ఖత్రోచీ(బోఫోర్స్ మధ్యవర్తి), మిషెల్(అగస్టా మధ్యవర్తి) వంటి మామయ్యలు లేరనా? ఆ మిషెల్ మామయ్యను కూడా భారత్‌కు పట్టుకొచ్చాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరించారు.. ‘ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఓ పార్టీ(కాంగ్రెస్) తాము చట్టం, న్యాయానికి అతీతులమనీ, దేశం, ప్రజల కంటే గొప్పవాళ్లమని భావిస్తోంది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని ప్రతీ రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను వాళ్లు నాశనం చేశా రు. ఇందులోభాగంగా భారత న్యాయవ్యవస్థను సైతం బలహీనపర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి’ అని మోదీ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు.. ‘జవాన్లు, రైతుల్లో ఎవ్వరినీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆరునెలైనా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీచేస్తున్నారు’ అని తెలిపారు. -
రాఫెల్ మరో బోఫోర్స్ కానుందా?
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారానికి అనేక పరిమితులున్నాయి. ఇక్కడ పాలకపక్షానికి వ్యతిరేకంగా పోరు సలుపుతూ, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి నాయకుడు లేరు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. బోఫోర్స్ వ్యవహారంలో మాదిరిగా కుంభకోణం జరిగిందనడానికి కొద్దిపాటి సాక్ష్యాధారాలు కూడా రాఫెల్ వివాదంలో కనపడటం లేదు. దీనిపై వివరణాత్మక కథనాలుగానీ, నినాదం గానీ ఇంకా వినిపించడం లేదు. రాఫెల్ వ్యవహారం నరేంద్రమోదీ పాలిటి బోఫోర్స్‌లా మారిందని ఆయనను తీవ్రంగా విమర్శించేవారు సైతం చెప్పడం లేదు. కానీ, తాము ఆ పనిలో ఉన్నామనీ, కొన్ని నెలల క్రితం వరకూ అజేయుడిగా కనిపించిన ప్రధానిని ఓడించడానికి బ్రహ్మాస్త్రంగా పనిచేసే శక్తి దీనికి ఉందని వారంటున్నారు. అయితే వెల్లడిస్తున్న విషయాల్లో పదునైన అంశాలేవీ లేవు. మొదటిది, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి రాఫెల్ అంటే ఏమిటో తెలియదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 21 శాతం మందికే రాఫెల్ అంటే ఏమిటో తెలుసని ఇటీవలి ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. దీనికి మా జర్నలిస్టులనే నిందించాలి. రెండోది, జనం నమ్మేరీతిలో ప్రతిపక్షాల సందేశాన్ని ఓటర్ల వద్దకు తీసుకెళ్లే వీపీ సింగ్ వంటి నైతిక బలమున్న నేత ఇప్పుడు లేడు. బోఫోర్స్‌తో పాటు ఇంకా అనేక ఇతర కుంభకోణాల నీడలు వెంటాడుతున్న కారణంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీS ఈ పనిచేయడానికి సరిపోరు. ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్‌గాంధీ రాఫెల్ వివా దాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించారు. కేంద్రంలో పాలక కూటమి అవినీతి, ఆశ్రిత పెట్టుబడి దారీ పోకడలు వంటి విషయాలు దీనికి అవి జోడిస్తాయి. అనేక సొంత కంపెనీలు నష్టాలతో నడుస్తున్న అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామికవేత్తకు మోదీ అడ్డగోలుగా మేలు చేయగలిగితే, విజయవంతంగా కంపెనీలు నడిపే బడా వ్యాపారవేత్తలకు ఆయన ఎందుకు సాయం చేయడు? అనే వాదనను అవి ముందుకు తెస్తాయి. ఆరోపణలన్నీ రాఫెల్ చుట్టూనే! గతంలో వ్యాపారులకు మేలు చేస్తున్నారనే సందేశం ఇవ్వడానికి ‘‘సూట్ బూట్ సర్కార్’’ అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్ తన ఆరోపణలకు రాఫెల్ చుట్టూ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడానికి, పార్లమెంటును కుదిపేసే కథనాలు తీసుకు రావడానికి బోఫోర్స్ కుంభకోణం రోజుల్లో మాదిరిగా రామ్‌నాథ్ గోయెంకా నాయకత్వంలో నడిచిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి మీడియా సంస్థ లేదని ప్రతిపక్షాలు బాధపడుతున్నాయి. వాటికున్నదల్లా మచ్చలేని వ్యక్తి గత ప్రతిష్ట ఉన్న ఇద్దరు అరుణ్‌శౌరీ, ప్రశాంత్ భూషణ్ మాత్రమే. ఈ అశ్వమేధ యాగం ముందు నిలపడానికి తగిన అశ్వం రాహుల్ కాదు. అవినీతి విషయమై ఇంకా బీజేపీ లోపల ఏ పెద్ద నాయకుడూ తిరుగుబాటు చేయలేదు. ఒక్కసారి మన రాజకీయ చరిత్ర పరిశీలిద్దాం. 1977లో విధేయుడైన జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీపై, 1988–89లో నమ్మకస్తుడైన వీపీ సింగ్ రాజీవ్‌గాంధీపై చేసిన తిరుగుబాట్లే ఈ రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మార్చేశాయి. తల్లీకొడుకుల ఓటమికి కారణ మయ్యాయి. మరో వీపీ సింగ్‌ను ఆశించడమా! ఇప్పుడు మరో వీపీ సింగ్‌ను ఆశించడం వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఎందుకంటే, వీపీ సింగ్‌కు అవినీతి అంటని గొప్ప నిజాయితీపరుడిగా పేరుండ డమేగాక, ఆయన కేంద్ర కేబినెట్లో కీలకమైన (రక్షణ శాఖ) మంత్రి పదవిని త్యాగం చేశారు. రెండోది, ఆయన నరేంద్రమోదీ లేదా వాజ్‌పేయీ లాగా గొప్ప వక్త కాదు. కాని, 30 ఏళ్ల క్రితమే దేశంలో కేంద్రస్థానమైన హిందీ ప్రాంతాల్లో సంక్లిష్టమైన ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన కుంభ కోణాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా ఆయన విడమరచి చెప్పగలిగారు. అంతటి గొప్ప మాంత్రికుడాయన. కుంభకోణాల వెల్లువలో రాజీవ్ గాంధీ ప్రతిష్ట తగ్గడం మొదలవ్వగానే 1987లో వీపీ సింగ్ మంత్రి పదవికి, పార్లమెంటుకు రాజీనామా చేశారు. అలహాబాద్ ఉప ఎన్నికలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో ముడుపుల ఆరోపణలకు సంబంధించి అప్పుడే అమితాబ్ బచ్చన్ ఈ సీటుకు రాజీనామా చేయడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. వాతావరణం వీపీ సింగ్‌కు అనుకూలంగానే ఉంది. కానీ, ఆయన బోఫోర్స్‌ను ఎన్నికల అంశంగా చేయలేరని ఆయన మిత్రులు, శత్రువులు కూడా నమ్మారు. తమకు సంబంధం లేని క్లిష్టతరమైన విషయంపై పేద గ్రామీణులు ఎలా స్పందించగలరని వారు అనుకున్నారు. సింగ్ చక్కటి పద్ధతిలో ప్రచారం చేసి గెలిచారు. మోటర్‌సైకిల్‌పై వెనుక సీట్లో కూర్చుని మండు వేసవిలో ఆయన ప్రచారం చేశారు. నేడు సామాజిక కార్యకర్త, రాజకీయ నేత యోగేంద్ర యాదవ్ మాదిరిగా మెడ చుట్టూ తువ్వాలు(గమ్చా) చుట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ, ఓ మామూలు ప్రశ్న అడిగే వారు. రాజీవ్‌గాంధీ మీ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు తెలుసా? అనే ప్రశ్న సంధించేవారు. తర్వాత వెంటనే తన కుర్తా జేబు నుంచి అగ్గిపెట్టె తీసి పట్టుకునే వారు. ‘‘చూడండి, ఇది అగ్గిపెట్టె. మీ బీడీ లేదా హుక్కా లేదా మీ పొయ్యికి నిప్పు అంటించడానికి ఆరణాలు (25 పైసలు) పెట్టి అగ్గిపెట్టె కొంటారు. కాని, ఆరణాల్లో నాలుగోవంతు ప్రభుత్వానికి పన్ను రూపంలో పోతుంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం మీకు స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు, కాలవలు నిర్మించడమే గాక, మీ సైన్యానికి తుపాకులు కొనుగోలు చేస్తుంది. ఇది మీ సొమ్ము. దీంట్లో కొంత ఎవరైనా దొంగిలిస్తే–అదీ సైన్యానికి తుపాకులు కొనేటప్పుడు ఆ పని చేస్తే–మీ ఇంట్లో దొంగలు పడినట్టు కాదా?’’ ఇలా వీపీ సింగ్ జనానికి బోఫోర్స్ గురించి వివరించేవారు. వాస్తవానికి కుంభకోణం వివరాలు, అంకెలతో కూడిన వివరాల కన్నా సింగ్ ప్రజలకు దీని గురించి కథలా చెప్పిన విధానమే బాగా పని చేసింది. ‘‘తనకు ముడుపులు ఏమీ చెల్లించలేదంటూ బోఫోర్స్ కంపెనీ తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని రాజీవ్‌గాంధీ చెబుతున్నారు. ఇది ఎలా ఉందంటే, తాను మానసికంగా అంతా బాగానే ఉన్నానంటూ మానసిక రోగుల ఆస్పత్రి తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని, మీకు కూడా ఇలాంటి పత్రం లేకుంటే మీరు మానసికంగా బాగున్నట్టు ఎలా భావించాలని ఓ పిచ్చివాడు చెబుతూ దాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది’’ అని వీపీ సింగ్ తన ప్రసంగాల్లో వివరించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ ఒక్కరే లంచాలు తీసుకున్నారని ప్రజలను నమ్మించడానికి ఇలా మరో కథ చెప్పేవారు. ‘ఓ సర్కస్‌లో ఓ సింహం, ఆబోతు, పిల్లి ఒకే చోట దగ్గర దగ్గరగా ఉండేవి. ఓ రాత్రి ఎవరో ఈ జంతువుల బోనులన్నీ తెరిచారు. మరుసటి ఉదయం గుర్రం, ఆబోతు మృతదేహాలను సర్కస్ యజమాని చూశారు. వాటిని ఎవరు తిన్నారో మీకేమైనా అను మానాలున్నాయా? సింహమా? పిల్లా? బోఫోర్స్‌లో అంత పెద్ద మొత్తంలో సొమ్ము తినేశారంటే, చిన్న పిల్లి వంటి జంతువు తిని ఉంటుందా? సింహం సైజులో ఉండే దొంగ రాజీవ్ మాత్రమే ఆ పనిచేయగలరు’’ అంటూ వీపీ సింగ్ చేసిన వాదనలు జనంలోకి వెళ్లి పోయాయి. అంతే కాదు, చిరునవ్వుతో ఉన్న రాజీవ్ బొమ్మతో కూడిన కాంగ్రెస్ హోర్డింగులను ఆయన చూపిస్తూ విసిరే మాటల తూటాలు కూడా బాగా పనిచేశాయి. ‘‘రాజీవ్ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన మోసంపైనా? మన అమాయకత్వంపైనా? లేదా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచిన సొమ్మును చూసుకునా? నేనైతే మీకు కాలవలు, గొట్టపు బావులు తెస్తానని వాగ్దానం చేయలేను. కానీ, మీ సంపదను దోచుకుంటున్న వారికి అడ్డుకట్ట మాత్రం వేయగలను’’ అంటూ ప్రజలను సింగ్ ఆకట్టుకునేవారు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. ఇప్పటి కాంగ్రెస్‌లో ఇలా విషయం జనానికి వివరించగల నేతలు కరువయ్యారు. నేడు ప్రతిపక్షాలకు వీపీ సింగ్ వంటి నాయకుడు లేడు. అలాగే, రాఫెల్ కూడా బోఫోర్స్ అంతటి శక్తిమంతమైన విషయం కాదు. బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ ఎంతో తేడా బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ మధ్య ఎంతో తేడా ఉంది. బోఫోర్స్ శతఘ్ని నాణ్యతపై భిన్నాభిప్రాయాలున్నాయిగాని, రాఫెల్ అత్యుత్తమ యుద్ధవిమానమని అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ దీన్ని ఎంపిక చేయడమే దీనికి కారణం. ముందుగా అనుకున్నట్టు 126కు బదులు మోదీ సర్కారు 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయడంపైనే ఆరోపణ. ‘బోఫోర్స్ మొదటి శతఘ్నిని భారత సైనికులు పేల్చినప్పుడు అది వెనక్కి పేలడంతో మనవాళ్లే పలువురు మరణించారు’ అని వీపీ సింగ్ అప్పట్లో చెప్పగలిగారు. ఇప్పుడు రాఫెల్ విమానం గురించి ఇలా ఎవరూ మాట్లాడలేరు. జర్నలిస్ట్ టీఎన్ నైనన్ చెప్పినట్టు రెండో విషయం ఏమంటే, బోఫోర్స్ కుంభకోణంలో మాదిరిగా ఆరోపణలకు అనుకూల మైన సాక్ష్యాధారాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. బోఫోర్స్ ముడుపులు లంచాలు భారతీ యులకు సంబంధమున్న మూడు స్విస్ బ్యాంక్ అకౌంట్లకు జమ అయ్యాయని స్వీడన్ జాతీయ ఆడిటర్ దర్యాప్తులో తేలింది. కానీ, రాఫెల్ విమానాల తయారీలో భారతీయ పార్టనర్ కంపెనీని భారత ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన ప్రకటన స్వీడిష్ ఆడిటర్ చెప్పిన విషయానికి ఏమాత్రం సాటిరాదు. రక్షణ ఆయుధాల ఉత్పత్తిలో అనుభవం లేని కార్పొరేట్ సంస్థకు ఎలా రాఫెల్ విమాన తయారీలో భాగస్వామ్యం కల్పిస్తారని మాత్రమే అందరూ అడుగు తున్నారు. తమకు నచ్చినవారిపై పక్షపాతం చూపించే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం చెడ్డదేగాని నరేంద్ర మోదీ ఓటర్లను ఆయనకు వ్యతిరేకంగా తిప్పడానికి ఈ ఒక్క ప్రశ్న మాత్రమే సరిపోతుందా? ఇదే రాఫెల్ వ్యతిరేక ప్రచారానికి ఉన్న పరిమితి. గతంలో వీపీ సింగ్ బోఫోర్స్ వ్యవహారంపై అద్భుత రీతిలో పోరాడారు. ‘‘వీపీ సింగ్కా ఏక్ సవాల్, పైసా ఖాయా కౌన్ దలాల్? (సొమ్ము ఎవరో తినేశారు. ఆ బ్రోకర్ ఎవరన్నదే వీపీ సింగ్ ప్రశ్న)’’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూటిగా దేశ ప్రజల్లో నాటు కుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) భారీ షాక్ ఇచ్చింది. యూపీఏ-2 ప్రభుత్వం(2009లో) నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి గస్తీ విమానాలను కోనుగోలు చేసిందని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. పొసేడియన్ పీ-8ఐ సముద్ర గస్తీ విమానాలకు ఆహ్వానించిన టెండర్లను ఖరారు చేయడంలో యూపీఏ ప్రభుత్వం, రక్షణ శాఖ పొరపాటు చేశాయని కాగ్ తెలిపింది. 8 నిఘా విమానాల కోసం బోయింగ్ సంస్థ రూ.8,700 కోట్లు బిడ్డింగ్ వేయగా, యూరప్ కు చెందిన ఈఏడీఎస్ సంస్థ కేవలం రూ.7,776 కోట్లకే ఎనిమిది ఏ-139 విమానాలను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిందని వెల్లడించింది. రాబోయే 20 ఏళ్లకు ఈ విమానాలకు అందించాల్సిన సర్వీసింగ్ ఖర్చుల్ని ఈఏడీఎస్ బిడ్డింగ్ కు కలిపేసిన రక్షణ శాఖ.. బోయింగ్ కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆక్షేపించింది. తద్వారా ఈఏడీఎస్ బిడ్డింగ్ ఖర్చు రూ.8,712 కోట్లకు చేరుకుంది. దీంతో బోయింగ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుందని వెల్లడించింది. బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన పీ-8 నిఘా విమానాలకు మూడేళ్ల పాటు సర్వీసింగ్ కు ప్రత్యేకంగా మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పేర్కొంది. సముద్రంపై నిఘాతో పాటు శత్రు దేశాల సబ్ మెరైన్లను వేటాడేందుకు మరో నాలుగు లాంగ్ రేంజ్ పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2013-15లో భారత నేవీ బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకుందని కాగ్ వివరించింది. -
సుష్మ వ్యాఖ్యలు అర్థరహితం
రాజీవ్‌కు 30 ఏళ్ల కిందే న్యాయవ్యవస్థ క్లీన్చిట్: రాహుల్ న్యూఢిల్లీ: బోఫోర్స్ స్కాం, భోపాల్ గ్యాస్ కేసుల్లో తన తండ్రి రాజీవ్ గాంధీకి భారత న్యాయవ్యవస్థ 30 ఏళ్ల క్రితమే క్లీన్చిట్ ఇచ్చిందని... బీజేపీ మాత్రం ఆయనపై బురద చల్లడం మానడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి నరేంద్రమోదీ నుంచి దేశాన్ని రక్షించేం దుకు తానున్నానని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ ఎంపీలతో కలసి చేపట్టిన ఆందోళనలో రాహుల్ మాట్లాడారు. ‘‘నల్లధనానికి, రాజకీయ వ్యవస్థకు మధ్య లలిత్ ఒక కీలకమైన లింక్. ఈ నెట్‌వర్క్‌ను సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వసుంధర రాజే కాపాడుతున్నారు’’ అని అన్నారు. లలిత్‌మోదీ అంశంలో ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు. మోదీ దమ్మున్న వ్యక్తి అని తాను భావించానని.. కానీ ఆయనకు దమ్ము లేదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లుపైనా పట్టుదలగా ఉన్నట్లు కనిపించి, వెనక్కితిరిగి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ ఆక్రమిస్తోంది: దేశంలో విద్యాసంస్థలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలసి నిరసన తెలిపింది. -
మన్మోహన్ సంజాయిషీ
కొన్ని కుంభకోణాలు ఓ పట్టాన ముగిసిపోవు. పదే పదే చర్చలోకి వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా కొత్త సంగతులను మోసుకొస్తాయి. వాటిల్లో నిజాలెన్నో, కానివెన్నో అంత వెంటనే తేలే వ్యవహారం కాదు. ఇలా వెల్లడైన ప్రతిసారీ కుంభకోణాల్లో నిందపడినవారు తమ వంతు వాదననూ, సంజాయిషీని ఇవ్వక తప్పదు. అందువల్లే బుధవారం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తన హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి మాట్లాడవలసివచ్చింది. ప్రధాని పదవిని అడ్డంపెట్టుకుని తానుగానీ, తన కుటుంబం లేదా మిత్రులుగానీ సంపద పోగేయాలనుకోలేదని ఆయన చెప్పడం వెనకున్న కారణం తేటతెల్లమే. గతంలో ట్రాయ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రధానాంశంగా ఓ పుస్తకం రాయడమే మన్మోహన్ స్పందనకు మూలకారణం. 2జీ లెసైన్స్‌ల విషయంలో సహకరించకపోతే హాని జరుగుతుందని మన్మోహన్ బెదిరించారన్నది బైజాల్ ఆరోపణల సారాంశం. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బోఫోర్స్ స్కాం దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో చర్చకొస్తున్న సంగతిని గుర్తుంచుకుంటే నిన్న మొన్నటి 2జీ కుంభకోణం మరోసారి మళ్లీ ప్రస్తావనకు రావడంలో వింతేమీ లేదు. మన్మోహన్ పాలనా కాలంపై ఇప్పటికే రెండు పుస్తకాలొచ్చాయి. అందులో ఒకటి మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ బారు రాసిందికాగా, రెండోది అప్పటి బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి పీసీ పరఖ్ రచించింది. వీరిలో సంజయ బారు మన్మోహన్‌కు ఆ సమయంలో అత్యంత సన్నిహితుడు. పరఖ్కు నిజాయితీ గల అధికారిగా పేరుంది. బైజాల్ సంగతి వేరు. ఆయన ఎన్డీయే పాలనా కాలం చివరిలో ట్రాయ్ చైర్మన్‌గా నియమితుడై యూపీఏ తొలి దశ పాలనలో కొంత కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. కనుకనే ఆ ఇద్దరికీ ఉన్నంత విశ్వసనీయత బైజాల్‌కు లభించకపోవచ్చు. పైగా మన్మోహన్ గురించి తెలిసివున్నవారెవరూ ఆయన బెదిరిస్తారంటే అంత త్వరగా నమ్మే అవకాశం లేదు. అలాగని మన్మోహన్ చెబుతున్నట్టు అసలు అవినీతే జరగలేదంటే విశ్వసించేవారెవరూ ఉండరు. 2జీ స్కాం పూర్వాపరాలను గుర్తుతెచ్చుకుంటే, ఆ కేసు విషయంలో జరిగిన పరిణామాలను తిరగేస్తే... నాటి యూపీఏ ప్రభుత్వం ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో అందరికీ అర్థమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్‌లో అసలు కుంభకోణమే జరగలేదని ఆనాడు ప్రభుత్వ పెద్దలందరూ వాదించారు. నాటి టెలికాం మంత్రి రాజాను తొలుత వెనకేసుకొచ్చిన మన్మోహన్... అది కాస్తా ముదిరేసరికి స్వరం మార్చి ‘సంకీర్ణ ధర్మం నా చేతులు కట్టేసింద’ని చెప్పారు. రాజాను నమ్మి అన్నిటికీ సరేనన్నానని మరొక సందర్భంలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను సైతం అది స్వీకరించాల్సి వచ్చింది. ఇక పార్లమెంటులో వేరే తంతు నడిచింది. స్కాంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలని విపక్షాలు చేసిన డిమాండును ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా 2010లో శీతాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా జరగలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇక గత్యంతరంలేక జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదిక మరో ముచ్చట. బయట రకరకాలుగా మాట్లాడిన మన్మోహన్... కమిటీ సభ్యులు కోరినా జేపీసీ ముందు హాజరయ్యేందుకు సిద్ధపడలేదు. మరోపక్క కమిటీ పిలిస్తే అన్నీ తేటతెల్లం చేస్తానని సంసిద్ధత వ్యక్తంచేసిన రాజాను పిలవలేదు. కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ముందుకొచ్చి మాట్లాడలేని అశక్తత ప్రదర్శించినందువల్లే మన్మోహన్ ఇప్పుడు పదేపదే సంజాయిషీలు ఇచ్చుకోవాల్సివస్తున్నది. 2జీ విషయంలో మాత్రమే కాదు... బొగ్గు కుంభకోణంలో సైతం ఆయన పరిస్థితి ఇదే. మాట్లాడవలసిన సమయంలో మౌనం వహిస్తే పర్యవసానాలెలా ఉంటాయో ఇప్పుడిప్పుడే మన్మోహన్‌కు తెలుస్తున్నట్టుంది. అందుకే తానుగానీ, తన సంబంధీకులుగానీ డబ్బు పోగేయలేదని ఆయన ప్రత్యేకించి చెప్పాల్సివచ్చింది. నిజానికి ఇది కుంభకోణం గురించి వచ్చిన ఆరోపణలకు ఏ రకంగానూ సమాధానం కాదు. స్కాం జరిగిందంటున్న వారు కూడా మన్మోహన్సింగ్ దానివల్ల లబ్ధిపొందారని చెప్పడంలేదు. స్కాం ద్వారా ఖజానాకు జరిగిన లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం ఎవరికి లాభంగా మారిందో చెప్పాలంటున్నారు. దీన్ని నడిపించిన సూత్రధారులెవరో తేలాలంటున్నారు. నోరుతెరిస్తే వీటన్నిటికీ జవాబివ్వకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు గనుకనే మన్మోహన్ మౌనంగా ఉండి పోయారన్నది కాంగ్రెస్ ప్రత్యర్థుల ఆరోపణ. సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అనవచ్చుగానీ ఆ సంగతిని స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ రెండేళ్లక్రితమే చెప్పింది. రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ చేతిలో ఉండగా, మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని, అందువల్లే పాలన కుంటుబడిందని అభిప్రాయపడింది. తర్వాత కాలంలో సంజయ బారు సైతం తన గ్రంథంలో ఈ సంగతే చెప్పారు. ఫైళ్లన్నీ సోనియా వద్దకు వెళ్లి వచ్చేవని, ఆమె నిర్ణయమే అంతిమంగా అమలయ్యేదని రాశారు. సర్వోన్నత న్యాయస్థానం 2 జీ స్కాంలో122 లెసైన్స్‌లను రద్దుచేశాక... బొగ్గు స్కాంలో 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కాదన్నాక కూడా తమ పాలనలో అవినీతే జరగలేదని మన్మోహన్ చెబితే ఎవరూ నమ్మరు. వర్తమానం తనపై కటువుగా ఉన్నా... చరిత్ర దయ దలుస్తుందని ఆశిస్తున్నానని పదవినుంచి వైదొలగే ముందు మన్మోహన్ అన్నారు. అలా దయదల్చాలంటే జరిగిన పరిణామాల విషయంలో తనవైపు నుంచి సమగ్రమైన సమాధానం రావాలి. అది జరగనంత కాలమూ ఈ స్కాంలన్నీ పదే పదే చర్చకొస్తాయి... ఆయనను సంజాయిషీ కోరతాయి. -
భారత్ మమ్మల్ని బెదిరిస్తోంది
న్యూఢిల్లీ: స్వీడన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'బోఫోర్స్' అంశం గురించి చెప్పిన విషయాలు ప్రచురించొద్దంటూ భారత్ చాలా ధృడంగా చెప్పిందని, ఓ రకంగా బెదిరించినట్లుగా చేసిందని స్వీడన్ పత్రిక డాగెన్స్ నిహెట్టర్ తెలిపింది. భారత రాయభారి పంపించిన లేఖ చూసి తాను ఆశ్యర్య పోయానని పత్రిక చీఫ్ ఎడిటర్ పీటర్ వోలోదర్ స్కీ చెప్పారు. బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు భారత్ లోని ఏ కోర్టు చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డాగెన్స్ నిహెట్టర్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మీడియానే విచారణ చేసింది తప్ప.. ఒక్క కోర్టులోనూ స్కాంగా నిరూపితం కాలేదని ఆయన చెప్పారు. అయితే, ఇదే విషయాన్ని ఆ పత్రిక ప్రచురించడంపట్ల భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు డాగెన్స్ తెలిపింది. డాగెన్స్ చెప్పిన వివరాల ప్రకారం స్వీడన్‌లోని భారత రాయభారి బనశ్రీ బోస్ హరిసన్ ఓ లేఖ రాశారు. అందులో 'ఇంటర్వ్యూలో రాష్ట్రపతి నోటి నుంచి తుళ్లిపడిన మాటలను, పైగా ఆన్ రికార్డుగా ఉంచాల్సిన మాటలను ఇలా ప్రచురించడం పూర్తిగా వృత్తికాదు, నైతికత అనిపించుకోదు' అని అందులో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రపతి ఆదివారం స్వీడన్లో పర్యటించనున్నారని, దానిని వ్యాసంగా ప్రచురించడం మానుకోకపోతే ఆ పర్యటన కూడా రద్దు చేసే అవకాశం ఉందని కూడా బెదరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. భారత్ ప్రతిస్పందన తామెదో తప్పుచేసినట్లుగా అనిపించిందని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండి ఆ విషయాన్ని చిన్నదిగా చేసి చూపించాలని ప్రయత్నిస్తోందని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. దీంతోపాటు తమ దేశ ప్రతినిధులుగా ఉన్న తాము తెలుసుకున్న విషయాలను ప్రచురించడం తమ బాధ్యత కూడా అన్నట్లుగా ఎడిటర్ పీటర్ వోలోదార్ స్కీ చెప్పారు. -
'అంబానీల కేజీ బేసిన్ కుంభకోణం భోఫోర్స్ కంటే పెద్దది'
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రిలయన్స్ గ్యాస్ కు సంబంధించిన అంశంలో ముఖేశ్ అంబానీపై ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై బీజేపీ, మోడీ ఎందుకు మౌనంగా ఉందో వెల్లడించాలని ఆప్ నిలదీసింది. క్విడ్ ప్రో కో లేకుండా కార్పోరెట్ కంపెనీల నుంచి ఫండ్స్ ను స్వీకరించడం తప్పేమి కాదని ఆప్ వెల్లడించింది. అంబానీలకు కేజీ బేసిన్ కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని, భోఫోర్స్ కుంభకోణానికంటే అతిపెద్దదని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. ఇలాంటి కుంభకోణంపై బీజేపీ, మోడీ మౌనం వహించడం అనేక సందేహాలకు తావిస్తోంది అని యాదవ్ అన్నారు. ముఖేశ్ అంబానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా మా పోల్ ఎజెండా ఏమిటో కాంగ్రెస్, బీజేపీలకు అర్ధమైందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కీలక కూటమిలలో కాంగ్రెస్, బీజేపీ, థర్డ్ ఫ్రంట్ కు ఆప్ ప్రత్యామ్నాయం కాదని యాదవ్ స్పష్టం చేశారు. అంబానీల నుంచి విరాళాలు స్వీకరిస్తారా అనే ప్రశ్నకు యాదవ్ సమాధానమిస్తూ... విరాళాలు స్వీకరించడమనే అంశంపై ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
బోఫోర్స్ ముడుపులను పార్టీకి వాడమన్నారు!
సీబీఐ మాజీ డెరైక్టర్ ఆత్మకథతో కలకలం న్యూఢిల్లీ: ‘బోఫోర్స్’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీబీఐ మాజీ డెరైక్టర్ ఏపీ ముఖర్జీ తన ఆత్మకథలో రక్షణ కొనుగోళ్ల లావాదేవీలపై ప్రస్తావించిన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. రక్షణ పరికరాల సరఫరాదారులు చెల్లించే ముడుపులను కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం వాడుకోవాలని రాజీవ్ గాంధీ భావించినట్లు ముఖర్జీ తన పుస్తకంలో రాశారు. భారీ రక్షణ పరికరాలను సరఫరా చేసే సరఫరాదారులు ఆనవాయితీగా చెల్లించే కమీషన్లను ఏదైనా ప్రభుత్వేతర సంస్థ ద్వారా వసూలు చేయించి, ఆ మొత్తాలను పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం వాడుకోవచ్చని కొందరు సలహాదారులు రాజీవ్‌కు సలహా ఇచ్చినట్లు ఇందులో పేర్కొన్నారు. ముఖర్జీ తన పుస్తకంలో వెల్లడించిన విషయాల ప్రకారం ‘బోఫోర్స్’ వంటి రక్షణ లావాదేవీల్లో వసూలు చేసిన కమీషన్లు, ముడుపులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లించినట్లు తేటతెల్లమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. వీటిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.