బోఫోర్స్’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీబీఐ మాజీ డెరైక్టర్ ఏపీ ముఖర్జీ తన ఆత్మకథలో రక్షణ కొనుగోళ్ల లావాదేవీలపై ప్రస్తావించిన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది.
సీబీఐ మాజీ డెరైక్టర్ ఆత్మకథతో కలకలం
న్యూఢిల్లీ: ‘బోఫోర్స్’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీబీఐ మాజీ డెరైక్టర్ ఏపీ ముఖర్జీ తన ఆత్మకథలో రక్షణ కొనుగోళ్ల లావాదేవీలపై ప్రస్తావించిన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. రక్షణ పరికరాల సరఫరాదారులు చెల్లించే ముడుపులను కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం వాడుకోవాలని రాజీవ్ గాంధీ భావించినట్లు ముఖర్జీ తన పుస్తకంలో రాశారు.
భారీ రక్షణ పరికరాలను సరఫరా చేసే సరఫరాదారులు ఆనవాయితీగా చెల్లించే కమీషన్లను ఏదైనా ప్రభుత్వేతర సంస్థ ద్వారా వసూలు చేయించి, ఆ మొత్తాలను పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం వాడుకోవచ్చని కొందరు సలహాదారులు రాజీవ్‌కు సలహా ఇచ్చినట్లు ఇందులో పేర్కొన్నారు. ముఖర్జీ తన పుస్తకంలో వెల్లడించిన విషయాల ప్రకారం ‘బోఫోర్స్’ వంటి రక్షణ లావాదేవీల్లో వసూలు చేసిన కమీషన్లు, ముడుపులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లించినట్లు తేటతెల్లమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. వీటిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.