కొన్ని కుంభకోణాలు ఓ పట్టాన ముగిసిపోవు. పదే పదే చర్చలోకి వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా కొత్త సంగతులను మోసుకొస్తాయి. వాటిల్లో నిజాలెన్నో, కానివెన్నో అంత వెంటనే తేలే వ్యవహారం కాదు. ఇలా వెల్లడైన ప్రతిసారీ కుంభకోణాల్లో నిందపడినవారు తమ వంతు వాదననూ, సంజాయిషీని ఇవ్వక తప్పదు. అందువల్లే బుధవారం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తన హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి మాట్లాడవలసివచ్చింది. ప్రధాని పదవిని అడ్డంపెట్టుకుని తానుగానీ, తన కుటుంబం లేదా మిత్రులుగానీ సంపద పోగేయాలనుకోలేదని ఆయన చెప్పడం వెనకున్న కారణం తేటతెల్లమే. గతంలో ట్రాయ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రధానాంశంగా ఓ పుస్తకం రాయడమే మన్మోహన్ స్పందనకు మూలకారణం. 2జీ లెసైన్స్‌ల విషయంలో సహకరించకపోతే హాని జరుగుతుందని మన్మోహన్ బెదిరించారన్నది బైజాల్ ఆరోపణల సారాంశం.
రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బోఫోర్స్ స్కాం దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో చర్చకొస్తున్న సంగతిని గుర్తుంచుకుంటే నిన్న మొన్నటి 2జీ కుంభకోణం మరోసారి మళ్లీ ప్రస్తావనకు రావడంలో వింతేమీ లేదు. మన్మోహన్ పాలనా కాలంపై ఇప్పటికే రెండు పుస్తకాలొచ్చాయి. అందులో ఒకటి మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ బారు రాసిందికాగా, రెండోది అప్పటి బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి పీసీ పరఖ్ రచించింది. వీరిలో సంజయ బారు మన్మోహన్‌కు ఆ సమయంలో అత్యంత సన్నిహితుడు. పరఖ్‌కు నిజాయితీ గల అధికారిగా పేరుంది. బైజాల్ సంగతి వేరు. ఆయన ఎన్డీయే పాలనా కాలం చివరిలో ట్రాయ్ చైర్మన్‌గా నియమితుడై యూపీఏ తొలి దశ పాలనలో కొంత కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. కనుకనే ఆ ఇద్దరికీ ఉన్నంత విశ్వసనీయత బైజాల్‌కు లభించకపోవచ్చు. పైగా మన్మోహన్ గురించి తెలిసివున్నవారెవరూ ఆయన బెదిరిస్తారంటే అంత త్వరగా నమ్మే అవకాశం లేదు.
అలాగని మన్మోహన్ చెబుతున్నట్టు అసలు అవినీతే జరగలేదంటే విశ్వసించేవారెవరూ ఉండరు. 2జీ స్కాం పూర్వాపరాలను గుర్తుతెచ్చుకుంటే, ఆ కేసు విషయంలో జరిగిన పరిణామాలను తిరగేస్తే... నాటి యూపీఏ ప్రభుత్వం ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో అందరికీ అర్థమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్‌లో అసలు కుంభకోణమే జరగలేదని ఆనాడు ప్రభుత్వ పెద్దలందరూ వాదించారు. నాటి టెలికాం మంత్రి రాజాను తొలుత వెనకేసుకొచ్చిన మన్మోహన్... అది కాస్తా ముదిరేసరికి స్వరం మార్చి ‘సంకీర్ణ ధర్మం నా చేతులు కట్టేసింద’ని చెప్పారు. రాజాను నమ్మి అన్నిటికీ సరేనన్నానని మరొక సందర్భంలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను సైతం అది స్వీకరించాల్సి వచ్చింది. ఇక పార్లమెంటులో వేరే తంతు నడిచింది. స్కాంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలని విపక్షాలు చేసిన డిమాండును ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా 2010లో శీతాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా జరగలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇక గత్యంతరంలేక జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదిక మరో ముచ్చట. బయట రకరకాలుగా మాట్లాడిన మన్మోహన్... కమిటీ సభ్యులు కోరినా జేపీసీ ముందు హాజరయ్యేందుకు సిద్ధపడలేదు. మరోపక్క కమిటీ పిలిస్తే అన్నీ తేటతెల్లం చేస్తానని సంసిద్ధత వ్యక్తంచేసిన రాజాను పిలవలేదు.
కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ముందుకొచ్చి మాట్లాడలేని అశక్తత ప్రదర్శించినందువల్లే మన్మోహన్ ఇప్పుడు పదేపదే సంజాయిషీలు ఇచ్చుకోవాల్సివస్తున్నది. 2జీ విషయంలో మాత్రమే కాదు... బొగ్గు కుంభకోణంలో సైతం ఆయన పరిస్థితి ఇదే. మాట్లాడవలసిన సమయంలో మౌనం వహిస్తే పర్యవసానాలెలా ఉంటాయో ఇప్పుడిప్పుడే మన్మోహన్‌కు తెలుస్తున్నట్టుంది.
అందుకే తానుగానీ, తన సంబంధీకులుగానీ డబ్బు పోగేయలేదని ఆయన ప్రత్యేకించి చెప్పాల్సివచ్చింది. నిజానికి ఇది కుంభకోణం గురించి వచ్చిన ఆరోపణలకు ఏ రకంగానూ సమాధానం కాదు. స్కాం జరిగిందంటున్న వారు కూడా మన్మోహన్‌సింగ్ దానివల్ల లబ్ధిపొందారని చెప్పడంలేదు. స్కాం ద్వారా ఖజానాకు జరిగిన లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం ఎవరికి లాభంగా మారిందో చెప్పాలంటున్నారు. దీన్ని నడిపించిన సూత్రధారులెవరో తేలాలంటున్నారు. నోరుతెరిస్తే వీటన్నిటికీ జవాబివ్వకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు గనుకనే మన్మోహన్ మౌనంగా ఉండి పోయారన్నది కాంగ్రెస్ ప్రత్యర్థుల ఆరోపణ. సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అనవచ్చుగానీ ఆ సంగతిని స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ రెండేళ్లక్రితమే చెప్పింది. రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ చేతిలో ఉండగా, మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని, అందువల్లే పాలన కుంటుబడిందని అభిప్రాయపడింది. తర్వాత కాలంలో సంజయ బారు సైతం తన గ్రంథంలో ఈ సంగతే చెప్పారు. ఫైళ్లన్నీ సోనియా వద్దకు వెళ్లి వచ్చేవని, ఆమె నిర్ణయమే అంతిమంగా అమలయ్యేదని రాశారు. సర్వోన్నత న్యాయస్థానం 2 జీ స్కాంలో122 లెసైన్స్‌లను రద్దుచేశాక... బొగ్గు స్కాంలో 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కాదన్నాక కూడా తమ పాలనలో అవినీతే జరగలేదని మన్మోహన్ చెబితే ఎవరూ నమ్మరు. వర్తమానం తనపై కటువుగా ఉన్నా... చరిత్ర దయ దలుస్తుందని ఆశిస్తున్నానని పదవినుంచి వైదొలగే ముందు మన్మోహన్ అన్నారు. అలా దయదల్చాలంటే జరిగిన పరిణామాల విషయంలో తనవైపు నుంచి సమగ్రమైన సమాధానం రావాలి. అది జరగనంత కాలమూ ఈ స్కాంలన్నీ పదే పదే చర్చకొస్తాయి... ఆయనను సంజాయిషీ కోరతాయి.
మన్మోహన్ సంజాయిషీ
Published Thu, May 28 2015 12:02 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement