చట్టం తన పని తాను చేసుకుపోతుందనే మాట మధ్యప్రదేశ్‌లో వేరే రకంగా అమలవుతున్నట్టు కనబడుతోంది. మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలనూ... ముఖ్యమైన ప్రభుత్వోద్యోగాలనూ అంగట్లో సరుకులా అమ్ముకున్న మాఫియాపై ఒకపక్క ఎడతెగని దర్యాప్తు సాగుతుండగానే ఆ స్కాంలో నిందితులు, సాక్షులు పిట్టల్లా రాలుతున్నారు. చట్టం మాత్రం తన పనిలో తానుంది తప్ప ఈ అసహజ మరణాలపై ఆరా తీసి కారకుల్ని గుర్తించిన దాఖలాలు కనబడటం లేదు.
ఈ స్కాం పూర్వాపరాలను చూస్తే ఎవరికైనా హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ గుర్తొస్తుంది. అయితే, ఆ చిత్రం జనానికి మంచి వినోదం అందిస్తే... ఈ స్కాం మాత్రం ఎన్నో కుటుంబాల్లో మరణమృదంగాన్ని మోగిస్తూ విషాదాన్ని మిగులుస్తున్నది. వందల కోట్లు కొల్లగొట్టి అయోగ్యులను అందలం ఎక్కించిన ఈ వ్యవహారంలో నిందితులపై దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈలోగానే సాక్ష్యాధారాలను శాశ్వతంగా చెరిపేసే పనిలో మాఫియా పెద్దలు విజయవంతమ వుతున్నట్టు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బోధపడుతుంది.
వ్యాపమ్ స్కాంగా మీడియాలో హోరెత్తుతున్న ఈ కుంభకోణం విస్తృతినీ, లోతునూ... అందులోని రకరకాల మలుపుల్ని గమనిస్తే ఎంతటివారైనా నిర్ఘాంతపోవాల్సిందే. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన పరీక్షల నిర్వహణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) పేరిట 1970 ప్రాంతంలో ఒక సంస్థను ఏర్పాటుచేశారు.
మొదట్లో మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశానికి జరిగే పరీక్షల నిర్వహణకే పరిమితమైన ఈ సంస్థ పనితీరు నచ్చడంవల్లనో, ఇతర కారణాలవల్లనో తదనంతర కాలంలో దానికి చాలా బాధ్యతలు కట్టబెట్టారు. మెడిసిన్, ఇంజనీరింగ్‌లతోపాటు పాలిటెక్నిక్, ఆర్కిటెక్చర్, పీజీ ఎంట్రెన్స్, మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. అయిదారేళ్లక్రితమే వ్యాపమ్ వ్యవహారంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. భారీయెత్తున డబ్బులు దండుకుంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. అయినా 2007లో సర్వీస్ కమిషన్ పరిధిలోకి రాని పోలీస్ కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డులు, కాంట్రాక్టు టీచర్లు వగైరా ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను కూడా దీనికి అప్పగించారు.
పరిధి పెరిగే కొద్దీ వ్యాపమ్ మాఫియా వసూళ్లు పెరిగాయి. డాక్టర్ ఆనంద్ రాయ్ అనే ఒక కంటి వైద్య నిపుణుడు ఆశిష్ చతుర్వేది అనే మరొకరితో కలిసి ఈ స్కాం కూపీ లాగారు. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘మిస్టర్ క్లీన్’గా, సుపరిపాలకుడిగా కీర్తిగడించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పిటిషన్ సంగతి తెలిసిన వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామన్నారు. ఈ రెండేళ్లకాలంలో స్కాం ఊసెత్తినప్పు డల్లా ఆయన దాన్నే గుర్తు చేస్తున్నారు. ‘నా అంతట నేనే దర్యాప్తునకు ఆదేశించాను గదా... నా సచ్ఛీలతకు అది నిదర్శనం కాదా..?’ అని దబాయిస్తున్నారు. ఆయన దర్యాప్తునకు ఆదేశించారు.
ఆ దర్యాప్తు ఎలా సాగుతున్నదో పర్యవేక్షించడానికి హైకోర్టు తన వంతుగా ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేసింది. కానీ...ఈ స్కాంలో సాగుతున్న వరస మరణాలపై ముఖ్యమంత్రి మొదలుకొని ఎవరూ సరిగా పట్టించుకోలేదు. ఇవన్నీ ‘అసహజ మరణాలే’నని ఎస్‌టీఎఫ్ కూడా ఒప్పుకున్నది. అలా ఒప్పుకున్నాక అది చేసిందేమిటోగానీ ఆ తరహా మరణాలు మాత్రం ఆగలేదు. సాధారణ పరిస్థితుల్లో ఒక మనిషి అసహజ మరణమే ఆందోళన కలిగిస్తుంది. అలాంటిది స్కాంతో సంబంధం ఉన్నవారు ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఎంతటి ఆందోళన కలగాలి... దర్యాప్తు అధికారులు ఎంత చురుగ్గా కదలి బాధ్యుల్ని పట్టుకోవాలి? మధ్యప్రదేశ్‌లో అలాంటిదేమీ లేకపోగా ఆ రాష్ట్ర మంత్రి బాబూలాల్ గౌర్ తత్వ బోధ చేస్తున్నారు. పుట్టినవారు గిట్టక తప్పదని వేదాంతం వల్లిస్తున్నారు.
ఈ కుంభకోణంలో గవర్నర్, ముఖ్యమంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి, ఆరెస్సెస్ నేతలిద్దరి పేర్లు గుప్పుమన్నాయి. విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దళారులు ముద్దాయిలుగా ఉన్నారు. మాజీ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రిల ఓఎస్‌డీలు, డజనుకు మించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు. మొత్తం 2,400మందిని నిందితులుగా చేరిస్తే 1,800మంది అరెస్టయ్యారు. 600మంది ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అరెస్టయి బెయిల్‌పై బయటికొచ్చినవారిలో 200మంది తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ పిటిషన్‌లు దాఖలుచేశారు. గవర్నర్ రాంనరేష్ యాదవ్‌ను స్కాంలో ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌ను... ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నందువల్ల సాధ్యంకాదని హైకోర్టు తోసిపుచ్చింది. గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్‌తోసహా 44మంది మరణించారు.
అందరూ 25-30 ఏళ్లలోపువారే. అందరివీ అసహజ మరణాలే. మెడిసిన్‌లో అక్రమంగా సీటు సంపాదించిన 19 ఏళ్ల యువతి నమ్రత మొదలుకొని... లక్షలు పోసి ఉద్యోగం కొనుక్కున్న పాతికేళ్ల యువకుడి వరకూ ఇందులో ఉన్నారు. దళారులున్నారు. తమ పేర్లు బయటపడకుండా, సాక్ష్యాలు దొరక్కుండా చేయడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నా ఆ దిశగా ఎవరినీ అరెస్టు చేసిన దాఖలా లేదు. దేశంలో ఒక పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఇంత భారీ కుంభకోణం, దానితో ప్రమేయమున్న అనేకుల అసహజ మరణాలూ సాగుతున్న తీరుచూస్తే మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేక ఏదైనా బనానా రిపబ్లిక్‌లోనా అనే అనుమానం కలుగుతుంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి సక్రమంగా వ్యవహరించకపోతే మన దేశం పరువు గంగలో కలవడం ఖాయం.
కుంభకోణం... మృత్యుగీతం
Published Wed, Jul 1 2015 11:58 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement