పార్లమెంటు మొదలై మూడురోజులైంది. ఈ మూడురోజులూ పట్టుమని పది నిమిషాలపాటు ఉభయ సభలు సాగిన దాఖలాలు లేవుగానీ అప్పుడే రూ. 27 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలను గమనిస్తుంటే అధికారం చేతులు మారడమే కాదు... వ్యూహాలు కూడా చేతులు మారినట్టు కనబడుతోంది. కుంభకోణాలు వెల్లడైనప్పుడల్లా, తనపై ఆరోపణలొచ్చినప్పుడల్లా యూపీఏ సర్కారు ప్రత్యారోపణలు చేసేది. స్కాం గురించి ప్రస్తావిస్తే మరి మీమాటేమిటని ప్రశ్నించేది. మంత్రులు రాజీనామా చేయాలని అడిగితే ముందు చర్చిద్దాం రండని పిలిచేది. చర్చలంటే భయమెందుకనేది. అటు బీజేపీ మాత్రం మంత్రులు రాజీనామా చేశాకే చర్చకొస్తామని, అంతవరకూ సభను సాగనిచ్చేది లేదని తెలిపేది. ఇప్పుడు కూడా అచ్చం అవే వాదనలు సాగుతున్నాయి. కాకపోతే పాత్రధారులు మారారు.
యూపీఏకు నాయకత్వంవహించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అప్పుడు బీజేపీ మాట్లాడిన మాటల్ని వల్లెవేస్తున్నది. సహజంగానే బీజేపీ యూపీఏ సర్కారు వారసురాలిగా మారింది. పాత రికార్డుల్ని తిరగేసి వారి వ్యూహాలన్నిటినీ మక్కికి మక్కీ అనుసరిస్తున్నది. ఫలితంగా పార్లమెంటు స్తంభించి, ఇదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం... ఈ మాత్రం దానికి సమావేశాల నిర్వహణ దేనికని విస్తుపోవడం సాధారణ పౌరుల వంతవుతున్నది.
మొదటిరోజు ఏం చేయాలో తోచనట్టు కనబడిన బీజేపీ నాయకత్వం రెండోరోజుకల్లా తేరుకుని ప్రతివ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం ఉదయమే దీనికి శ్రీకారం చుట్టారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు బొగ్గు కుంభకోణం నిందితుడు సంతోష్ బగ్రోడియాకు దౌత్య పాస్‌పోర్టు ఇప్పించమని కొన్నాళ్లక్రితం తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశం పెట్టి ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ కార్యదర్శి మద్యం డీలర్ల ప్రతినిధితో ముడుపుల వ్యవహారం గురించి మాట్లాడినట్టు కనబడుతున్న స్టింగ్ ఆపరేషన్ సీడీని విడుదల చేశారు.
దీనికి కొనసాగింపుగా గురువారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఇది పాత ఆరోపణేనని, ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తున్నందున ఇంతకుమించి మాట్లాడనని వీరభద్రసింగ్ జవాబు. ఈ రెండు స్కాంలకూ ముందు కాంగ్రెస్‌కే చెందిన గోవా మాజీ సీంఎ దిగంబర్ కామత్‌కు సంబంధించిన మైనింగ్ కుంభకోణాన్ని బీజేపీ వెల్లడించింది. రేపో మాపో కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌పై ఉన్న 18 ఏళ్లనాటి హత్యానేరం ఆరోపణలను తవ్విపోసి, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించమని బీజేపీ కోరవచ్చునంటున్నారు. ఎటూ పార్లమెంటు సజావుగా సాగడం లేదు గనుక దొరికిన విశ్రాంతి సమయాన్ని వినియోగించుకుని బీజేపీ ఇలా కాంగ్రెస్ సీఎంలు, మాజీ సీఎంలపై రోజూ ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకోదల్చుకున్నట్టు కనబడుతోంది.
కాస్త వెనక్కు వెళ్తే కాంగ్రెస్ కూడా ఈ పనే చేసింది. తనపై కుంభకోణాల ఆరోపణ వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలపై ప్రత్యారోపణలు చేసేది. అప్పట్లో ఆ పార్టీలో శరవేగంతో ఎదుగుతున్న నరేంద్రమోదీని ప్రధానంగా లక్ష్యం చేసుకుని ఈ ఆరోపణలుండేవి. 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేథం, అందుకు సంబంధించిన వేర్వేరు కేసులు అందులో కొన్ని. అలాగే ఒక గుర్తు తెలియని మహిళ కదలికలపై మోదీ ప్రభుత్వం కన్నేసిందని అప్పట్లో మీడియాకు లీకులిచ్చింది కూడా కాంగ్రెసే. ఇప్పుడు అచ్చం అదేమాదిరి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తున్నది. సుష్మా, శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియాలపై పార్లమెంటు అట్టుడుకుతుంటే చర్చకు సిద్ధమని చెబుతోంది.
ఎలాంటి చర్చలైనా రాజీనామాల తర్వాతేనని కాంగ్రెస్ అంటోంది. 2జీ స్పెక్ట్రమ్ స్కాం వెల్లడైనప్పుడు టెలికాం మంత్రి ఎ. రాజా రాజీనామా చేయాలని బీజేపీ...ముందు చర్చించడానికి సభను సజావుగా సాగనివ్వండని కాంగ్రెస్ పరస్పరం వాదించుకున్నాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు సుష్మా కూడా తనపై వచ్చిన ఆరోపణలకు బదులుగా ప్రత్యారోపణ చేస్తున్నారు తప్ప చేసిన పనిని సమర్థించుకోలేకపోతున్నారు. ‘నేను లలిత్ మోదీకి ఎలాంటి సాయమూ చేయలేదు. ప్రయాణ పత్రాలు కావాలన్న ఆయన అభ్యర్థనపై బ్రిటన్ తీసుకునే నిర్ణయం ప్రభావం ఇరు దేశాల సంబంధాలనూ ప్రభావితం చేయబోదని మాత్రమే చెప్పాను’ అని ఆమె సంజాయిషీ ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయాన్నిగానీ, కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలనుగానీ ఎందుకు సంప్రదించలేదో సుష్మా చెప్పలేకపోతున్నారు. అది చెప్పకుండా ఎన్ని ప్రత్యారోపణలు చేసినా నిష్ర్పయోజనం.
అసలిలా ప్రత్యారోపణలు చేసేముందు బీజేపీ గతాన్ని గుర్తు చేసుకోవాలి. స్కాంలు బయటపడినప్పుడు కాంగ్రెస్ అనుసరించిన ఈ మాదిరి ఎత్తుగడలు ఆ పార్టీని కాపాడాయా? దాని పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయా? అవతలి పార్టీ కూడా స్కాంలకు పాల్పడుతున్నది గనుక కాంగ్రెస్‌దేమీ తప్పులేదని జనం భావించారా? లేనేలేదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నడూలేని స్థాయిలో 44 స్థానాలకు పరిమితం కావాల్సివచ్చింది. కనుక కుంభకోణం ఆరోపణలకు జవాబుగా తిరిగి ఆరోపణలు చేయడంవల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని బీజేపీ గుర్తించాలి. దానికి బదులు అధికారంలో ఉన్నారుగనుక తామే తగిన విచారణకు ఆదేశించి నిజాల్ని నిగ్గుతేల్చడం సరైన చర్య అవుతుంది. అంతకన్నా ముందు తమ నేతల సచ్ఛీలత నిరూపించుకోవడం బీజేపీ బాధ్యత. అంతేతప్ప ఇరుపక్షాలూ కలిసి పార్లమెంటును స్తంభింపజేసి దాని విలువైన సమయాన్నీ, ప్రజాధనాన్నీ వృథా చేయడం న్యాయం కాదు.