రాఫెల్‌ మరో బోఫోర్స్‌ కానుందా? | Shekhar Gupta Article On Rafale Deal | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 12:39 AM | Last Updated on Sat, Oct 6 2018 8:14 AM

Shekhar Gupta Article On Rafale Deal - Sakshi

రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారానికి అనేక పరిమితులున్నాయి. ఇక్కడ పాలకపక్షానికి వ్యతిరేకంగా పోరు సలుపుతూ, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ వంటి నాయకుడు లేరు. సింగ్‌ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. బోఫోర్స్‌ వ్యవహారంలో మాదిరిగా కుంభకోణం జరిగిందనడానికి కొద్దిపాటి సాక్ష్యాధారాలు కూడా రాఫెల్‌ వివాదంలో కనపడటం లేదు. దీనిపై వివరణాత్మక కథనాలుగానీ, నినాదం గానీ ఇంకా వినిపించడం లేదు.

రాఫెల్‌ వ్యవహారం నరేంద్రమోదీ పాలిటి బోఫోర్స్‌లా మారిందని ఆయనను తీవ్రంగా విమర్శించేవారు సైతం చెప్పడం లేదు. కానీ, తాము ఆ పనిలో ఉన్నామనీ, కొన్ని నెలల క్రితం వరకూ అజేయుడిగా కనిపించిన ప్రధానిని ఓడించడానికి బ్రహ్మాస్త్రంగా పనిచేసే శక్తి దీనికి ఉందని వారంటున్నారు. అయితే వెల్లడిస్తున్న విషయాల్లో పదునైన అంశాలేవీ లేవు. మొదటిది, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి రాఫెల్‌ అంటే ఏమిటో తెలియదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 21 శాతం మందికే రాఫెల్‌ అంటే ఏమిటో తెలుసని ఇటీవలి ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో తేలింది. దీనికి మా జర్నలిస్టులనే నిందించాలి. రెండోది, జనం నమ్మేరీతిలో ప్రతిపక్షాల సందేశాన్ని ఓటర్ల వద్దకు తీసుకెళ్లే వీపీ సింగ్‌ వంటి నైతిక బలమున్న నేత ఇప్పుడు లేడు.

బోఫోర్స్‌తో పాటు ఇంకా అనేక ఇతర కుంభకోణాల నీడలు వెంటాడుతున్న కారణంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీS ఈ పనిచేయడానికి సరిపోరు. ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్‌గాంధీ రాఫెల్‌ వివా దాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించారు. కేంద్రంలో పాలక కూటమి అవినీతి, ఆశ్రిత పెట్టుబడి దారీ పోకడలు వంటి విషయాలు దీనికి అవి జోడిస్తాయి. అనేక సొంత కంపెనీలు నష్టాలతో నడుస్తున్న అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామికవేత్తకు మోదీ అడ్డగోలుగా మేలు చేయగలిగితే, విజయవంతంగా కంపెనీలు నడిపే బడా వ్యాపారవేత్తలకు ఆయన ఎందుకు సాయం చేయడు? అనే వాదనను అవి ముందుకు తెస్తాయి. 

ఆరోపణలన్నీ రాఫెల్‌ చుట్టూనే!
గతంలో వ్యాపారులకు మేలు చేస్తున్నారనే సందేశం ఇవ్వడానికి ‘‘సూట్‌ బూట్‌ సర్కార్‌’’ అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్‌ తన ఆరోపణలకు రాఫెల్‌ చుట్టూ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడానికి, పార్లమెంటును కుదిపేసే కథనాలు తీసుకు రావడానికి బోఫోర్స్‌ కుంభకోణం రోజుల్లో మాదిరిగా రామ్‌నాథ్‌ గోయెంకా నాయకత్వంలో నడిచిన ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ వంటి మీడియా సంస్థ లేదని ప్రతిపక్షాలు బాధపడుతున్నాయి. వాటికున్నదల్లా మచ్చలేని వ్యక్తి గత ప్రతిష్ట ఉన్న ఇద్దరు అరుణ్‌శౌరీ, ప్రశాంత్‌ భూషణ్‌ మాత్రమే. ఈ అశ్వమేధ యాగం ముందు నిలపడానికి తగిన అశ్వం రాహుల్‌ కాదు. అవినీతి విషయమై ఇంకా బీజేపీ లోపల ఏ పెద్ద నాయకుడూ తిరుగుబాటు చేయలేదు. ఒక్కసారి మన రాజకీయ చరిత్ర పరిశీలిద్దాం. 1977లో విధేయుడైన జగ్జీవన్‌ రామ్‌ ఇందిరాగాంధీపై, 1988–89లో నమ్మకస్తుడైన వీపీ సింగ్‌ రాజీవ్‌గాంధీపై చేసిన తిరుగుబాట్లే ఈ రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మార్చేశాయి. తల్లీకొడుకుల ఓటమికి కారణ మయ్యాయి.

మరో వీపీ సింగ్‌ను ఆశించడమా!
ఇప్పుడు మరో వీపీ సింగ్‌ను ఆశించడం వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఎందుకంటే, వీపీ సింగ్‌కు అవినీతి అంటని గొప్ప నిజాయితీపరుడిగా పేరుండ డమేగాక, ఆయన కేంద్ర కేబినెట్‌లో కీలకమైన (రక్షణ శాఖ) మంత్రి పదవిని త్యాగం చేశారు. రెండోది, ఆయన నరేంద్రమోదీ లేదా వాజ్‌పేయీ లాగా గొప్ప వక్త కాదు. కాని, 30 ఏళ్ల క్రితమే దేశంలో కేంద్రస్థానమైన హిందీ ప్రాంతాల్లో సంక్లిష్టమైన ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన కుంభ కోణాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా ఆయన విడమరచి చెప్పగలిగారు. అంతటి గొప్ప మాంత్రికుడాయన. కుంభకోణాల వెల్లువలో రాజీవ్‌ గాంధీ ప్రతిష్ట తగ్గడం మొదలవ్వగానే 1987లో వీపీ సింగ్‌ మంత్రి పదవికి, పార్లమెంటుకు రాజీనామా చేశారు. అలహాబాద్‌ ఉప ఎన్నికలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. బోఫోర్స్‌ కుంభకోణంలో ముడుపుల ఆరోపణలకు సంబంధించి అప్పుడే అమితాబ్‌ బచ్చన్‌ ఈ సీటుకు రాజీనామా చేయడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. వాతావరణం వీపీ సింగ్‌కు అనుకూలంగానే ఉంది. కానీ, ఆయన బోఫోర్స్‌ను ఎన్నికల అంశంగా చేయలేరని ఆయన మిత్రులు, శత్రువులు కూడా నమ్మారు. తమకు సంబంధం లేని క్లిష్టతరమైన విషయంపై పేద గ్రామీణులు ఎలా స్పందించగలరని వారు అనుకున్నారు. సింగ్‌ చక్కటి పద్ధతిలో ప్రచారం చేసి గెలిచారు. మోటర్‌సైకిల్‌పై వెనుక సీట్లో కూర్చుని మండు వేసవిలో ఆయన ప్రచారం చేశారు.

నేడు సామాజిక కార్యకర్త, రాజకీయ నేత యోగేంద్ర యాదవ్‌ మాదిరిగా మెడ చుట్టూ తువ్వాలు(గమ్చా) చుట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ, ఓ మామూలు ప్రశ్న అడిగే వారు. రాజీవ్‌గాంధీ మీ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు తెలుసా? అనే ప్రశ్న సంధించేవారు. తర్వాత వెంటనే తన కుర్తా జేబు నుంచి అగ్గిపెట్టె తీసి పట్టుకునే వారు. ‘‘చూడండి, ఇది అగ్గిపెట్టె. మీ బీడీ లేదా హుక్కా లేదా మీ పొయ్యికి నిప్పు అంటించడానికి ఆరణాలు (25 పైసలు) పెట్టి అగ్గిపెట్టె కొంటారు. కాని, ఆరణాల్లో నాలుగోవంతు ప్రభుత్వానికి పన్ను రూపంలో పోతుంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం మీకు స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు, కాలవలు నిర్మించడమే గాక, మీ సైన్యానికి తుపాకులు కొనుగోలు చేస్తుంది. ఇది మీ సొమ్ము. దీంట్లో కొంత ఎవరైనా దొంగిలిస్తే–అదీ సైన్యానికి తుపాకులు కొనేటప్పుడు ఆ పని చేస్తే–మీ ఇంట్లో దొంగలు పడినట్టు కాదా?’’ ఇలా వీపీ సింగ్‌ జనానికి బోఫోర్స్‌ గురించి వివరించేవారు. వాస్తవానికి కుంభకోణం వివరాలు, అంకెలతో కూడిన వివరాల కన్నా సింగ్‌ ప్రజలకు దీని గురించి కథలా చెప్పిన విధానమే బాగా పని చేసింది. ‘‘తనకు ముడుపులు ఏమీ చెల్లించలేదంటూ బోఫోర్స్‌ కంపెనీ తనకు సర్టిఫికెట్‌ ఇచ్చిందని రాజీవ్‌గాంధీ చెబుతున్నారు. ఇది ఎలా ఉందంటే, తాను మానసికంగా అంతా బాగానే ఉన్నానంటూ మానసిక రోగుల ఆస్పత్రి తనకు సర్టిఫికెట్‌ ఇచ్చిందని, మీకు కూడా ఇలాంటి పత్రం లేకుంటే మీరు మానసికంగా బాగున్నట్టు ఎలా భావించాలని ఓ పిచ్చివాడు చెబుతూ దాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది’’ అని వీపీ సింగ్‌ తన ప్రసంగాల్లో వివరించేవారు. 

బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ ఒక్కరే లంచాలు తీసుకున్నారని ప్రజలను నమ్మించడానికి ఇలా మరో కథ చెప్పేవారు. ‘ఓ సర్కస్‌లో ఓ సింహం, ఆబోతు, పిల్లి ఒకే చోట దగ్గర దగ్గరగా ఉండేవి. ఓ రాత్రి ఎవరో ఈ జంతువుల బోనులన్నీ తెరిచారు. మరుసటి ఉదయం గుర్రం, ఆబోతు మృతదేహాలను సర్కస్‌ యజమాని చూశారు. వాటిని ఎవరు తిన్నారో మీకేమైనా అను మానాలున్నాయా? సింహమా? పిల్లా? బోఫోర్స్‌లో అంత పెద్ద మొత్తంలో సొమ్ము తినేశారంటే, చిన్న పిల్లి వంటి జంతువు తిని ఉంటుందా? సింహం సైజులో ఉండే దొంగ రాజీవ్‌ మాత్రమే ఆ పనిచేయగలరు’’ అంటూ వీపీ సింగ్‌ చేసిన వాదనలు జనంలోకి వెళ్లి పోయాయి. అంతే కాదు, చిరునవ్వుతో ఉన్న రాజీవ్‌ బొమ్మతో కూడిన కాంగ్రెస్‌ హోర్డింగులను ఆయన చూపిస్తూ విసిరే మాటల తూటాలు కూడా బాగా పనిచేశాయి. ‘‘రాజీవ్‌ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన మోసంపైనా? మన అమాయకత్వంపైనా? లేదా స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో దాచిన సొమ్మును చూసుకునా? నేనైతే మీకు కాలవలు, గొట్టపు బావులు తెస్తానని వాగ్దానం చేయలేను. కానీ, మీ సంపదను దోచుకుంటున్న వారికి అడ్డుకట్ట మాత్రం వేయగలను’’ అంటూ ప్రజలను సింగ్‌ ఆకట్టుకునేవారు. సింగ్‌ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. ఇప్పటి కాంగ్రెస్‌లో ఇలా విషయం జనానికి వివరించగల నేతలు కరువయ్యారు. నేడు ప్రతిపక్షాలకు వీపీ సింగ్‌ వంటి నాయకుడు లేడు. అలాగే, రాఫెల్‌ కూడా బోఫోర్స్‌ అంతటి శక్తిమంతమైన విషయం కాదు.

బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ ఎంతో తేడా
బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ మధ్య ఎంతో తేడా ఉంది. బోఫోర్స్‌ శతఘ్ని నాణ్యతపై భిన్నాభిప్రాయాలున్నాయిగాని, రాఫెల్‌ అత్యుత్తమ యుద్ధవిమానమని అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్‌ దీన్ని ఎంపిక చేయడమే దీనికి కారణం. ముందుగా అనుకున్నట్టు 126కు బదులు మోదీ సర్కారు 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయడంపైనే ఆరోపణ. ‘బోఫోర్స్‌ మొదటి శతఘ్నిని భారత సైనికులు పేల్చినప్పుడు అది వెనక్కి పేలడంతో మనవాళ్లే పలువురు మరణించారు’ అని వీపీ సింగ్‌ అప్పట్లో చెప్పగలిగారు. ఇప్పుడు రాఫెల్‌ విమానం గురించి ఇలా ఎవరూ మాట్లాడలేరు. జర్నలిస్ట్‌ టీఎన్‌ నైనన్‌  చెప్పినట్టు రెండో విషయం ఏమంటే, బోఫోర్స్‌ కుంభకోణంలో మాదిరిగా ఆరోపణలకు అనుకూల మైన సాక్ష్యాధారాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. బోఫోర్స్‌ ముడుపులు లంచాలు భారతీ యులకు సంబంధమున్న మూడు స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్లకు జమ అయ్యాయని స్వీడన్‌ జాతీయ ఆడిటర్‌ దర్యాప్తులో తేలింది.

కానీ, రాఫెల్‌ విమానాల తయారీలో భారతీయ పార్టనర్‌ కంపెనీని భారత ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ చేసిన ప్రకటన స్వీడిష్‌ ఆడిటర్‌ చెప్పిన విషయానికి ఏమాత్రం సాటిరాదు. రక్షణ ఆయుధాల ఉత్పత్తిలో అనుభవం లేని కార్పొరేట్‌ సంస్థకు ఎలా రాఫెల్‌ విమాన తయారీలో భాగస్వామ్యం కల్పిస్తారని మాత్రమే అందరూ అడుగు తున్నారు. తమకు నచ్చినవారిపై పక్షపాతం చూపించే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం చెడ్డదేగాని నరేంద్ర మోదీ ఓటర్లను ఆయనకు వ్యతిరేకంగా తిప్పడానికి ఈ ఒక్క ప్రశ్న మాత్రమే సరిపోతుందా? ఇదే రాఫెల్‌ వ్యతిరేక ప్రచారానికి ఉన్న పరిమితి. గతంలో వీపీ సింగ్‌ బోఫోర్స్‌ వ్యవహారంపై అద్భుత రీతిలో పోరాడారు. ‘‘వీపీ సింగ్‌కా ఏక్‌ సవాల్, పైసా ఖాయా కౌన్‌ దలాల్‌? (సొమ్ము ఎవరో తినేశారు. ఆ బ్రోకర్‌ ఎవరన్నదే వీపీ సింగ్‌ ప్రశ్న)’’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూటిగా దేశ ప్రజల్లో నాటు కుంది.


- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement