మౌనముని మాటల ముత్యాలు | Shekhar Gupta Article On Manmohan Singh | Sakshi
Sakshi News home page

మౌనముని మాటల ముత్యాలు

Published Sat, Dec 22 2018 12:47 AM | Last Updated on Sat, Dec 22 2018 4:20 PM

Shekhar Gupta Article On Manmohan Singh - Sakshi

2018 చివరలో, మరొక ఎన్నికల సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ గురించి కథనాలు రాస్తామని ఎన్నడైనా ఊహించామా? అయన ఇప్పుడు ‘మౌన మోహన్‌’ కాదు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. చాలా తక్కువగానే కావచ్చు కానీ చాలా పరిణతితో మాట్లాడతారు. యథాప్రకారంగానే ఆయన ఒకటి రెండు వాక్యాలు మాట్లాడతారు. కానీ దేశం మొత్తంగా ఆయన చెప్పేది వినడానికి, స్పందించడానికి సిద్ధమవుతోంది. తక్కువగా మాట్లాడినా ప్రెస్‌ ప్రశ్నలకు జవాబిచ్చే మన్మోహన్‌కి ఎక్కువగా మాట్లాడుతూ ప్రశ్నలకు జవాబివ్వని ప్రధాని మోదీకి ఉన్న వ్యత్యాసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం విశేషం.

జర్నలిస్టులు, విశ్లేషకుల్లో చాలమంది డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజకీయ సంస్మరణ గురించి అయిదేళ్ల క్రితమే రాసేశారు. కొంతమందయితే 2010లో యూపీఏ–2 పతనం ప్రారంభమైన తొలిదినాల్లోనే ఆ పని చేశారు. యూపీఏ–2 ఆటో–ఇమ్యూన్‌ అనే వ్యాధికి బలైందంటూ నేను కూడా అప్పట్లో పదేపదే రాశాను. మానవ శరీరం తనకు తానే నష్టం కలిగించుకుని తన్ను తాను పరిసమాప్తి చేసుకునేటట్లుగా, కాంగ్రెస్‌ పార్టీ తన సొంత ప్రభుత్వాన్ని ధ్వంసం చేస్తోందని, మన్మోహన్‌ సింగ్‌ అతిత్వరలోనే విస్మృత గర్భంలో కలిసిపోతాడని రాశాను. 

మనం కాస్త నిజాయితీగా ఉందాం: 2018 చివరలో, మరొక ఎన్నికల సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ గురించి కథనాలు రాస్తామని మనలో ఎవరమైనా ఊహించామా? అది కూడా గతంపై వ్యామోహంతో సంవత్సరం చివరలో రాయడం కాదు.. ప్రధానిగానో, ఆర్థిక మంత్రిగానో కాకుండా, అనుకోకుండా రాజకీయ జీవితంలోకి ప్రవేశించి అనూహ్యంగా ఎదిగిన వ్యక్తి గురించి మళ్లీ మననం చేసుకుంటున్నాం. ఈ వారం మొదట్లో తన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఇలాగే చెప్పారు. 

అయన ఇప్పుడు ఏమాత్రం ‘మౌన మోహన్‌’ కాదు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. చాలా తక్కువగానే కావచ్చు కానీ చాలా పరిణతితో మాట్లాడతారు. యధాప్రకారంగానే ఆయన ఒకటి రెండు వాక్యాలు మాట్లాడతారు. కానీ దేశం మొత్తంగా ఆయన చెప్పేది వినడానికి, స్పందించడానికి సిద్ధమవుతోంది. కానీ తన రెండో దఫా పదవీకాలంలో దేశం ఆయన మాటలను వినలేదు. కానీ ఇప్పుడు ఆయన లాంఛనంగా చేసే ప్రసంగం కూడా వైరల్‌ అవుతోంది. అది తన ప్రసంగం పూర్తి పాఠం కావచ్చు, నిపుణుడైన రిపోర్టర్‌ కుదించి పంపిన వార్త కావచ్చు.. ఆయన ఏం చెప్పినా ఇప్పుడు అది వైరల్‌. కావాలంటే సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ని తనిఖీ చేసుకోండి.

ఆయన ఇప్పటికీ తన పార్టీకి ఎలెక్షన్‌ ప్రచారకర్తగా పెద్దగా తోడ్పడింది ఏమీ లేదు. కానీ పార్లమెంట్లో, బయటా తాను ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత విలువైన వాణిగా ఉంటున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ చేసిన రాజీనామా ప్రకటనపై ఆయన చేసిన క్లుప్తమైనదే కానీ అత్యంత సునిశితమైన, మర్యాదతో కూడిన వ్యాఖ్య ప్రభావం చూడండి లేక ఈ వారం మొదట్లో తన ఆరు సంపుటాల ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యను గమనించండి. తనను సింహం తోలు కప్పుకున్న భీరువులాగా కనిపించి ఉండవచ్చు కానీ తాను సైలెంట్‌ ప్రైం మినిస్టర్‌గా లేనని చెప్పారు. పైగా ప్రెస్‌ అడిగే ప్రశ్నలకు తాను ఏనాడూ భయపడింది లేదని చెప్పారు. 

ఇది అత్యంత నైపుణ్యంతో ఎక్కుపెట్టిన రాజకీయ చణుకు. గురి పెట్టింది ఒక చోట అయితే తగిలింది మరొక చోట అనే వైఖరికి ఇది నమూనా. ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి తనకున్న బలహీనతను ఉపయోగించడం అన్నమాట. ఆ వాక్యం సారాంశం ఏమిటంటే, నేను ఎక్కువగా మాట్లాడలేను కానీ ప్రశ్నలకు జవాబిస్తాను. మోదీ చాలా మాట్లాడతారు కానీ ప్రశ్నలనుంచి దాక్కుంటారు. ఆయన మాట్లాడిన పదిమాటలపై వ్యాఖ్యానం చేయడానికి నాకు దాదాపు వంద పదాలు అవసరమయ్యాయి.

ఈరకంగా రంగమీదికి తిరిగి రావడం అనేది 86 ఏళ్ల వృద్ధుడికి చెడువిషయం కాదు. అందులోనూ ఆయన జీవితకాలం కెరీర్‌ పొలిటీషియన్‌ కాదు. తనలోని మోదీని ఉన్నట్లుండి కనుగొని గొప్ప వక్తగా మారిన నేత కాదాయన. కాని తాను చేసిందల్లా తక్కువగా మాట్లాడటం, పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం. 

ప్రజాజీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి  ఆయనకు ఇదే శైలి వుంటూ వచ్చింది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హర్షద్‌ మెహతా రూపంలో స్టాక్‌ మార్కెట్‌ను తొలి కుంభకోణం తాకినప్పుడు పార్లమెంటుకు సింపుల్‌గా తాను చెప్పిందేమిటో తెలుసా. ‘స్టాక్‌మార్కెట్‌ కోసం నా నిద్రను నేను పాడుచేసుకోను’. కానీ అణు ఒప్పందంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు గురుగోవింద్‌ సింగ్‌ చెప్పిన పంక్తులను అద్భుతంగా వాడుకున్నారు. ‘‘నన్ను ఆశీర్వదించు శివా, నా తుది విజయం సాధించేవరకు పోరాడటానికి నాకు తప్పకుండా శక్తికావాలి’’.

తర్వాత ఏదో ఒకరోజు నీవు ప్రధానిగా అవుతావు అంటూ తన జ్యోతిష్కుడు చెప్పిన మాటలను పట్టుకుని జీవితం సాగిస్తున్న అడ్వాణీని ఆయన హేళన చేశారు. 2009లో తన పార్టీకి అధిక స్థానాలను సంపాదించి అధికారంలోకి వచ్చారు. ఆయన బలహీనుడు, పిరికి నేత కాబట్టి జనం సానుభూతితో ఆయనకు ఓటేయలేదు. అయన అంతకుముందే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి వామపక్షాలకు ఎదురు నిల్చారు. భారత్‌ వ్యూహాత్మకంగా సంపూర్ణంగా మారాలన్న తాత్విక విశ్వాసానికి మద్దతుగా ఆయన నిలబడ్డారు. అణుఒప్పందం ద్వారా భారత్‌ నిజంగా దిగుమతి చేసుకున్నది అమెరికాను పూర్తిగా కౌగలించుకోవడమే. నిర్ణాయక క్షణంలో దృఢంగా నిలబడినందుకు ఆయనకు రివార్డు లభించింది మరి. 

ఆ వెంటనే జరిగిందేమిటి? ప్రధానిగా తనను కించపరిచినప్పుడు, తన కార్యాలయ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆయన రాజీ నామా చేయకపోవడం ద్వారా తనను, అభిమానులను కూడా దెబ్బతీసినంత పనిచేశారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సీబీఏ ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వచ్చింది. మోదీ సైతం పార్లమెంటులో మన్మోహన్‌ని తీవ్రంగా పరహసించారు. తాను పరిశుద్ధంగా ఉన్నానంటూనే తన చేతిమీదుగానే అవినీతిని అనుమతించిన పరిస్థితిని రెయిన్‌ కోటులోపల షోయర్‌ కింద నిలబడటంగా మోదీ పోల్చి చెప్పారు. అంతవరకు ఆయన ఒక సాఫ్ట్‌ టార్గెట్‌గా కనిపించేవారు.

కానీ, ఆ తర్వాత మారిందేమిటి? ఈ జీవితంలోకి ఆయన్ని తిరిగి తీసుకొచ్చిందేమిటి? బహుశా 2016 శీతాకాలంలో పెద్దనోట్ల రద్దే కావచ్చు. అప్పుడు కూడా మన్మోహన్‌ క్లుప్తంగానే మాట్లాడాడు కానీ తన స్వభావానికి విరుద్ధంగా కత్తివాదరలాంటి చిరస్మరణీయ పంక్తిని సంధిం చారు. ‘‘సంఘటిత లూటీ, వ్యవస్థీకృత దోపిడీ.’’

ఆయన తన పార్టీకి ఎంత విలువను తీసుకొస్తున్నారో తొలిసారిగా ఆయన పార్టీ గుర్తించిన క్షణమది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు ఆయనకు కొట్టిన పిండే, ఎందుకంటే ఆయన రంగం ఆర్థిక శాస్త్రం. అప్పటికే పెద్దనోట్ల రద్దుపై ప్రపంచ ప్రముఖ ఆర్థిక వేత్తలు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. భారత్‌లో మన్మోహన్‌ సింగ్‌ విమర్శను చాలా సీరియస్‌గా పరి గణించారు. తర్వాత ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం మొదలు కాగానే ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు నష్ట నివారణలో భాగంగా డేటాను, గణాంకాలను తారుమారు చేయడం ప్రారంభమైంది. ఒకరకమైన సంక్షోభ భావన అలుముకుంటున్నప్పుడు మన్మోహన్‌ వాడిన పదాలు భవిష్యసూచకంగా కనిపించసాగాయి.

రాజకీయాలు అనబడే సంతలో ఏ ఉత్పత్తికైనా సరే పోల్చి చూపడం తప్పనిసరి. మన్మోహన్‌ని జాతి మళ్లీ సీరియస్‌గా స్వీకరింజడానికి ఒక కారణం ఏదంటే ఈ చేదురాజకీయాల్లో డిగ్నిటీకి, గౌరవానికి ప్రీమియం విలువ ఉంటూ వస్తోంది. సోనియాగాంధీని నరేంద్ర మోదీ అద్దెకోసం చూస్తున్న వితంతువుగా వర్ణించినప్పుడు, వాచ్‌మన్‌ లేక ప్రధాని ఒక దొంగ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించినప్పుడు, మన్మోహన్‌ తన విమర్శలో కూడా సభ్యతను పాటించారు.  

గతంలో నా వాక్‌ ది టాక్‌ ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావును ప్రశ్నిస్తూ ఆకర్షణ శక్తి లేనప్పటికీ, వక్త కానప్పటికీ, రాజకీయ బలం లేనప్పటికీ మిమ్మల్ని ఎందుకు ముందుపీఠికి తీసుకొచ్చారు అని అడిగాను. ‘‘నేను సాంత్వనను, ఓదార్పును తీసుకొచ్చాను’’ అన్నారాయన. మన్మో హన్‌ రాజకీయ మార్గదర్శకుడిగా తన పార్టీకి అలాంటి సాంత్వనను తీసుకొచ్చినందుకు ఆయన సంతోషపడే ఉంటారు. కానీ ఈ ఇద్దరు ప్రధానమంత్రుల పదవీవిరమణ అనంతర జీవితాల్లో చాల పెద్ద వ్యత్యాసం ఉంది. పదవి కోల్పోగానే పీవీవల్ల ఇక ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్‌ భావించింది. పైగా పార్టీకి ముస్లిం ఓటును దూరం చేసినందుకు పీవీని పక్కనపెట్టింది. అన్ని కేసుల్లోంచి విముక్తి పొందినవాడిగా, ఒంటరిగానే చనిపోయారు. పీవీకి మల్లే మన్మోహన్‌ సింగ్‌ను కూడా కాంగ్రెస్‌ డంప్‌ చేసేది.కానీ మూడు విషయాలు పరిస్థితులను భిన్నంగా మల్చాయి.  ఒకటి గాంధీ ప్యామిలీ ఆయన పట్ల చూపించిన వ్యక్తిగత అభిమానం. రెండోది, అత్యంత నైతికాధికారంతో పెద్దనోట్ల రద్దుపై మన్మోహన్‌ చేసిన ప్రారంభ ప్రకటన ప్రభావాన్ని వారు గుర్తించారు. మూడు తన హయాంలో వెల్లువెత్తిన అన్ని కుంభకోణాలు వీగిపోతుండటం.  

నమ్రతా మూర్తి అయిన మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక చరిత్రలో భారత్‌కు గొప్ప సంపదను సృష్టించి పెట్టారు. 1991 నుంటి డేటా మొత్తాన్ని పరిశీలించండి. ఆయన సంపద పోగు పెట్టలేదు. సంపద సృష్టి పట్ల ఆయనకు దురభిమానం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలమైన స్ఫూర్తితో పునరుద్ధరించిన తొలి ప్రధాని ఆయన. పురోగతి తప్పనిసరిగా అసమానతలను సృష్టిస్తుందని గ్రహించే మేధస్సు కూడా ఆయనకుంది. అలాంటప్పుడే రాజ్యం జోక్యం చేసుకుని సంపదను తిరిగి పంపిణీ చేయాల్సి ఉంటుందని, పేదలను మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టకూడదని కూడా తనకు తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అధికారం కోల్పోయాక ఇక నష్టపోయేది ఏమీ లేని స్థితిలో ఆధునిక, సంస్కరించబడిన ఆర్థిక వ్యవస్థ గురించి రాహల్‌ గాంధీకి మన్మోహన్‌ ట్యూషన్‌ చెబుతారా? అయితే రాహుల్‌ ఈ దఫా మన్మోహన్‌ చెప్పేది ఎంతవరకు వింటారనేది మనం గమనించాల్సిన అవసరముంది.

- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement