మన్మోహన్‌సింగ్ తన హయాంలో ‘దేశ వనరులపై తొలి హక్కుదారులు మైనారిటీలే’ అని చెప్పిన మాట కాంగ్రెస్‌పార్టీని ఈనాటికీ వెంటాడుతూనే ఉంది. యూపీఏ మొత్తం మీద హిందూ జాతీయవాద ఆవరణాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం వదిలివేసింది. రాహుల్ గాంధీ తన మతాన్ని కాంగ్రెస్ రాజకీయాలతో దుస్సాహసికంగా కలగాపులగం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయన గెలవచ్చు లేక పరాజయం చెందవచ్చు కానీ, ఈ సరికొత్త చక్రవ్యూహం నుంచి రాహుల్ వెనుదిరగలేరు. పైగా ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ అనే ఆటను రాహుల్ ప్రదర్శిస్తున్నట్లయితే, అది 1989లో తన తండ్రి రాజీవ్ గాంధీని ఎక్కడికి తీసుకెళ్లిందో తప్పక తెలుసుకోవాలి.
రాహుల్ గాంధీ సనాతన హిందువుగా, అగ్రశ్రేణి బ్రాహ్మణుడిగా తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంటున్న తీరు ఆయన సైద్ధాంతిక ప్రత్యర్థులను కలవరపర్చింది. అదేసమయంలో ఆయన స్నేహితులను ఆగ్రహంలో ముంచెత్తింది. ఇద్దరి నుంచి రాహుల్ తీవ్ర వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన అత్యంత సాహసోపేతమైన, చురుకైన రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టేశారు. రాహుల్ ఎత్తుగడతో బీజేపీ ఎంత చికాకు పడిందంటే, తాను జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడినని రాహుల్ చేసిన ప్రకటనకు సాక్ష్యాధారంగా ఆయన గోత్రం ఏమిటో తెలుసుకోవాలని మొదటగా ప్రయత్నించింది. రాహుల్ గోత్రం ఏదో వెల్లడయినప్పటికీ బీజేపీ కుదుటపడలేదు. ఇప్పుడు తన శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిని ముగ్గులోకి దింపింది. తరతరాలుగా బ్రాహ్మణ గోత్రం ఎలా ప్రయాణిస్తూ వచ్చిందనే లోతైన సాంకేతిక అంశాలను ఈయన ప్రస్తుతం లేవనెత్తారు.
భారతదేశ అతిపెద్ద లౌకికవాద పార్టీగా తనను తాను అభివర్ణించుకునే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రదర్శించిన రాజకీయ దుస్సాహసిక తత్వం ఏం సాధించిపెట్టిందో చూద్దాం. ఇటీవలివరకు రాహుల్ అసలు హిందువా లేక క్రిస్టియన్ మతానికి దగ్గరివాడా అనే చర్చే ప్రధానంగా సాగుతూ వచ్చింది. తర్వాత రాహుల్ బ్రాహ్మణుడేనా అనే చర్చకు మళ్లింది. ఇప్పుడైతే రాహుల్ గాంధీ దత్తాత్రేయ గోత్రం నుంచి వచ్చిన కశ్మీరీ కౌల్ బ్రాహ్మణుడేనా అనే అంశంపై చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో మతం, కులం, గోత్రం ఇప్పుడు కేంద్రబిందువుగా మారి నందున ఈ పరిణామాన్ని పురోగతిగానే చెప్పాలి. ఇది విలువల గొలుసుకట్టులో ఒక ముందంజే మరి.
దీన్నంతటినీ రాహుల్ ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చారా లేక గుజరాత్ ఎన్నికల సమయంలో అక్కడున్న కొన్ని దేవాలయాలను సందర్శించిన తర్వాత అనుద్దేశపూర్వక పర్యవసానాల సూత్రం తన పాత్రను ఇక్కడ చేపట్టిందా అనేది మనకు తెలీదు. మీరు రాహుల్/కాంగ్రెస్ మద్దతుదారు అయితే, మీరు ఈ సందర్భంగా ‘రాజకీయ మహా యుక్తి’ అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తారు. ఇది వాస్తవానికి మోదీ–షా మద్దతుదారులు కాపీ రైట్ తీసుకున్న వ్యక్తీకరణ. మీరు బీజేపీ మద్దతుదారు అయితే, రాహుల్ ఏమాత్రం సురక్షితం కాని రాజకీయ ప్రస్థానంలోకి నిర్లక్షపూరితంగా ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. అంటే తన ఈ చర్యద్వారా హిందూ ఓటును పొందలేరు, మరోవైపున సెక్యులర్ ఓటును ప్రత్యేకించి ముస్లిం ఓటును పొందలేరు అని వీరి ఉద్దేశం. దేశ కేంద్రభాగంలో వాడే హిందీలో వారు ఇలా చెబుతారు: ‘‘దువిధా మైన్ దోనో గటే, మయా మిలీ న రామ్’’ (నా గందరగోళంలో నేను రెండింటినీ కోల్పోయాను: అవేమిటంటే ప్రాపంచిక సంతోషాలు, దేవుడు)
నేను దీన్ని మరోలా వర్ణిస్తాను. కానీ కాస్సేపటి తర్వాతే మరి. ఈ వివాదంపై తాజాగా, ప్రత్యేకించి చక్కటి వాదనతో సాగిన చర్చకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో సుహాస్ పాల్షికర్ వ్యాసం తావిచ్చింది. రాహుల్ తాను నిజంగా అస్తికుడినే అని ప్రదర్శించుకోవాలంటే తన నానమ్మ ఇందిరాగాంధీ చేసినట్లుగా అన్ని మతాల ప్రదేశాలను ఆయన దర్శించలేడా అని సుహాస్ ప్రశ్నించారు. ఈ అభిప్రాయాన్నే స్వీకరిస్తూ నెహ్రూ, మహాత్మాగాంధీ జీవిత చిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు. ‘రాహుల్ గాంధీ నీతిబాహ్యమైన ఆలయాల సందర్శన తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న పార్టీ అత్యుత్తమ సంప్రదాయాలకు పచ్చి ద్రోహం చేయడమే అవుతుంది. గాంధీ, నెహ్రూ ఇద్దరూ మెజారిటీని అనుసరించడం అనే ఈ సిగ్గుమాలిన చర్యను చూసి తీవ్రంగా బాధపడేవాళ్లు.‘ ది ప్రింట్ వెబ్‌సైట్‌లో ప్రగతిశీల రచయిత, మేధావి దిలీప్ మండల్ రాస్తూ, వారసత్వ హక్కు ద్వారా బ్రాహ్మణులకు దక్కుతున్న 30 రకాల సౌకర్యాల జాబితాను పేర్కొంటూ అందుకే రాహుల్ దానికి ఆకర్షితుడయ్యాడని వ్యంగ్యంగా రాశారు. ఇక వామపక్షాల వద్దకు వస్తే వారి విమర్శ మరింత కర్కశంగా ఉంటుంది. వీరి వాదనల్లో కొన్నింటిని ప్రస్తావించనివ్వండి.
రాహుల్‌పై మధ్యేవాదుల ఆరోపణ ఏమిటంటే ఆయన కపటత్వ ధోరణే. రాజకీయాల్లో కపటత్వం ఎప్పటినుంచి చెల్లుబాటు అవుతూ వచ్చినట్లు? కానీ, అది రాజకీయాల్లో తప్పనిసరి సాధనం. కపటత్వంతో లేని ఒక్కరంటే ఒక్క రాజకీయవాదిని చూపించండి మరి. అలాంటివాళ్లను నేను పరాజితుడిగానే చూపిస్తాను. నా వృత్తిలో తొలి సంవత్సరాల్లో భారతీయ రాజకీయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాను తన, తన కుటుంబ జీవన శైలి గురించి ప్రశ్నిస్తూ, వారు పేదరైతు గురించి మాట్లాడతామని చెప్పడం కపటత్వం కాదా అని అడిగాను. దానికి ఆయన ఒకటే చెప్పారు. ‘భాయి సాబ్, హమ్ రాజ్‌నీతి కర్నే ఆయే హై, యా తీర్థయాత్రా పే‘ (మేం రాజకీయాలు చేస్తున్నామా లేక తీర్థయాత్రలా)?
ఇది పూర్తిగా మతపరమైన దేశం. అన్ని భారీ ఎన్నికల్లోనూ భారతీయుల్లో 99 శాతం మంది తాము ఆస్తికులమే అని చెబుతుంటారు. మన దేశంలో నాస్తికుల సంఖ్య మన నోటా ఓటర్లతో పోలిస్తే కూడా అతి చిన్న విభాగంగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఎవరూ ఓటెయ్యరు. నెహ్రూ తన ఆజ్ఞేయతా వాదాన్ని (దేవుడు ఉన్నాడో లేదో తేల్చిచెప్పలేమనే వాదం) చివరివరకూ నిలుపుకున్నారు. ఎందుకంటే అవి స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో గడిచిన రోజులు. పైగా ఆయన నెహ్రూ మరి. ఆయన కుమార్తె మాత్రం త్వరగా దాన్ని సరి దిద్దారు. మందిర్ అన్నా, సాధువులు అన్నా, పూజలన్నా ఆమె ఎన్నడూ సిగ్గుపడలేదు. పైగా ఆమె ధరించే రుద్రాక్ష మాల గురించి చెప్పపనిలేదు.
కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికల్లో 44 స్థానాలకు మాత్రమే పరి మితం చేసిన బీజేపీ హిందూయిజంపై గుత్తాధిపత్యం ప్రకటించుకున్న ప్రస్తుత సమయంలో, తన నానమ్మ వదిలివెళ్లిన జంధ్యాన్ని తాను స్వీకరించాలని రాహుల్ భావిస్తున్నట్లయితే, అదే నిజమైన చురుకైన రాజ కీయం అవుతుంది. మీ దేవుళ్లను మీ ప్రత్యర్థికి ఎందుకు అప్పగిస్తారు? దాన్ని మీరు నీతిబాహ్యమైన చర్య అని పిలవచ్చు. నిజమైన నీతివంతమైన రాజకీయవాదిని, అంటే మర్యాదా పురుషోత్తముడిని కనుగొనడానికి మీకు స్వాగతం చెబుతున్నాను. కానీ నేనయితే అలాంటి వారిని ఇంకా చూడలేదు. ప్రస్తుతం రాజీలు కొనసాగుతాయి. ట్రిపుల్ తలాక్‌ను సంరక్షిస్తున్న రాహుల్ పార్టీ రామాలయంపై మాత్రం మౌనం పాటిస్తుంది. శబరిమలపై ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి కూడా ఇదే. మధ్యప్రదేశ్‌లో దాని ఆవు, ఆవు మూత్రం చుట్టూ తిరిగిన మేనిఫెస్టోను ఒకసారి తనిఖీ చేయండి. రాహుల్‌పై ఉదారవాదుల అసమ్మతిని అర్థం చేసుకోవచ్చు. కానీ నెహ్రూ యుగం నాటి కరడుగట్టిన లౌకికవాదంతో రాహుల్ రాజకీయాల్లో మనుగడ సాధించలేరు.
లౌకికవాదం దన్నుతో రాహుల్ ఇప్పుడు జేఎన్‌యూతోపాటు ఎక్కడా గెలుపొందలేరు. పైగా ఆధునిక భారత చరిత్రలో అత్యంత ప్రముఖ పరాజితుడిగా మిగిలిపోతారు కూడా. పైగా, తన నానమ్మ మార్గంలోకి వెనుదిరిగినట్లయితే, విశ్వాసంపై, జాతీయవాదంపై బీజేపీ గుత్తాధిపత్యాన్ని రాహుల్ తోసిపుచ్చడానికి వీలు కలుగుతుంది కూడా.
నెహ్రూ తన వెనుక వదిలి వెళ్లిన భారత్‌కి పూర్తి భిన్నమైన ఇండియాలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఈ వారం ప్రాంరంభంలో ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఫాలి నారిమన్ రాజ్యాంగ దినోత్సవం ప్రసంగంలో దీన్నే అద్బుతంగా వివరించారు. రాజ్యాంగ పండితుడు గ్రాన్‌విల్లె ఆస్టిన్ సూక్తిని ప్రస్తావిస్తూ ఆయన ఇలా చెప్పారు. ‘మన రాజ్యాంగంలోని మూడు చిక్కులను ఆస్టిన్ చూశారు. జాతీయ ఐక్యత, సమగ్రతను పరిరక్షించి విస్తరించడం, ప్రజాస్వామ్య సంస్థలను నెలకొల్పడం, సామాజిక సంస్కరణలను పెంచిపోషించడం. ఇవన్నీ కలిసి ఒక అతుకులేని అల్లికను ఏర్పర్చాయి. కానీ లోతుగా పరికిస్తే, మరొక శక్తిమంతమైన నాలుగో చిక్కు కూడా ఉంది. అదేమిటంటే సంస్కృతి.
మతాన్ని, సాంప్రదాయాన్ని పొదవుకున్న ఆ సంస్కృతి చట్రంలో కాంగ్రెస్, యూపీఏ, సోనియా, దాదాపు వామపక్ష స్వభావంతో కూడిన ఆమె ఎన్‌ఏసీ మొత్తంగా దారితప్పిపోయాయి. వారు ఏకాకులైపోయినట్లు కనిపిస్తున్నారు. కత్తివాదరలాంటి, ఆజ్ఞేయతావాదానికి సమీపంలో ఉన్నటువంటి అలాంటి లౌకికవాద స్థాయిని ఆమోదించడానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా లేదు. మన్మోహన్‌సింగ్ ఆ రోజుల్లో, ‘దేశ వనరులపై తొలి హక్కుదారులు మైనారిటీలే’ అని చెప్పిన మాట కాంగ్రెస్‌పార్టీని ఈనాటికీ వెంటాడుతూనే ఉంది. యూపీఏ మొత్తం మీద హిందూ జాతీ యవాద ఆవరణాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం వదిలివేసింది.
రాహుల్ తీసుకున్న ఈ ఆకస్మిక మార్పు తాత్విక పరిపూర్ణత, గాఢతా పరీక్షలో బహుశా విఫలం కావచ్చు కానీ అపరిచితమైన రిస్కును ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన పరిణామం. తనకు పరిచయం కాని పిచ్‌మీద రాహుల్ దుస్సాహసికంగా అడుగు మోపారు. రాహుల్‌ని సరిగ్గా తాము కోరుకున్న చోటే పట్టుకున్నామని బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌లో చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గురించిన మరొక వర్ణనకు ప్రాధాన్యమివ్వాలని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అది ఇక్కడే ఉంది. ఇది రాజకీయ చక్రవ్యూహంలోకి నడవడం లాంటిదే. దీంట్లో రాహుల్ గెలవచ్చు లేక చిత్తుగా ఓడిపోవచ్చు. కానీ తాను ఈ వ్యూహంలోంచి మాత్రం వెనుదిరగలేరు. పైగా ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ అనే ఆటను రాహుల్ ప్రదర్శిస్తున్నట్లయితే, అది 1989లో తన తండ్రి రాజీవ్ గాంధీని ఎక్కడికి తీసుకెళ్లిందో ఆయన తప్పక తెలుసుకోవాలి.
- శేఖర్ గుప్తా
ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
రాహుల్ ప్రయాణం ఎటువైపు?
Published Sat, Dec 1 2018 12:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment