ఇండియా కూటమి చీలిపోయిందంటూ ఇటీవల ప్రభుత్వ అనుకూల మీడియా తరచూ ప్రచారం చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఇకపోతే ప్రధాని మోదీ ఇటీవల బీజేపీ వివిధ రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్ర పక్షాలను కలుపు కొని 400 సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పారు. దీన్నే ప్రామాణికంగా తీసుకొన్న వివిధ స్థాయుల్లోని బీజేపీ నాయకులూ బహుళ ప్రచారంలో పెట్టారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో మీడియా ‘ఇండియా’ కూటమి బలహీన పడిందంటూ బహుళ ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి.
ఇటీవలనే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ–కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ గతంలో గెలుచుకున్నన్ని స్థానాలు సంపాదించడం కష్టమని అంచనా. గతంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు సున్నితమైన పుల్వామా అంశం తెరపైకి వచ్చి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. కాబట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల పేపర్లు లీక్ కావటంతో యోగీ ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తానని ప్రకటించింది. దీంతో యాభై లక్షలమంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడనుందని అంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి క్షత్రియ కులానికి చెందినవాడు. బ్రాహ్మణుల్లో తమకు యోగి ప్రభుత్వంలో సరియైన ప్రాతినిధ్యం లేదనే భావన ఉండటంతో ఈసారి ఆయనకు వ్యతిరేకంగా వారు పనిచేయవచ్చు. ఇక ఎన్డీయేలో భాగస్వామి అయిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తరచూ కూటములు మార టంతో ఆయన పలుకుబడి కుర్మీలలో బాగా తగ్గింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే గతంలో బీజేపీకి వచ్చినన్ని సీట్లు ఈసారి రావనేది రాజకీయ పరి శీలకుల భావన. ఈ సీట్లలో చాలావాటిని ‘ఇండియా’ కూటమే గెలుచుకుంటుందంటున్నారు.
ఇక బిహార్ విషయాని కొద్దాం. ముఖ్యమంత్రి నితీశ్ పిల్లిమొగ్గలతో మొత్తం ఎన్డీయే మీదే అక్కడి ఓటర్లలో వ్యతి రేకత బాగా ఏర్పడింది. ఇక్కడ ఈసారి లాలూప్రసాద్ పార్టీ ఆర్జేడీ బలం పుంజుకొంది. దీనికితోడు కాంగ్రెస్, కమ్యూ నిస్టులు ఈసారి అక్కడ కలిసి పోటీచేయాలనుకుంటు న్నారు. ఇది ‘ఇండియా’ కూటమికి ప్రయోజనం కలిగే అంశం. ఇక బెంగాల్‌లో మమతా ఒంటరి పోరేనంటోంది. అక్కడ త్రిముఖ పోటీ ఉండటంతో ప్రభుత్వ ఓట్లు చీలి టీఎంసీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే తనను ముఖ్యమంత్రిగా చేయనందుకు రగిలిపోతోంది. ఆమె ఈసారి చురుగ్గా పనిచేయకపోవచ్చు.
ఇక ఈశాన్యరాష్ట్రాలలో ఈసారి మణిపుర్ గొడవలు బీజేపీకి నష్టం చేకూర్చనున్నాయి. హిమాచల్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ‘ఇండియా’ కూటమికి అను కూలాంశం. కాంగ్రెస్–ఆప్ పొత్తు కుదుర్చుకున్నాయి కాబట్టి ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాలలో ఇండియా కూటమి మెరుగయ్యే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, శివసేనలను చీల్చి బీజేపీ చేసిన రాజకీయాలు ఓటర్ల మనో ఫలకాలపై వ్యతిరేక ముద్ర వేసిందనే చెప్పాలి.
ఇక దక్షిణాదిలో... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌డీయే ఖాతా తెరిచేది గగనమే. తెలంగాణలో గతంలో 4 స్థానాలు గెల వగా ఇప్పుడు వాటిని నిలబెట్టుకొని, మరిన్ని స్థానాలు కైవసం చేసుకోగలదా అన్నది చూడాలి.
బీజేపీ రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రజాబాహు ళ్యంలోకి బాగా వెళ్లిందనీ, ఈసారి అదే అంశం బీజేపీకి అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు ఉత్తర భారతంలో విశేష ప్రజాదరణ లభిస్తున్నందున బీజేపీకి అది అననుకూల అంశమే అవుతుంది.
పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే, ఆ పార్టీ తమ ‘టార్గెట్ 400’ అంటూనే, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తుకు దిగుతోందని విశ్లేషణ.
– డా‘‘ కె. సుధాకర్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ ‘ 89850 37713
కూటమి నిజంగా బలహీన పడిందా?
Published Sun, Mar 10 2024 5:08 AM | Last Updated on Sun, Mar 10 2024 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment