
విశ్లేషణ
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు!
ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు.
సుంకాల వెనుక రెండు లక్ష్యాలు
విచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం.
దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం.
చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది.
మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?
దేశాల స్పందన
ట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు.
యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది.
ఇండియా మౌనం వెనుక...
ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది.
అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!
ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది.
ట్రేడ్ ట్యారిఫ్‌లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.
సంజయ బారు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)