ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా? | Sakshi Guest Column On America China Jinping and Trump | Sakshi
Sakshi News home page

ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?

Published Wed, Dec 11 2024 5:52 AM | Last Updated on Wed, Dec 11 2024 7:16 AM

Sakshi Guest Column On America China Jinping and Trump

ట్రంప్‌ తిరిగి ఎన్నిక కావడం ఆయన చైనా విధానం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. అది ఇండో–పసిఫిక్‌ క్రియాశీలక శక్తులను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా అమెరికా–చైనా ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాన్ని అందిస్తుంది.

గతం నాంది అయినట్లయితే, అమెరికా అధ్యక్షులు వారి రెండవ టర్మ్‌లో మరింత దూకుడుగా ఉంటారని చెబుతారు. ట్రంప్‌ 2.0 చైనా విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. ఎందుకంటే, తన మొదటి హయాంలో ట్రంప్, బీజింగ్‌తో వాషింగ్టన్‌ ప్రాథమిక ఒడంబడికనే మార్చేశారు. 1970ల చివరలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరినప్పటి నుండి, ఆర్థిక, శాస్త్రీయ సాంస్కృతిక రంగా లలో సహకారం పెరిగింది. ట్రంప్‌ రెండు దేశాల మధ్య ఆ బంధాన్ని తెంచేశారు.

వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలు, భద్రతలో సవాళ్లను కూడా పరిష్కరించాలని ట్రంప్‌ చూస్తున్నారు. వాణిజ్య లోటును తగ్గించేందుకు చైనా దిగుమతులపై ట్రంప్‌ ప్రభుత్వం సుంకాలు విధించిన నేపథ్యంలో చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. చైనా సంతకం చేసిన వాణిజ్య ఒప్పంద నిబంధనల ప్రకారం, అమెరికా ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచడానికీ, మేధో సంపత్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికీ, అమెరికన్‌ ఆర్థిక సంస్థలకు ఎక్కువ మార్కెట్‌ అందుబాటు ఇవ్వడానికీ అంగీకరించింది. 

అయితే, ట్రంప్‌ ప్రభుత్వం జిన్‌పింగ్‌ నేతృత్వంలోని చైనాను వ్యూహాత్మక ప్రత్యర్థిగా ముద్ర వేసింది. అందువల్ల, జాతీయ భద్రతా ఆందోళనలు ముఖ్యమైనవిగా మారాయి. సున్నితమైన రంగాలలో చైనీస్‌ పెట్టుబడులపై నియంత్రణలు, హువై, జీటీఈ వంటి చైనీస్‌ బడా వాణిజ్య సంస్థలపై పరిమితులు పెరిగాయి. టెలికాం నెట్‌వర్క్‌లు, సెల్‌ఫోన్‌ యాప్‌ పర్యావరణ వ్యవస్థలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లలో చైనీస్‌ ప్రభావాన్ని ఎదుర్కోవాలనే ఒత్తిడి పెరిగింది.

ఇదే పునాదిపై బైడెన్‌ పరిపాలన చైనాకు సున్నితమైన సాంకేతికత, పెట్టుబడి, మానవ మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తూ తన చైనా విధానాన్ని నిర్మించింది. జిన్‌పింగ్‌ చైనా ఎలక్ట్రిక్‌ వాహనాల వంటి సాంకేతికత ద్వారా తన ప్రాధాన్యతను పెంచుకోగా, అమెరికా దాన్ని సుంకాల విధింపు ద్వారా దెబ్బతీసింది. అందువల్ల, రిపబ్లికన్, డెమొ క్రాట్‌ పరిపాలనల రాజకీయ ఎజెండా మొత్తంగా ఏమిటంటే చైనాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించే చర్య లను పెంచడమే.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ట్రంప్‌ వస్తూ త్పత్తిలో అమెరికా ప్రాధాన్యతను పునరుద్ధరించడానికి ప్రయ త్నించారు. అధునాతన సమాచార సాంకేతికత, హై–ఎండ్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ మెషినరీ, రోబోటిక్స్, వైమానిక సామగ్రి, సముద్ర ఇంజనీరింగ్‌ టెక్నాలజీ వంటి ముఖ్యమైన రంగాలలో ఆధిపత్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న జిన్‌పింగ్‌ పాలనలోని చైనా తయారీ రంగ చొరవపై ట్రంప్‌ దెబ్బకొట్టారు. 

అధునాతన రైలు పరికరాలు, శక్తిని ఆదా చేసే వాహనాలు, విద్యుత్‌ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, బయో ఫార్మాస్యూటికల్స్, అధిక పనితీరు గల వైద్య పరికరాలు తదితర చైనా వస్తువులపై అధిక సుంకాలు విధించాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్‌ –19ని జిన్‌పింగ్‌ తప్పుగా నిర్వహించడమే 2020 ఎన్నికలలో తన పతనానికి దారితీసిందని ట్రంప్‌ భావిస్తున్నారు.

చైనా విషయానికి వస్తే, ట్రంప్‌ తిరిగి రావడం దాని రాజకీయ, ఆర్థిక పథాలపై ఆందోళనలను రేకెత్తించింది. పాలనా మార్పు ద్వారా కమ్యూనిస్ట్‌ పార్టీని తొలగించే ప్రయత్నాలు జరగవచ్చని కూడా జిన్‌పింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలలో కూడా దీని ప్రతిధ్వని వినిపించింది. చైనా ఉద్దేశించిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి లక్ష్యమైన 5 శాతాన్ని సాధించకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 

అమెరికా, చైనాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు, ఆర్థిక మాంద్యం బీజింగ్‌ను అమెరికన్‌ సంస్థలకు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానం నుంచి తొలగించాయి. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో   పియన్‌ వాణిజ్య సంస్థలు తాము పెట్టిన పెట్టుబడికి గానూ తగ్గిన రాబడులపై ఆందోళన వ్యక్తం చేశాయి. చైనీస్‌ మార్కెట్‌లోని సమస్యలు అపరిష్కృతంగానే ఉంటాయని అవి నమ్ముతున్నాయి. 

నియంత్రణ సమస్యలకు సంబంధించి చూస్తే, ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యాపార సంస్థలకు ప్రాధాన్యత, మార్కెట్‌–ప్రాప్యత అడ్డంకులు, మితిమీరిన సామర్థ్యం కారణంగా చైనాలో పెట్టుబడి పెట్టడం గురించి ఈ సంస్థలు పునరాలోచించవలసి ఉంటుంది. భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా టెక్‌ కంపెనీలు చైనా నుండి నిష్క్రమించడం కూడా దీనికి తోడ్పడింది.

భారతదేశం దీన్నుంచి తన ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ట్రంప్‌ గెలిచిన తర్వాత ఆయనతో అనుసంధానం అయిన మొదటి నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న తొలి సమయంలో సంబంధాలను పెంచుకోవడానికి మోదీ ప్రయత్నించారు. చైనాతో పాశ్చాత్య దేశాల విరక్తిని మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్‌ ఉపయోగించుకోగలదా అనేది ప్రశ్న. 

ట్రంప్‌ తొలి హయాంలో పునాది ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా సైనిక సహకారం అభివృద్ధి చెందింది. భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ఢిల్లీ తన నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాని రక్షణ– పారిశ్రామిక సముదాయాన్ని మెరుగు పరచాలి. ట్రంప్‌ హయాంలో, 2017లో ‘క్వాడ్‌’ పునరుత్థానం చెందింది. పాకిస్థాన్‌ అధోగతి పాలైనవేళ, కశ్మీర్‌లో ఉగ్ర వాదం మళ్లీ పుంజుకుంటున్న వేళ, తన మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఆందోళనలను పట్టించుకున్న ట్రంప్‌తో విధిగా మాట్లాడుతుండాలి. 

– హర్ష్‌ వి. పంత్, ‘ఓఆర్‌ఎఫ్‌’ చైనా స్టడీస్‌ ఉపాధ్యక్షుడు
– కల్పిత్‌ మన్కికర్, ‘ఓఆర్‌ఎఫ్‌’ చైనా స్టడీస్‌ ఫెలో
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement