సుష్మ వ్యాఖ్యలు అర్థరహితం
రాజీవ్‌కు 30 ఏళ్ల కిందే న్యాయవ్యవస్థ క్లీన్‌చిట్: రాహుల్
న్యూఢిల్లీ: బోఫోర్స్ స్కాం, భోపాల్ గ్యాస్ కేసుల్లో తన తండ్రి రాజీవ్ గాంధీకి భారత న్యాయవ్యవస్థ 30 ఏళ్ల క్రితమే క్లీన్‌చిట్ ఇచ్చిందని... బీజేపీ మాత్రం ఆయనపై బురద చల్లడం మానడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి నరేంద్రమోదీ నుంచి దేశాన్ని రక్షించేం దుకు తానున్నానని వ్యాఖ్యానించారు.
ఎన్డీయే ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ ఎంపీలతో కలసి చేపట్టిన ఆందోళనలో రాహుల్ మాట్లాడారు. ‘‘నల్లధనానికి, రాజకీయ వ్యవస్థకు మధ్య లలిత్ ఒక కీలకమైన లింక్. ఈ నెట్‌వర్క్‌ను సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వసుంధర రాజే కాపాడుతున్నారు’’ అని అన్నారు. లలిత్‌మోదీ అంశంలో ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు. మోదీ దమ్మున్న వ్యక్తి అని తాను భావించానని.. కానీ ఆయనకు దమ్ము లేదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లుపైనా పట్టుదలగా ఉన్నట్లు కనిపించి, వెనక్కితిరిగి పారిపోయారని ఎద్దేవా చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆక్రమిస్తోంది: దేశంలో విద్యాసంస్థలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలసి నిరసన తెలిపింది.