ప్రదాని మోడీకి స్వాగతం పలుకుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ నవ్వుకోవడం కనిపించింది. ప్రధాని పర్యటన దిగ్విజయంగా ముగియడంపై హర్షం వెలిబుచ్చడానికి సుష్మ స్వయంగా ఆయనను స్వాగతించడానికి వెళ్లారని సమాచారం. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధానిని ఒక మంత్రి స్వాగతించడం చాలా ఏళ్లుగా జరగడం లేదు.
కాగా, బుధవారం ఉదయం మోడీకి ఆయన బసచేసిన టోక్యోలోని ఇంపీరియల్ హోటల్ సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. హోటల్ చెఫ్‌లతో మోడీ కరచాలనం చేశారు. జపాన్ తనపై ఎంతో ఆదరం చూపి, అద్భుతమైన ఆతిథ్యమిచ్చిందని మోడీ ఆ దేశ ప్రజలకు ఢిల్లీ వచ్చాక ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు జపాన్ భాషలోనూ ట్వీట్ చేశారు. జపాన్‌తో అనుబంధాలకు సంబంధించి తన పర్యటన భారత్‌లో సానుకూలత, ఆశావాదాన్ని సృష్టించిందని సుష్మ అన్నారని వెల్లడించారు. మోడీ పర్యటనలో జపాన్ మన దేశానికి మౌలిక వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్ల సాయం ప్రకటించడం, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో ఐదు ఒప్పందాలను కుదుర్చుకోవడం తెలిసిందే. 1998 నాటి భారత్ అణుపరీక్షల నేపథ్యంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌పై విధించిన నిషేధాన్ని జపాన్ ఎత్తేసింది.