ఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్ వీలర్ సమన్లను అందుకున్నారు.
నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషన్ సహా, పలువురు దౌత్య వేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చింది కెనడా. అంతేకాదు వారిని విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయాన్ని ఖండించింది భారత్. కెనడా వాదన అసమంజసమని కొట్టిపారేసింది. ట్రూడో సర్కార్ రాజకీయ ఎజెండాలో భాగమేనంటూ ఫైరయ్యింది.
ట్రూడోకు భారత్ పట్ల విధ్వేష భావం ఉందని భారత్ తన ప్రకటనలో తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద,వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రూడో తన కేబినెట్‌లో చేర్చుకున్నారని విమర్శించింది.
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో గతేడాది వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని నాటి నుంచి నేటి వరకు తమతో పంచుకోలేదని భారత్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించింది.
కెనడా హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘హై కమీషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా విశిష్టమైన సేవలందించారు. భారత్‌లోనే అత్యంత సీనియర్ దౌత్యవేత్త. సంజయ్ కుమార్ జపాన్, సూడాన్‌లలో రాయబారిగా ఉన్నారు. ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలలో కూడా సేవలందించారు. అలాంటి దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సందర్భంగా కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో హై కమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బంది భారత్‌కు తిరిగి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment